సాక్షి, కడప: సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమం చేపట్టిన జిల్లా ప్రజానీకం లక్ష్యసాధన కోసం అలుపెరగకుండా పోరాడుతోంది. శుక్రవారంతో ఉద్యమం పదోరోజుకు చేరింది. ఓ వైపు రంజాన్ పర్వదినం, మరో వైపు తొలి శ్రావణ శుక్రవారం అయినప్పటికీ ఆందోళన కార్యక్రమాలను మాత్రం ఆపలేదు. శుక్రవారం ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా జేఏసీ నేతలు బంద్ సడలించారు.
దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. శుక్రవారం 50 శాతం సర్వీసులు నడిచాయి. దీంతో దూరప్రాంత ప్రయాణీకులకు కాస్త ఊరట లభించింది. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేస్తున్న ఆమరణనిరాహారదీక్ష ఐదోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని జేఏసీ నేతలు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, వైసీపీ నేత దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి, ఉత్తమ్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని సీహెచ్ పిలుపునిచ్చారు. న్యాయవాదులు, ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర పాటలు పాడి నిరసన తెలిపారు. ‘1942 ఆగష్టు 9 బ్రిటీష్- క్విట్ ఇండియా ఉద్యమం...2013 ఆగష్టు 9 ఇటాలియన్- క్విట్ ఇండియా ఉద్యమం’ అనే స్లోగన్‌తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. రిమ్స్‌లో వైద్యులు, జూడాలు, వైద్యసిబ్బంది చేస్తున్న రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వైద్యులు కూడా కలెక్టరేట్ వద్దకు వచ్చి సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలకతీతంగా ఉద్యమంలో పాల్గొనేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రొద్దుటూరులో వివేకానందక్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్‌లో బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. సీఎం కిరణ్, బొత్స, కేసీఆర్ పోస్టర్లను చెప్పులతో కొడుతూ ఆందోళన చేపట్టారు. డప్పులు, డ్రమ్ములతో శివాలయం వీధిని హోరెత్తించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో సాగిస్తున్న రిలేదీక్షలలో రాజుపాళెం మండలానికి చెందిన 20మంది ఉపాధ్యాయులు కూర్చున్నారు. వీరికి సంఘీభావంగా 10మంది మార్కెట్‌యార్డు సిబ్బంది కూడా దీక్ష చేపట్టారు. న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. దీక్షలు కొనసాగిస్తున్నారు. పులివెందులలో బలిజసంఘం, జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాయలం ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. దీక్షాశిబిరాన్ని 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. చిన్నపిల్లలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. భరతమాతతో పాటు పలు వేషధారణలు వేసి నిరసన తెలిపారు. రాయచోటిలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సందర్శించారు.
న్యాయవాదుల దీక్షలు ఐదోరోజుకు చేరాయి.
ఆర్టీసీ కార్మికుల దీక్ష కూడా కొనసాగుతోంది. జమ్మలమడుగులో సమతాదళిత సంఘం ఆధ్వర్యంలో 12మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు, నోటికి నల్లరిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీ ఉద్యోగులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. కోడూరులో విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు. ఉపాధ్యాయల జేఏసీ దీక్షలు నాలుగోరోజుకు చేరాయి. రైల్వేకోడూరులో రంజాన్ పండుగ ఉన్నా ముస్లీంలు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్యవాణి వినిపించారు.
ఆగని జోరు
Published Sat, Aug 10 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement