వాటర్ ప్యాకెట్ల కోసం చేతులు చాపుతున్న క్యూలోని భక్తులు
సాక్షి, విశాఖపట్నం: గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌పై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా జరిగే అప్పన్న చందనోత్సవం కోసం చేసిన అరొకర ఏర్పాట్లు పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భానుడు భగభగమంటూ మండుతున్న సమయంలో క్యూలైన్లలో నిల్చొనే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టిన పాపాన పోలేదు. సాధారణంగా అప్పన్న నిజరూపదర్శనం కోçసం ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఏటా లక్ష మందికి పైగా భక్తులు ఆయా రాష్ట్రాల నుంచి తరలివస్తుంటారు. ఈసారి ఫొని తుపాను ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్ నుంచి వచ్చే భక్తులు తాకిడి బాగా తగ్గింది. గతంలో మాదిరిగానే ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. షామియానాలు లేక.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక క్యూలైన్లలో భక్తులు విలవిల్లాడిపోయారు. భక్తులే కాదు.. అప్పన్న చందనోత్సవం కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు సైతం నానా అగచాట్లు పడాల్సివచ్చింది. తొలిసారి ఓబీ వ్యాన్‌లకు కొండపైకి అనుమతినివ్వకపోవడంతో చందనోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మీడియా ప్రతినిధులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒకటి రెండు సమీక్షలు నిర్వహించడం తప్ప ఆలయ ఈవో రామచంద్ర మోహ¯న్ ఏర్పాట్లపై కనీసంగా పట్టించు కోలేదంటున్నారు.
ఈవోపై మండిపడ్డ అవంతి
అప్పన్న నిజరూపదర్శనం చేసుకునేందుకు వచ్చిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు సింహాచలం ఈవో రామచంద్రమోహన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఎంపీని.. నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు.. ఈనెల 23వ తేదీ వరకు తాను ఎంపీనే.. తాను ఎంపీని కాదనుకుంటున్నావా? ఎంపీనైన తన పట్లే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందంటూ మండిపడ్డారు. నిజరూప దర్శనం చేసుకునేందుకు వచ్చిన అవంతి కుటుంబ సభ్యులను గర్భాలయం వద్ద ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. గర్భగుడిలోకి వెళ్లకుండానే తీవ్ర మనస్తాపంతో వెనుదిరిగారు. బయటకొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈవో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. క్యూలైన్లలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారంటున్నారు. అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల సేవలోనే ఈవో ఉన్నారు తప్ప భక్తులను, ఇతరులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు.
సింహగిరిని తిరుమల వలే అభివృద్ధి చేయాలి
సింహాద్రి అప్పన్న క్షేత్రాన్ని రానున్న రోజుల్లో తిరుమల వలే అభివృద్ధి చేయాల్సి ఉందని వైఎస్సార్ సీపీ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గతంలో చేసిన మాస్టర్ ప్లాన్ మూలనపడిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యక్షేత్రంగా సింహగిరిని తీర్చదిద్దడం జరుగుతుందన్నారు. పంచగ్రామాల భూసమస్యను పరిష్కరిస్తామన్నారు. చందనోత్సవంలో మీడియాపై ఆంక్షలుపెట్టడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment