కొయ్యలగూడెం మండలంలోని మైదాన ప్రాంతంలో సారాను తయారుచేస్తున్న దృశ్యం
సాక్షి, పశ్చిమగోదావరి : ఏజెన్సీ మెట్టప్రాంతంలో సారా తయారీ పడగ విప్పింది. దీంతో ఒక్కసారిగా మారుమూల అటవీ ప్రాంతాల నుంచి సారా మైదాన ప్రాంతాల్లోకి దిగుమతి అవుతుండగా, వాళ్లను చూసిన మైదాన ప్రాంతవాసులు కొందరు సారా తయారీ కేంద్రాలను కుటీర పరిశ్రమలుగా నెలకొల్పుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపడంతో ఇప్పటివరకు బెల్టు షాపులపై ఆధారపడ్డ కుటుంబాల వారు సారా తయారీ వైపు వెళుతున్నారు. దీంతో రోజుకు 40 లీటర్ల నుంచి 150 లీటర్ల వరకు సారాను దిగుమతి చేస్తూ ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల అటవీ ప్రాంతాల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయన్న విషయం సారా తయారీదారులకు అయాచిత వరంగా పరిణమించింది. దీంతో గత కొద్ది రోజుల వరకు రాత్రి వేళల్లోనే సారా తయారు చేసిన వ్యక్తులు ఏకంగా ఇప్పుడు పట్టపగలే తయారీ కేంద్రాలను నెలకొల్పి బాహాటంగా తయారుచేస్తున్నారు.
అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులు
లీటర్ సారా హోల్‌సేల్‌లో రూ.200కు, రిటైల్‌గా అయితే రూ. 300కు విక్రయిస్తున్నారు. ముగ్గురు నుంచి నలుగురు బృందంగా ఏర్పడిన సభ్యులు సారా తయారీకి గూడుపుఠానిలా వ్యవహరిస్తున్నారు. సారా తయారు చేస్తున్న సమీప వ్యవసాయ రైతులు అభ్యంతరాలు పెడుతుండటంతో వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని తయారీదారులు భయపెడుతున్నారు. దీంతో రైతులు వెనక్కి తగ్గాల్సి వస్తోంది. సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ గత కొద్ది నెలలుగా గ్రామగ్రామాన తిరుగుతూ జాగృతి కార్యక్రమం ద్వారా తయారీదారులైన వ్యక్తుల్లో మార్పు తీసుకురావడం జరిగింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి విజయవంతమైంది.
అదేవిధంగా నక్సల్స్‌తో పాటు, నక్సల్స్ సానుభూతిపరులుగా ఉన్న నాయకులు సారా తయారీని ప్రోత్సహించకుండా అడ్డుకోవడంతో పాటు తయారీదారులపై ఆంక్షలు సారా తయారీ లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో చేయగలిగారు. అయితే బెల్టు ఊడిపోవడంతో ఆ రంగంపై ఆధారపడ్డవారు తక్కువ శ్రమ, ఎక్కువ రాబడి ఉంటుందన్న అత్యాశతో సారానే అంతిమంగా ఎంచుకున్నారు. సారా తయారీకి నల్లబెల్లం అందుబాటులో లేకపోవడంతో పంచదారలోని రెండోరకం పంచధారను, మొలాసిస్‌ను వినియోగిస్తున్నట్లు తెలిసింది. నల్లబెల్లం కేజీ రూ.100 నుంచి రూ.120 ధర పలుకుతున్నందున రూ.40 లోపు లభ్యమయ్యే రెండో రకం పంచదాను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
సంపాదన అంతా తాగుడికే
వ్యవసాయ పనులు ముమ్మరమైన నేపథ్యంలో కూలీకి వెళుతున్న వారంతా సంపాదిస్తున్న సొమ్ములు మొత్తం తాగుడికే ఫణంగా పెడుతున్నారు. ఇచ్చే నాలుగు వందల రూపాయలను సారాను కొనుగోలు చేస్తూ ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. సారా తాగి ప్రాణాలు కోల్పోతున్న మందుబాబులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు.
– చింతా శ్రీదేవి, బట్రాజుల అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు
కలిసికట్టుగా రూపుమాపుతాం
ఏజెన్సీలో సారా తయారీని గిరిజనులు, గిరిజనులకు అండగా నిలుస్తున్న సంఘాలు అడ్డుకోగా, అందుకు విరుద్ధంగా మైదాన ప్రాంతాల్లో సారా బట్టీలు కొనసాగుతుండటం విచారించదగ్గ అంశం. మహిళలు కలిసికట్టుగా సారా తయారీ కేంద్రాలను రూపుమాపాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రజాసంఘాలు మాకు మద్దతు ఇవ్వాలి.
– తోట కృపామణి, వైఎస్సార్ సీపీ మహిళావిభాగం నాయకురాలు, యర్రంపేట
Comments
Please login to add a commentAdd a comment