పింఛన్ వస్తలేదు | pensions not sanctioned | Sakshi
Sakshi News home page

పింఛన్ వస్తలేదు

Published Mon, May 19 2014 1:36 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

పింఛన్ వస్తలేదు - Sakshi

పింఛన్ వస్తలేదు

29లక్షలు సామాజిక పింఛనుదారులు
 2లక్షలు అభయహస్తం పెన్షనర్లు
 ఈనెల ఇప్పటిదాకా అందని పింఛన్లు
 వచ్చేనెల అందేది కూడా అనుమానమే
 ఉమ్మడి రాష్ట్రంలోని ఈ రెండు నెలల పెన్షన్లు ఇచ్చేది ఎవరు?
 గత నెలలో వివిధ కారణాలతో 9 లక్షల మందికి మొండిచే యి
 నిధుల విడుదలలో ఆర్థికశాఖ జాప్యమే కారణం!

 
 సాక్షి, హైదరాబాద్: నెల వచ్చిందంటే పింఛన్ కోసం ఆశగా ఎదురుచూసే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నిరాశే మిగులుతోంది. ప్రతినెలా ఠంఛన్‌గా వ స్తాయనుకునే పెన్షన్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నెలలో ఇప్పటిదాకా పింఛన్లు అందకపోవడంతో లక్షల సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అభయహస్తం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మే నెల పెన్షన్ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ప్రతినెలా ముందస్తుగా విడుదల చేస్తేనే పెన్షన్ నిధులు సకాలంలో పింఛనుదారులకు అందుతాయి. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా నిధులు తమకు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు.  ఫలితంగా వచ్చే నెలలో కూడా పింఛన్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో దాదాపు 29 లక్షల మంది సామాజిక పెన్షన్‌దారులు, 2 లక్షల వరకు అభయహస్తం పెన్షన్‌దారులు ఉన్నారు. వీరిలో 17.33 లక్షల మంది వృద్ధులు, 3.87 లక్షల మంది వికలాంగులు, 7.31 లక్షల మంది వితంతువులు, 1.76 లక్షల మంది అభయహస్తం, 60 వేల మంది చేనేత కార్మికులు, మిగిలిన వారు    కల్లుగీత కార్మికులు ఉన్నారు.
 
 కిందటి నెలలో 9 లక్షల మందికి అందని పింఛన్లు..
 
 ప్రభుత్వ ఉద్యోగల మాదిరి పింఛన్‌దారులకు కూడా పెన్షన్లు ప్రతీనెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోగా ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అప్పట్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చాలాకాలం ఇలాగే అమలైంది. ఐదో తేదీలోపే ఠంచన్‌గా పింఛన్ అందేది. కానీ ఈ మధ్యకాలంలో ఇది గాడి తప్పింది. పెన్షన్ నిధులను గ్రీన్‌ఛానెల్‌లో పెట్టామని గత ప్రభుత్వం చెప్పినా.. నిధుల విడుదల మాత్రం జాప్యమవుతూ వస్తోంది. తమకు వచ్చే రూ.200, రూ.500ల కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చిలో పెన్షన్ల కోసం నిధులు విడుదల చేసినా ఎన్నికల కోడ్ కారణంగా... దాదాపు తొమ్మిది లక్షల మందికి పింఛన్లు అందలేదు. ఎన్నికల కోడ్ ఒకటైతే.. పింఛన్‌దారులు తమ ఇళ్లలో నివాసం లేరని, వలస వెళ్లారని, ఇలా పలు కారణాలు చూపి మొత్తం 31 లక్షల పెన్షన్లకుగాను.. 22 లక్షల కంటే తక్కువగానే పంపిణీ చేశారు. మిగిలిన తొమ్మిది లక్షల పెన్షన్లకు సంబంధించిన నిధులు తిరిగి రాష్ట్ర ఖజానాలోకి వచ్చి చేరుతున్నాయి. ఇక మే నెల పెన్షన్ నిధులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం కోరినప్పటికీ.. ఇంకా విడుదల చేయలేదని తెలిసింది. ప్రస్తుతానికి ఇవి ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
 
 ఆర్థికశాఖ జాప్యం వల్లే...
 
 సంక్షేమ పథకాలేవీ అగబోవని గవర్నర్ సైతం హామీ ఇచ్చారు. కానీ ఆర్థిక శాఖ నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చేయడం వల్లే పెన్షన్లు అందడంలో ఆలస్యమవుతోందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మేలోనే ఇలా ఉంటే.. జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల ఏర్పాటైన తర్వాత పెన్షనర్లకు నిధుల విడుదల సక్రమంగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్‌లో సక్రవుంగా పంపిణీ జరగాలంటే ఇప్పుడే నిధులు విడుదల జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పింఛన్లను పట్టించుకునేవారే లేకుండా పోయూరు.
 
 పోయిన నెల నుంచి రాలేదు: సల ్లరాధమ్మ. సోమగూడెం, ఆదిలాబాద్
 
 పోయిన నెల నుంచి ఫించన్ రాలేదు. నెలకు రూ.500 అభయహస్తం పించన్ వస్తేనే ఇళ్లు గడిచేది. ఈనెల ఇప్పటి వరకు రాలేదంటున్నారు. పించన్‌పై ఆధారపడి బతికే మాలాంటి వారిని వేధించడం సరికాదు.
 
 సమయానికి వస్తలేవు: మేడ శాంతమ్మ, కాసిపేట, ఆదిలాబాద్
 
 గతంలో నెల మొదటి నుంచి ఐదో తేదీ లోపు ఫించన్ అందించేవారు. కొద్దిరోజులుగా మిషన్ ద్వారా ఇస్తున్నమని చెప్పి ఆలస్యం చేస్తున్నారు. అధికారులు పింఛన్ డబ్బులు సక్రమంగా అందేలా చూడాలి.
 
 పింఛన్ ఇయ్యకపోతే ఎట్ల..?: బాలమణి, వితంతువు, తీగుల్, జగదేవ్‌పూర్ మండలం, మెదక్
 
 ప్రతినెల 5 తారీఖులోపు పెన్షన్ వొచ్చేది. ఏమైందో ఏమో ఈనెల ఇంతవరకు రాలేదు. రోజు పోద్దున పంచాయితీ కాడికి పోయి వస్తున్న. పింఛన్ ఇచ్చేటోట్లు వస్తలేరు..
 
 ఆర్నెళ్ల సంది వస్తలేదు: పెద్దోళ్ల పోచమ్మ, కిష్టాపూర్, తూప్రాన్ మండలం, మెదక్
 
 ఆరు నెలల సంది పింఛన్ వస్తలేదు. అంతకు ముందు నెల నెల రూ.200 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇస్తలేరు. ఇదేందని అడిగితే.. ఏదో మిషన్ మీద చేయి పెడితే నా పేరు వస్తలేదని అంటున్నరు. పేరు కూడ తప్పుగా ఉందంటుండ్రు. నడటానికి శాతగానీ ముసల్దాన్ని... రోగమొస్తే ఆసుపత్రికి పోదామంటే చేతిల చిల్లిగవ్వ లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement