
చిత్రావతిలో భారీ గొయ్యి.. సంచలనం
పుట్లూరు: అనంతపురం జిల్లాలో అకస్మాత్తుగా ఏర్పడిన భారీ గొయ్యి సంచలనం సృష్టిస్తోంది. చిత్రావతి నది సమీపంలో భారీ శబ్దంతో గురువారం రాత్రి పెద్ద గొయ్యి ఏర్పడింది. పుట్లూరు మండలం లక్ష్ముంపల్లి గ్రామ సమీపంలోఈ గొయ్యి ఏర్పడింది. చూసేందుకు భారీ సైజున్న బావిలా కనిపించడంతో జనం ఏం జరిగిందోనని తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు.
అర్ధరాత్రి పెద్ద శబ్దం రావటంతో లక్ష్ముంపల్లి గ్రామస్తులు ఏదో జరిగిందని హడలిపోయారు. ఉదయం.. నిద్రలేచిన తర్వాత.. ఈ భారీ గొయ్యిని చూసిన జనం షాక్ తిన్నారు. మొదట చిన్నదిగా ఏర్పడ్డ ఈ గొయ్యి క్రమంగా పెరుగుతండటంతో.. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జియాలజీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.