![ఆదివారం సాయంత్రం విశాఖ పాత జైల్‌రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద క్యూ](/styles/webp/s3/article_images/2017/09/4/71481491452_625x300.jpg.webp?itok=nXLU8ONO)
ఆదివారం సాయంత్రం విశాఖ పాత జైల్‌రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద క్యూ
• కరెన్సీ వేటలో సెలవులు వృథా..
• 90 శాతంపైగా ఏటీఎంలకు షట్టర్లు
• వరుస సెలవులతో మూతపడ్డ బ్యాంకులు
• అత్యవసర ఖర్చులకూ నగదు దొరక్క ప్రజలు విలవిల
• తిండికీ, చార్జీలకూ డబ్బు కటకటే
• నోట్ల కోసం జనం తిప్పలు.. నేడూ అదే పరిస్థితి!
సాక్షి, నెట్‌వర్క్
ఆదివారం వారాంతపు సెలవు నోట్ల వేటలో కరిగిపోయింది. నోటు దొరకలేదు. శ్రమ మాత్రం వృథా అయింది. మూడు రోజులు వరుస సెలవులతో బ్యాంకులు మూత పడ్డాయి. అత్యవసర ఖర్చుల కోసం కనీసం రూ.2 వేలైనా తీసుకుందామని ఏటీఎంలను వెతుక్కుంటూ వెళితే ఎక్కడకు వెళ్లినా ‘నో క్యాష్... అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులే దర్శనమిచ్చాయి. ఆదివారం రాష్ట్రంలో 90 శాతంపైగా ఏటీఎంలు పనిచేయలేదు.గుంటూరు నగరంలో వంద ఏటీఎంలు ఉండగా నగరపాలెంలో ఒక్క ఏటీఎం మాత్రమే పని చేసింది. జిల్లాలో మొత్తం 800 ఏటీఎంలు ఉండగా పట్టుమని పది కూడా పనిచేయలేదు. కర్నూలు జిల్లాలో 95 శాతంపైగా ఏటీఎంలు మూతపడ్డాయి. ఉద్యోగులు శని, ఆదివారాల్లో సెలవులు కావడంతో నగదు తీసుకునేందుకు ఏటీఎంల చుట్టూ తిరుగుతూ వారాంతపు సెలవులను వృథా చేసుకున్నామని వాపోయారు.
గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు...
ఔషధాల కొనుగోలు, వైద్యానికి, నిత్యావసర సరుకుల కొనుగోలుకు కనీసం అవసరమైన సొమ్ములేక పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లో ఏటీఎంలు మూత పడి ఉండటంతో జిల్లా కేంద్రాల్లో అయితే నగదు ఉంటుందనే ఉద్దేశంతో ఆదివారం చాలా మంది గ్రామీణులు అష్టకష్టాలు పడి జిల్లా కేంద్రాలకు వెళ్లారు. అక్కడా మూత పడిన ఏటీఎంలు వారిని తీవ్ర నిరాశ పరిచాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన రవి కుమార్తె హైదరాబాద్‌లోని నారాయణ స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతోంది. తన స్నేహితురాలి తండ్రి ఈనెల 12వ తేదీన హాస్టల్‌కు వస్తున్నారని, పుట్టిన రోజు సందర్భంగా డ్రస్ తీసుకోవడానికి, ఇతర ఖర్చులకు రూ. 1500 పంపించాలని తండ్రి రవికి స్కూలు హాస్టల్ నుంచి ఫోన్ చేసి చెప్పింది. రవి ఆ డబ్బు ఇచ్చి పంపుదామని మూడు రోజులుగా ప్రయత్నించినా వీలుకాలేదు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్ మస్తాన్ వలి కుమార్తెకు ఆస్తమా ఉంది. చలికాలం కావడంతో ఆస్తమా తీవ్రత పెరిగి రాత్రిపూట ఊపిరి ఆడక రాత్రిళ్లు లేచి కూర్చుంటోంది. ఆటో తో జీవనం సాగించే ఆయనకు ఏటీఎం కార్డు కూడా లేదు. బ్యాంకులో డబ్బు ఉన్నా తీసుకుని బిడ్డకు వైద్యం అందించలేని దుస్థితిలో ఉన్నానని మస్తాన్‌వలి వాపోతున్నారు.
మాటలు చెప్పడం సులభమే...
కార్డుల ద్వారా చెల్లింపులు జరపాలని ప్రధానమంత్రి, సీఎం ఇతరులు చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. మాటలు చెప్పడానికి ఆచరించడానికి చాలా తేడా ఉంటుందని గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా బిడ్డకు జ్వరం వచ్చింది. కడపలో చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాను. నాదగ్గర నగదు లేదని ఏటీఎం కార్డు ఉందని, దాని ద్వారా చెల్లింపులు జరుపుతానని చెప్పాను. మా ఆస్పత్రిలో స్వైపింగ్ మిషన్ లేదని అక్కడి సిబ్బంది చెప్పారు. సరే ఉన్న డబ్బు ఫీజుగా చెల్లించి పాపను డాక్టరుకు చూపించాను. జిల్లా కేంద్రమైన కడపలోనే నాలుగు మందుల షాపులకు వెళితే ఎక్కడా స్వైపింగ్ యంత్రం లేదు. మరి నేను మందులు ఎలా కొనాలి?’ అని వైఎస్సార్ జిల్లా నాగిరెడ్డిపల్లెకు చెందిన నారాయణరెడ్డి అనే ప్రభుత్వ టీచరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కూడా బ్యాంకులకు సెలవే. ఏటీఎంలు పనిచేసే అవకాశం తక్కువేనని బ్యాంకుల అధికారులు తెలిపారు.
అంతటా అదే దుస్థితి
తూర్పు గోదావరి జిల్లాలో 931 ఏటీఎంలుండగా, ఐదు శాతం ఏటీఎంలలో మాత్రమే నగదు లభిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10–15కు మించి ఏటీఎంలు పనిచేయలేదు. కర్నూలు జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా..ఆదివారం పది మాత్రమే పనిచేశాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 48 బ్యాంకులకు చెందిన 928 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఇందులో విజయవాడ నగరంలో బందరురోడ్డు, మధురానగర్ ప్రాంతాల్లో రెండు ఏటీఎం కేంద్రాలు పనిచేయగా.. అక్కడ జనం కిలోమీటర్ల కొద్దీ బారులు తీరారు. విజయనగరం జిల్లాలోని 266 ఏటీఎంలలో కొన్నింటిలో మాత్రమే కాసేపు ఆదివారం నోట్లు వచ్చాయి.
చిత్తూరు జిల్లాలో ఆదివారం రోజున తిరుపతి నగరంలో మాత్రం మూడు ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. తిరుమలలో 15 ఏటీఎం కేంద్రాలు వుంటే అందులో ఒక్కటి కూడా తెరుచుకోకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. వైఎస్సార్ జిల్లాలోని కడప, జమ్మలమడుగులో మాత్రమే ఒకటి, రెండు ఏటీఎంలు పనిచేశాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ అదే దుస్థితి. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 98 శాతం ఏటీఎంలు మూతపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క ఏటీఎం పని చేయలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో 594 ఏటీఎంలు ఉండగా, 232 ఏటీఎంలలో గంట మాత్రమే నగదు వచ్చింది.