బాంబుపేలుళ్లతో ఎందరికో ప్రత్యక్ష నరకం చూపించిన ఉగ్రవాది యాసిన్ భత్కల్. అతడు పోలీసులకు పట్టుబడ్డాడనగానే ఆనాటి బాధితుల్లో ఎంతో ఆనందం. తీవ్రవాదిని టీవీల్లో చూపిస్తుంటే అతడిని అక్కడికక్కడే ఉరితీయించాలన్న ఆక్రోషం... ఆవేదన. తాము అనుభవిస్తున్న క్షోభకు అంతకంతకు ఆ తీవ్రవాది కూడా అనుభవించాలని, మరో ఘటనకు పాల్పడాలనే ఆలోచనే మరొకరికి రాకుండా అతడిని శిక్షించాలని కోరుకుంటున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 21న రాత్రి హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్లలో జిల్లాకు చెందిన పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఎందరో క్షతగాత్రులయ్యారు. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. ఆ సంఘటన తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. క్షతగాత్రులు ఇంకా కోలుకోలేదు. యాసిన్ భత్కల్ అరెస్టు సందర్భంగా ఆనాటి బాధితులను ‘న్యూస్‌లైన్’ పలకరించింది. భత్కల్‌ను బతకనీయొద్దని, అతడిని వెంటనే ఉరి తీసి చంపాలని వారు డిమాండ్ చేశారు.
నరకం సూపియ్యాలి
నా కొడుకు తిరుపతిని చంపిన భత్కల్‌కు చావులో నరకం చూపించాలి. ఒక్కరోజులోనే వాన్ని సంపొద్దు. మా బిడ్డను అన్యాయంగా సంపేసిండు. వాన్ని సంపుతుంటే ప్రతీ కన్నతల్లి కడుపుకోత అర్థం కావాలె. ఆ రాక్షసుడు ఎంతమంది ఉసురుపోసుకున్నడో. బాంబుపేలుళ్ల చనిపోయినోళ్లను టీవీలల్ల ఎట్ల సూపిచ్చిండ్లో భత్కల్ నరకం అనుభవించేది కూడా టీవీలల్ల సూపియ్యాలె. టీవీలల్ల వాన్ని సూత్తంటే కోపం ఆగుతలేదు. కడుపు రగుల్తంది. అన్యాయంగా మా బిడ్డను, వాడి దోస్తు రవిని పొట్టన బెట్టుకున్నడు. ఆనాటి ఘటన తల్సుకుంటేనే గుండె పగుల్తది. సావంటే ఎట్లుంటదో నరకం వానికి చూపియ్యాలె. అప్పుడే బాంబుదాడిలో సనిపోయినోళ్ల ఆత్మకు శాంతి.
- గుంట తిరుపతి తల్లిదండ్రులు భీమయ్య-రాజమ్మ, పరుశరామ్‌నగర్, గోదావరిఖని
వణుకు పుట్టించాలి
మా తమ్ముడి ప్రాణాలు బలితీసుక్ను యాసిన్ భత్కల్ చావు అతి భయంకరంగా ఉండాలె. ఇంకొకరు దేశంపై దాడి చేయాలనే ఆలోచన రావడానికే వణుకు పుట్టించాలె. భత్కల్‌ను పట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆ క్రూరుడి నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టాలె. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లలాంటివి మళ్ల జరగకుంట ముందుగానే పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం తయారు చేసుకోవాలె. టీవీలల్ల భత్కల్‌ను సూపిత్తంటే ఇంట్లో అమ్మా నాన్న అన్నం తింటలేరు. కోపంతో రగిలిపోతున్నరు. తమ్ముడు చావు ఇంట్లో అందరినీ కుదిపేసింది.
- తిరుపతి సోదరుడు మల్లేశ్
భత్కల్‌ను ఉరిదియ్యాలె
నా బిడ్డ అమృత రవిని వాడు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నడు. వాన్ని(యాసిన్ భత్కల్)ను ఉరితీసి చంపాలి. నాకు ఏ చిన్న కట్టం వచ్చినా దగ్గరుండి సూసుకునేటోడు. కొడుకు సచ్చిపోయినప్పటి నుంచి కంటి నిండా నిద్ర కూడా పడుతలేదు. అలాంటి కొడుకే లేని జీవితం ఎందుకనిపిత్తంది. చిన్నప్పుడే వాని తండ్రి సచ్చిపోతే అన్నీ నేనే అయిన. ఓ సారి నాకు దెబ్బ తగిలి బొక్కలిరిగితే నాకు ఎంతో సేవ చేసిండు. నేను మళ్ల మంచిగ నడిసేదాక నన్ను ఇడిసిపెట్టి పోలె. అట్లాంటోన్ని ఎట్ల మర్సిపోవాలె. ఉద్యోగం సంపాదించుకుంట అని చదువుకునేటందుకు హైదరాబాద్ పోయిండు. నా కొడుకు ఏం అన్యాయం చేసిండని వాడు పొట్టనబెట్టుకుండు. నా కొడుకును సంపినోన్ని ఈ భూమ్మీద ఉంచద్దు. నాకు పెద్ద దిక్కు లేకుండా చేసినోన్ని బతకనీయొద్దు.
- రవి తల్లి లక్ష్మి, బేగంపేట్, - న్యూస్‌లైన్, సెంటిన రీకాలనీ
(యైటింక్లయిన్‌కాలనీ)
ఆ రోజు మర్చిపోలేకపోతున్నా..
ఆ రోజును మర్చిపోలేకపోతున్నా. ఆ రోజు నా పుట్టినరోజు. ఇంజినీరింగ్ చదువుతున్న నేను వేడుకలు జరుపుకుందామని ట్యుటోరియల్ నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా బాంబు పేలింది. నా కాళ్లు, చేతులు, కళ్లకు బలమైన గాయాలయ్యాయి. ఇప్పటికి కూడా కోలుకోలేకవైద్యం చేయించుకుంటున్నా. నా ఆస్పత్రి ఖర్చుల కోసం మా నాన్న మల్లారెడ్డి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఏడుపస్తంది. ఇప్పటికే రూ.లక్షకుపైగా ఖర్చయినయ్. గాయపడ్డవారికి ప్రభుత్వం సాయం చేస్తానంది. నాకు ఇప్పటిదాకా ఏ సాయం అందలె. గాయాలతో నా చదువు కూడా చక్కగా సాగడం లేదు. క్లాసులకు పోతున్నా. ఇప్పటికి కూడా కుడిచేయిలో నొప్పి తీవ్రం గా వస్తంది. రెటీనా దెబ్బతిని చూపు మందగించింది. ఎంపీ పొన్నం, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నన్ను పరామర్శించారు. వారి పరామర్శ కంటే భత్కల్‌ను ఉరితీస్తే ఎక్కువ సంతోష పడు త. భత్కల్‌ను పట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. ఎంతో మం దిని బలిగొన్న ఇలాంటి క్రూరులను కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి పనిచేయొద్దని భయపెట్టేలా ఈ శిక్షలుండాలె.
- పత్తి మానస, ఇంజినీరింగ్ విద్యార్థి, రాజపల్లి,
- న్యూస్‌లైన్, హుజూరాబాద్ రూరల్
ఉగ్రవాది 'యాసిన్ భత్కల్'ను ఉరితీయాలి
Published Sat, Aug 31 2013 5:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement