చెత్త వేస్తే జరిమానా
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇకపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే కుదరదు. అలా చెత్త వేసేవారి నుంచి జరిమానా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘చెత్తపై సమరం’ పేరిట 100 రోజుల కార్యక్రమాన్ని రూపొందించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 25 నుంచే దీన్ని ప్రారంభించాలని భావించినా మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యమైంది. చెత్తరహిత ప్రాంతాల్లో చెత్త వేస్తే సదరు ప్రజల నుంచి ఎంత మొత్తంలో జరిమానా వసూలు చేయాలన్న వివరాలను అధికారులు స్పష్టం చేయలేదు. ఆ అధికారాన్ని మున్సిపాలిటీ కమిషనర్లకు వదిలేశారు.
కాలనీలు, ఖాళీ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను సంబంధిత కాలనీలే తీసుకోవాలని, కాలనీ సంఘాలకు నోటీసులు జారీ చేయనున్నారు. 100 రోజుల కార్యక్రమాన్ని రూపొందించిన అధికారులు దాన్ని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు పంపించారు. ప్రతీరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల ఒకే తరహా కార్యక్రమాలు అమలు జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిని బాగా నిర్వహించే మున్సిపాలిటీలకు అవార్డులతోపాటు, ప్రోత్సాహాకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు పురపాలక పరిపాలనా కమిషనర్ జనార్దన్‌రెడ్డి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో ఏ,బీ,సీ,డీ గ్రేడ్ల వారీగా మున్సిపాలిటీలను గుర్తిస్తామని వెల్లడించారు. ఈ వంద రోజుల కార్యక్రమం అమలు తీరును పురపాలక పరిపాలనా కమిషనర్‌తోపాటు అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారని వెల్లడించారు.