సాక్షి, విజయవాడ: నాడు-నేడు పేరుతో పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌళిక వసతులు కల్పించి వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా మొదటి దశలో రూ.1500 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఉంగుటూరు మండలంలో తేలప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. విద్య, వైద్యానికి సీఎం మొదటి ప్రాధాన్యతనిస్తున్నారన్నారు జనవరి 9న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. సీఎం జగన్ విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. నాడు-నేడు పేరుతో మొదటి దశలో 15 వేల పాఠశాలల అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. తేలప్రోలులో ప్రవాస భారతీయుడు కృష్ణమోహన్ రెడ్డి అందించిన రూ. కోటి విరాళంతో పాఠశాల రూపుదిద్దుకోవడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఆంగ్లవిద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలు మానసికంగా వృద్ధులు
ప్రతి విద్యార్థి విద్య తర్వాత ఆరోగ్యానికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల దాత, ప్రవాస భారతీయుడు డా. భీమవరపు కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు మానసికంగా వృద్ధులుగా ఉన్నారే కానీ శారీరకంగా కాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు చిన్నతనం నుంచే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment