పింఛన్ మొత్తం పెరిగిందనే ఆనందమే తప్ప..అందుకునే వరకు ఆ అభాగ్యులకు
టెన్షన్ తప్పడం లేదు. గతంలో ప్రతి నెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే తమ ఇళ్ల వద్దే అందు
కునే వారు. ఆ తర్వాత పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు
పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఉదయం నుంచిసాయంత్రం వరకు
పడిగాపులు పడుతున్నా అందుతుందో లేదోతెలియని అయోమయ పరిస్థితిలో వారు
కొట్టుమిట్టాడుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో జీవీఎంసీ పరిధిలో 59,604 పింఛన్లుండగా, రూరల్ ప్రాంతంలో 3,06,123 పింఛన్లున్నాయి. గతేడాది అక్టోబర్ 2వ తేదీ నుంచివృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500లు పెంచినప్పటికీ గడిచిన నాలుగు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ పదో తేదీ లోపు పింఛన్ అందుకున్న పాపానపోలేదు. హుద్‌హుద్ రూపంలో విరుచుకుపడిన పెనుతుపాను కారణంగా అక్టోబర్‌లో తలపెట్టిన జన్మభూమి మాఊరు కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. దీంతో పింఛన్ల చెల్లింపు కూడా నిలిచిపోయింది. ఆ తర్వాత నవంబర్‌లో మళ్లీ ఈ కార్యక్రమం చేపట్టినా పింఛన్ల పంపిణీ మాత్రం పూర్తిగా జరగలేదు.
డిసెంబర్‌లో పెండింగ్ బకాయిలన్నీ చెల్లించారు. అధికారుల వైఫల్యం కారణంగా పింఛన్లు అందుకోలేకపోవడంతో సుమారు 10 శాతం పింఛన్లకు ఈ నెలలో కోత పెట్టారు. గత మూడు నెలలుగా పింఛన్లు తీసుకోలేని కారణంగా ఈనెలలో నిలిపివేసినట్టు చెప్పి అధికారులు జిల్లా మొత్తమ్మీద సుమారు 15వేలకు పైగా పింఛన్లను నిలిపివేశారు. కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్స్(సీఎస్‌పీ)లను తొలగించడంతో పింఛన్ల పంపిణీని ఈ నెల నుంచి పోస్టాఫీసులకు అప్పగించారు. సిబ్బంది కొరత..అవగాహన లోపాల కారణంగా పోస్టాఫీసుల ద్వారా బట్వాడా జరుగుతున్న పింఛన్ల పంపిణీ నత్తనడకన సాగుతుంది. మరీ ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఐదు రోజులుగా కేవలం 15 శాతానికి మించి పంపిణీ జరగలేదు. అదే గ్రామీణ ప్రాంతంలో 50 శాతం వరకు పంపిణీ జరిగింది. వేలాది మందికి వేలిముద్రలు సరిపోవడం లేదని తిప్పి పంపించేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్‌లో నిల్చొన్నా చివరి నిమిషంలో నెట్‌వర్క్ పనిచేయడం లేదు రేపు రండి అంటూ వెనక్కి పంపించేస్తున్నారు. కలెక్టరేట్‌లోని పోస్టాఫీసులో వందలాది మంది పింఛన్‌దారులు తెల్లవారుజాము నుంచి పడిగాపులు పడుతున్నారు.
టోకెన్లు తీసుకుని తిండీతిప్పల్లేకుండా సాయంత్రం వరకు పడిగాపులు పడుతున్నా పింఛన్లు అందడం లేదని వాపోతున్నారు. యూసీడీ అధికారులు పట్టించుకోవడం లేదని పోస్టల్ సిబ్బంది ఆరోపిస్తుంటే..తాము వెళ్తే మేమే పంపిణీ చేస్తాం.. మాకు ఎవరి సహాయం అవసరం లేదని చెబుతున్నారని యూసీడీ అధికారులు చెబుతున్నారు.
పింఛన్‌లోనూ పర్సంటేజ్‌లు
వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ తీసుకుంటున్న వారందరూ నిరుపేదలే. వారికి ఆ పింఛన్ సొమ్మే ఆధారం. సామాజిక కమిటీల ముసుగులో టీడీపీ స్థానిక నేతలు ఇప్పటికే వేలాది మందికి పింఛన్లు కోత పెట్టారు. పింఛన్ పొందుతున్న వారినుంచి కూడా వీరు పర్సంటేజ్‌లు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కొంతమంది టీడీపీ నేతలు పోస్టాఫీసుల్లోనే మకాం వేసి వెయ్యికి వంద నుంచి రెండొందల రూపాయల వరకు దండుకుంటున్నట్టు తెలిసింది. ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి మీరు ఉండదంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్టు సమాచారం. కమిటీల్లోనే సభ్యులతో పాటు స్థానిక నేతలు ఒక్కొక్క పోస్టాఫీస్ పరిధిలోని పింఛన్‌దారుల నుంచి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు దంటుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మూడుసార్లు తిరిగా..
ఇప్పటికే మూడుసార్లు తిరి గాను. వచ్చిన ప్రతిసారీ రేపురా అంటూ తిప్పిపంపిస్తున్నారు. ఎన్నిసార్లు తిరగాలో అర్థం కావడం లేదు. ఆ ఇచ్చే డబ్బులు చార్జీలకే అయ్యేటట్టుంది. -విశాలాక్షి, రెల్లివీధి
వారం తర్వాత రమ్మన్నారు
గత రెండురోజులుగా తిరుగుతున్నా ఈ రోజు వేలిముద్రలు తీసుకున్నారు. వారం రోజుల తర్వాత వస్తే పింఛన్ ఇస్తామని టోకెన్ ఇచ్చారు. ఇలా అయితే ఎలా.
-పార్వతి, దొండపర్తి
ఐదు నెలల నుంచి పింఛన్ లేదు
గత ఐదు నెలలుగా పింఛన్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అధికారుల చు ట్టూ తిరిగినా పట్టించుకోలేదు. ను వ్వు ఆధార్ కార్డు ఇవ్వలేదని చెబుతున్నారు. రెండు మూడుసార్లు ఇచ్చాను.
-నూకాలమ్మ, కొత్త అగ్రహారం
చుక్కలు కనిపింఛెన్..
Published Mon, Feb 9 2015 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement