ప్రమాదాల గోదారిలో.. | People Travelling Danger Way In East Godavari River Places | Sakshi
Sakshi News home page

ప్రమాదాల గోదారిలో..

Published Fri, May 18 2018 9:05 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

People Travelling Danger Way In East Godavari River Places - Sakshi

మంటూరు– వాడపల్లి ప్రాంతంలో పరిమితికి మించిన ప్రయాణికులతో పడవలో పయనం...

సాక్షి ప్రతినిధి, తూర్పు గోదావరి ,కాకినాడ: ఈ పడవను చూశారా? పరిమితికి మించి ఎక్కిన ప్రయాణికులతో నడుస్తోంది. ఇదెక్కడో కాదు తాజాగా మంటూరు– వాడపల్లి మధ్య లాంచీ ప్రమాదానికి గురైన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో నడచిన పడవిది. రక్షణ కోసం ఉండాల్సిన లైఫ్‌ జాకెట్లు లేవు. ఏదైనా ప్రమాదం జరి గితే ప్రయాణికులు జల సమాధి కావడం తప్ప మరో మార్గం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారుల కళ్లముందే పరిమితికి మించిన ప్రయాణికులతో పడవలు నడిచాయి. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. ప్రమాద స్థలాన్ని చేరుకునేందుకు కూడాఇలాంటి పడవలపైనే ప్రయాణాలు సాగుతున్నా యి. జనాల రద్దీ దృష్ట్యా అక్కడున్న లాంచీలను తి ప్పాల్సిందిపోయి ప్రమాదకరమైన పడవ ప్రయాణానికి అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు.

ఏముందిలే ఈ ఒక్కరోజే కదా అన్నట్టుగా లాంచీ ప్రమాద ఘటనా స్థలి వద్ద అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కానీ, ఇక్కడ రోజూ జరుగుతున్న తంతు కూడా దాదాపు ఇదే. లాంచీ ప్రయాణాలతోపాటు పడవ ప్రయాణాలు సమాంతరంగా సాగుతున్నాయి. లాంచీలే ప్రమాదాలకు గురవుతుంటే పడవల భద్రత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మచ్చుకు ఇక్కడ జరిగిన పరిణామాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ జిల్లాలో చాలాచోట్ల జరిగేది ఇదే. రహదారుల్లేక,  ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించక జిల్లాలో 70 వరకు గ్రామాల ప్రజలు పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు. నిర్వాహకులు తమకెంత సొమ్ము వస్తుందని చూసుకుంటున్నారే తప్ప పరిమితిని పట్టించుకోవడం లేదు. ప్రయాణికుల రాకపోకలకు పడవలను అనుమతించకూడదు. లాంచీలు, పంటుల పైనే ప్రయాణాలు సాగించాలి. ఇప్పుడా లాంచీలు, పంటులే ప్రమాదాలకు గురై బలితీసుకుంటున్న నేపథ్యంలో పడవ ప్రయాణాలు దినదిన గండమే.  ప్రమాదం జరిగాక హడావుడి చేయడం తప్ప నిబంధనలు, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో పడవ ప్రయాణాలుసాగిస్తున్న గ్రామాలివే...
ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, శౌరిలంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. 1992లో గోగుల్లంక, భైరవలంక మధ్య చింతేరు పాయలో పడవ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందారు.
ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవ ప్రయాణమే సాగిస్తారు. 1990లో లంక రేవులో పడవ మునిగిపోయి పదిమంది చనిపోయారు.
తాళ్లరేవు మండల పరిధిలో గోవలంక, పిల్లంక, అరటికాయ లంక శేరిలంక, కొత్తలంక, ప్రజలు పడవ ప్రయాణం చేయకతప్పడం లేదు. ఈ ప్రాంతంలోని గోదావరి నదీపాయపై 2004లో జరిగిన పడవ ప్రమాదాల్లో  తొమ్మిది మంది మృతి చెందారు.
మామిడికుదురు మండలంలో కరవాక– ఓడలరేవు, గోగన్నమఠం– బెండమూర్లంక, పెదపట్నం లంక– కె.ముంజవరం గ్రామాల మధ్య పడవ ప్రయాణాలు తప్పడం లేదు.
రాజోలు, సఖినేటిపల్లి  మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు పడవలపైనే ఆధార పడుతున్నారు.
పి.గన్నవరం మండలం కనకాయలంక– దొడ్డిపట్ల, ఎల్‌.గన్నవరం–కోడేరులంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు.
కొత్తపేట మండలంలోని తొగరుపాయకు వెళ్లేం దుకు వరదలొచ్చినప్పుడు పడవపై ప్రయాణం సాగిస్తున్నారు. ఆలమూరు మండలంలో వరదలొచ్చినప్పుడు చెముడులంక నుంచి బడుగువాని లంక గ్రామాలకు వెళ్లాలంటే ఇదే పరిస్థితి.  
కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం– కేదారిలంక గ్రామానికి పడవపైన ప్రయాణాలు సాగిస్తుంటారు.
కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలోని రామాలయంపేట, జి.మూలపొలం మధ్య, తల్లంకురు– కేశనకుర్రుపాలెం మధ్య, కుండలేశ్వరం– కేశరకుర్రుపాలెంను గ్రామస్తుల రాకపోకలు పడవలపైనే.
సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకు వెళ్లేందుకు పడవపైన ప్రయాణం సాగిస్తున్నారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీపై ప్రయాణికులు వెళ్తుంటారు.
వీఆర్‌పురం మండలం తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు, కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకు పడవపై వెళ్తుంటారు.
తాజాగా లాంచీ ప్రమాదం జరిగిన దేవీపట్నం మండలంలోనైతే 17 గ్రామాలకు పడవలు, లాంచీలే ఆధారం.

సర్కార్‌ చిన్నచూపు
ఈ గ్రామాలన్నింటికీ నాటు పడవలే ఆధారం. వాటి మీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవనయానం సాగిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, ప్రమాదకర పరిస్థితులను నియంత్రించే దిశగా అధికారులు, పాలకులు అడుగు వేయడం లేదు. వాస్తవానికైతే పైన చెప్పిన 70 గ్రామాల్లో చాలా వరకు రహదారులు వేస్తే పడవలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఏజెన్సీలోని గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారులు వేసినట్టయితే పడవలపై వెళ్లి రావల్సిన అవసరం ఉండదు. కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రహదారుల్లేకపోవడంతో అధికారులు, సిబ్బంది సైతం అక్కడికి వెళ్లడం లేదు. ఫలితంగా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లేవు. అంతెందుకు? తాజాగా లాంచీ ఘటనలో మృతులున్న కొండమొదలు, కచ్చులూరు, కె.గొందూరు, తాటివాడ గ్రామాల్నే తీసుకుంటే....అక్కడ కనీస సౌకర్యాల్లేవు.

గ్రామాలకు రహదారులు లేవు సరే... కనీసం ఫోన్‌ సౌకర్యం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం పాడైనా ఇంతవరకు పట్టించుకోలేదు. కచ్చులూరు గ్రామంలోనైతే పది రోజులుగా విద్యుత్తు సరఫరా లేదు. ఇటీవల కురిసిన గాలివానకు పడిపోయిన విద్యుత్‌ స్తంభాలను రోజులు గడుస్తున్నా పునరుద్ధరించలేదు. ఇక, వైద్యం పరిస్థితి అంతే. వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో వారంతా పడవలు, లాంచీల మీద ప్రయాణాలు సాగించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు. సౌకర్యాలు సంగతి పక్కన పెడితే ప్రయాణమే ప్రమాదకరంగా ఉన్న గ్రామాలను ప్రాధాన్యతంగా తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాకపోకలకు వీలుగా రహదారులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. వరుస ఘటనలు జరుగుతున్నా పాలకులకు కనువిప్పు కలగడం లేదన్న ఆగ్రహం ఈ ప్రాంతవాసుల్లో కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement