సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల తరబడి ఉద్యమాల ఫలితంగా వచ్చిన రైల్వే జోన్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. రాదనుకున్న జోన్ వచ్చినందుకు కొన్ని వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కానీ ప్రయోజనం లేకుండా ఇచ్చారంటూ మరికొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖకు రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌లో సగభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లో విలీనం చేశారు. దీంతో వందల ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కనుమరుగైపోనుంది. అంతేకాదు.. వాల్తేరు డివిజన్‌కు రూ.7 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే (కొత్తవలస–కిరండోల్) లైన్‌ను కూడా విశాఖ రైల్వే జోన్ పరిధిలో కాకుండా రాయగడ డివిజన్‌కు కేటాయించడం విశాఖ, ఉత్తరాంధ్ర వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కేకే లైన్‌లో ముడి ఇనుము, బొగ్గు తదితర ఖనిజాల రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని తీసుకొచ్చే డివిజన్ జోన్‌లో చేర్చకపోవడం వల్ల ప్రయోజనం శూన్యమని ప్రజాసంఘాలు, వామపక్షాలు, నిరుద్యోగ జేఏసీలు మండిపడుతున్నాయి.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆదాయం తూర్పు కోస్తా రైల్వేకి, నిర్వహణ భారం, ఇతర వ్యయం విశాఖ జోన్‌పైన పడుతుందని చెబుతున్నారు. జోన్ వచ్చినా నిరుద్యోగులకు మేలు చేకూర్చే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విశాఖ జోన్ విశాఖకు వచ్చే అవకాశం లేదన్న వార్తలు కూడా నిరుద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్‌లో విధిగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఉండాలంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలువురు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టింది. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించింది. మరోవైపు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక నేతృత్వంలో గురువారం నగరంలో అఖిలపక్ష నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్త జోన్‌వల్ల ఉత్తరాంధ్రకు మేలు చేకూరాలే తప్ప నష్టం వాటిల్లరాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలోనూ రైల్వే జోన్ ఏర్పాటు తీరుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ఏ డివిజన్‌కు వచ్చే ఆదాయమైనా అంతిమంగా రైల్వేలకే వెళ్తుంది తప్ప స్థానిక సంస్థలకు గాని వచ్చే అవకాశం ఉండదని, అందువల్ల పరిధులపై ఆందోళనలు చేయడం అర్థరహితమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద రాకరాక వచ్చిన రైల్వే జోన్‌పై మరోసారి కాక పుట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ఇవ్వాలి
డాబాగార్డెన్స్(విశాఖదక్షిణ): వాల్తేర్ డివిజన్‌తో కూడుకున్న రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, 125 ఏళ్ల ఘన చరిత్ర గల వాల్తేర్ డివిజన్‌కు చరిత్ర లేకుండా చేస్తే ఉద్యమిస్తామని..ప్రతిఘటిస్తామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించి..ఉత్తరాంధ్రను మాత్రం తూర్పుకోస్తా రైల్వేలోనే ఉంచాలన్న ప్రకటనను నిరసిస్తూ ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కన్యదానం చేసి కాపురం చేయడానికి వీల్లేదన్నట్టు రైల్వేజోన్ ప్రకటన ఉందని ఎద్దేవా చేశారు. జోన్ ప్రకటించి 126 ఏళ్ల చరిత్ర గల వాల్తేర్ డివిజన్‌కు చరిత్ర లేకుండా చేశారని మండిపడ్డారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించి ఉత్తరాంధ్రను మాత్రం తూర్పుకోస్తా రైల్వేలోనే ఉంచాలని భావిస్తుందని, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేర్ డివిజన్‌లోని విశాఖ రైల్వేస్టేషన్(సెక్షన్)ను మాత్రమే కొత్త జోన్‌లో విలీనం చేయడానికి ప్రతిపాదన చేశారని తెలిపారు. అదే జరిగితే శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ జిల్లాలోని కొంత ప్రాంతం శాశ్వతంగా నష్టపోతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనను ఉత్తరాంధ్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. డివిజనల్ హెడ్‌క్వార్టర్ లేకుండా జోన్ ఏంటని ప్రశ్నించారు.
రేపు నిరసన
గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేర్ డివిజన్‌లోని విశాఖ రైల్వేస్టేషన్(సెక్షన్)ను మాత్రమే కొత్త రోజన్‌లో విలీనం చేయడానికి చేసిన ప్రతిపాదనను నిరసిస్తూ శనివారం అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నట్టు సమావేశంలో తీర్మానించారు. రైల్వే యూనియన్లు కూడా ఆందోళన బాట పట్టనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వేజోన్ సాధన సమితి కన్వీనర్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నగర కార్యదర్శి బి.గంగారావు, లోక్‌సత్తా పార్టీ నాయకుడు మూర్తి, జనసేన పార్టీ నాయకుడు కోన తాతారావు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పేడాడ రమణకుమారి, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఏయూ విద్యార్థి నాయకుడు సమయం హేమంత్‌కుమార్ పాల్గొన్నారు.
ఉనికి కాపాడండి..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు కావడం ఆంధ్రరాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, అయితే 125 ఏళ్ల చరిత్ర గల వాల్తేర్ డివిజన్ ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ జోన్ ప్రకటించడం ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని ఎన్‌ఎఫ్‌ఐఆర్ ఉపాధ్యక్షుడు కె.ఎస్.మూర్తి, తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఎక్స్ డివిజనల్ కో–ఆర్డినేటర్ పీఆర్‌ఎమ్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిపాదిత కొత్త జోన్‌లో విలీనం కానున్న ప్రస్తుత వాల్తేర్ డివిజన్‌లోని కార్మికులు రానున్న కాలంలో పదోన్నతలు, సీనియార్టీ వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, డివిజన్ స్థాయి అధికారులను కలవడానికి సుదూర ప్రయాణం చేసి విజయవాడ వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన ఈ ప్రాంత కార్మికుల్లో ఉందన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే డివిజన్‌ను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైల్వే కార్మికుల్లో ఉన్న ఆందోళన తొలగించాలని మూర్తి డిమాండ్ చేశారు.
తీవ్ర అన్యాయం
తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర):విశాఖ రైల్వే జోన్ ప్రకటించి తీవ్ర అన్యాయం చేశారని ఏపీజేఏసీ నేత జేటీ రామారావు ఆరోపించారు. జోన్ ప్రకటన విషయంలో గురువారం రాత్రి సరైన అవగాహన లేక నాయకులు సంబరాలు చేసుకున్నారు. కానీ వాల్తేర్ డివిజన్‌ను ముక్కలు చేసి ఇచ్చే డివిజన్ వల్ల ప్రయోజనం లేదన్నారు. ఈమేరకు గురువారం రైల్వే స్టేషన్ ఎదుట ఆం దోళన నిర్వహించారు. ప్రధానంగా కేకే లైన్ లేని జోన్ వలన నష్టమే ఎక్కువన్నారు. పార్లమెంట్‌లో రైల్వే జోన్ ప్రకటించేవరకు పోరాటం చేస్తామన్నారు. 36గంటల డెడ్‌లైన్ కేంద్రానికి ఇచ్చామన్నారు. ఈ లోగా పూర్తిస్థాయి రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లుగా జోన్ విషయం మాట్లాడని తెలుగుదేశం నేడు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందని, ఈ రోజు జోన్ ఇలా ముక్కలవడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని తెలిపారు. కార్యక్రమంలో కె.దానయ్య, పౌరహక్కుల ప్రజాసంఘం నాయకుడు పలుకూరి వసంతరావు, మాజీ రైల్వే కార్మి కుడు కె.రామచంద్రమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment