చండ్రుగొండ/కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: చండ్రుగొండ-కొత్తగూడెం మండలాల మధ్య రాఘవాపురం సమీపంలో గల పెదవాగు బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి మధ్య భాగంలో సపోర్టుగా ఉన్న రెండు పిల్లర్లు శిథిలావస్థకు చేరి కుంగిపోయాయి. దీంతో మధ్యభాగంలో బ్రిడ్జి కూలిపోయే దశకు చేరుకుంది. సమాచారం తెలుసుకున్న చండ్రుగొండ ఎస్‌ఐ దేవేందర్‌రావు సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగించవద్దని తహసీల్దార్ ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెదవాగులో పాఠశాల బస్సుపడి ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందిన విషయాన్ని ఈప్రాంతం ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అలాంటి ఈవాగుపై ఉన్న బ్రిడ్జిపరిస్థితిని వివరిస్తూ... ‘సార్లూ... పెద్దవాగు గుర్తుందా.. పొంచి ఉన్న మరోప్రమాదం’ అనే శీర్షికన ఈనెల 18వ తేదిన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. బ్రిడ్జిపై ప్రమాదం పొంచి ఉండటంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోగా, శుక్రవారం నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో చండ్రుగొండ-కొత్తగూడెం మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం తరపున ఈ ప్రాంతంలో పర్యటించిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. బ్రిడ్జి పునర్‌నిర్మాణంతోపాటు సుజాతనగర్ - తిప్పనపల్లి మధ్య డబుల్‌రోడ్డు నిర్మాణం చేయిస్తామని మంత్రి చేసిన ప్రకటన నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ బ్రిడ్జిపై ప్రమాదం పొంచి ఉన్నప్పటకీ రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇటు వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని ఈప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
బ్రిడ్జిపై ప్రయాణాలు నిలిచిపోవడంతో చండ్రుగొండ - సుజాతనగర్, కొత్తగూడెం మధ్య నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ఈ మార్గం గుండా రాకపోకలు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో సుమారు 20 గ్రామాల మధ్య పెదవాగు బ్రిడ్జి ప్రధాన వారధిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు సత్వర చర్యలు తీసుకుని మరమ్మతులు నిర్వహించాలని తుంగారం సర్పంచ్ బాణోత్ పార్వతి, నాగా సీతారాములు, రాఘవాపురం సర్పంచ్ వెంకట సాంబయ్య, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు కోరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట
వైఎస్సార్‌సీపీ నేతలు పొంగులేటి, తాటి
చండ్రుగొండ, న్యూస్‌లైన్ : పెదవాగుపై బ్రిడ్జి కుంగి ప్రమాదభరితంగా మారిన ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తాటి వెంకటేశ్వర్లు స్పందించారు. సుజాతనగర్-చండ్రుగొండ మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయిన సమాచారం తెలుసుకున్న వారు శుక్రవారం రాత్రి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి ఇది నిదర్శనమన్నారు. పాఠశాల బస్సుప్రమాదం జరిగి, ఎనిమిది మంది పిల్లలు చనిపోయినా ఈవాగు పరిస్థితిపై ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. చండ్రుగొండ - కొత్తగూడెం రెండు మండలాల మధ్య 20 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు చేసే ప్రధాన మార్గమైన ఈ రోడ్డులోని బ్రిడ్జి శిధిలమై ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం పాలకపక్షం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
కుంగిన పెదవాగు బ్రిడ్జి
Published Sat, Oct 26 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement