
సాక్షి ప్రతినిధి, తిరుపతి: భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.26 లక్షల మంది ఇంటింటా సర్వే నిర్వహిస్తూ కరోనా బాధితుల వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఆదివారం తిరుపతిలోని మంత్రి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ నూతనంగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామ సచివాలయ వ్యవస్థ పేరు ప్రతిష్టలను పెంచుతోందని మంత్రి వివరించారు. అన్ని జిల్లాల్లో వలంటీర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వలస కూలీలు రాష్ట్రానికి చేరుతున్నారని, అలాంటి వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలో క్వారంటైన్‌లో 48 మందిని ఉంచినట్లు వివరించారు. రాష్ట్రంలో 19 కరోనా కేసులు నమోదు కాగా, అందులో చిత్తూరు జిల్లాలో ఒకటి ఉందని తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని, తర్వలో డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment