కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రైతు ప్రభుత్వమని గొప్పలే తప్పిస్తే హామీల అమలులో చిత్తశుద్ధి కరువైంది. త్రీఫేజ్ విద్యుత్‌లో ఎడాపెడా కోతలతో బోర్లు, బావుల కింద పంటల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. విషయం ప్రజాప్రతినిధులకు తెలిసినా నోరు మెదపకపోవడం రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రకృతి వైపరీత్యం, ఇతర కారణాలతో పీకల్లోతు కష్టాల్లో అండగా నిలవాల్సిన సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సబ్‌స్టేషన్లు, విద్యుత్ అధికారుల కార్యాలయాలను ముట్టడించారు. నేతల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఏడు గంటల త్రీఫేజ్(ఫుల్) కరెంటు ఇచ్చి పంటలను కాపాడాలని మొర పెట్టుకున్నారు. విద్యుత్ సంక్షోభంతో ఏర్పడిన లోటు కారణంగా కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ కోతలు విధిస్తుండటం తెలిసిందే.
ఇదే సమయంలో వ్యవసాయ విద్యుత్‌లోనూ కోత పెట్టడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాలో లోటు కారణంగా కోతలు విధించినా ఆ తర్వాత సర్దుబాటు చేసి 7 గంటల సరఫరా ఇస్తున్నారు. జిల్లాలో ఆ పరిస్థితి కరువైంది. విధించిన కోతల సమయాన్ని పునరుద్ధరించి సరఫరా చేస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారుల హెచ్చరిస్తున్నారు. విషయాన్ని స్థానిక అధికారులు జిల్లా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి రైతుల కష్టాలను వివరించినా వారు మొద్దునిద్ర వీడటం లేదు.
డిమాండ్.. సరఫరా: జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది కేటగిరీల కింద మొత్తం 10.53లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా 375 హైటెన్షన్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు కోటి యూనిట్లు(10మిలియన్ యూనిట్లు) అవసరం కాగా లోటు కారణంగా 83లక్షల యుూనిట్ల లోపే సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 1.03 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా 5 హార్స్ పవర్(హెచ్‌పీ) మోటారు 7 గంటల పాటు ఆడితే 28 లక్షల యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. మొత్తం కనెక్షన్లకు రోజుకు దాదాపు 32.51లక్షల యూనిట్ల కావాల్సి ఉంది. మనకు అవసరాలకు చాలడం లేదు.
కోటాకు లోబడి సరఫరా: టి.బసయ్య, ఎస్‌ఈ, కర్నూలు
సింహాద్రి పవర్‌ప్లాంట్‌లో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో గత రెండు రోజులుగా విద్యుత్ సమస్య తీవ్రతరమైంది. డిసెంబర్ 20వ తేదీ నుంచే లోటు ఉంది. అప్పటి నుంచి ఆరు గంటల సరఫరా అందిస్తున్నాం. ఇప్పుడు ఐదు గంటలే ఇస్తున్నాం.