సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలిన ప్రభుత్వంలా కాకుండా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చి ప్రజా శ్రేయస్సును కాంక్షించే నిబద్ధత గల నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. మడిమ తిప్పని, మాట తప్పని నాయకుడి వైపే మొగ్గుచూపుతున్నారు. యూ టర్న్‌లు తీసుకునే వారిని, హామీలిచ్చి విస్మరించే వారిని ఇంటికి పంపుతామని స్పష్టం చేస్తున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నేతనే ఎన్నుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆ దిశగా ఓటు మీట నొక్కేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
611 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని ప్రభుత్వం... గత ఎన్నికల్లో 611 హామీలిచ్చి వాటిలో ఒక్క హామీని కూడా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడంతో ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధం అనేలా గత ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరించింది. పాలకులను చూసి అధికారులు కూడా భయపడిపోయి అన్ని హామీలూ నెరవేరాయని చెబుతున్నారు.
రాజ్యాంగం అపహాస్యం...
గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగం అపహాస్యమైన సంఘటనలు ఈ ఐదేళ్లలో ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రాజీనామా లేకుండా పార్టీలు మారి ఎమ్మెల్యేలుగా పదవుల్లో కొనసాగారు. ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలకు కనీసం పోలీసు సెక్యూరిటీ కూడా ఇవ్వని దుస్థితి. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిపై దాడులు అధికమయ్యాయి. దళితుల భూముల ఆక్రమణలు ఏకంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరిగాయి. ఏ సమస్య అయినా అడిగితే చాలు పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా కేసులు బనాయించారు. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆ ప్రాంత ప్రజలకు అభివృద్ధిని దూరం చేశారు. వారిని వేధింపులకు గురిచేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టంకు తూట్లు పొడిచారు. ఇలా రాజ్యాంగం అమలు జరగకుండా ప్రభుత్వ పాలన సాగింది.
పాలకుల్లో లోపించిన విశ్వసనీయత...
ఒకప్పుడు నాయకులంటే విశ్వసనీయత ఉండేది. వారిచ్చిన హామీలపై నమ్మకముండేది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేతలు కొంతమేరకైన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేసేవారు. కానీ, కొందరు నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా జనాన్ని వంచించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త హామీలతో పబ్బం గడుపుకుని అధికార పీటం ఎక్కేందుకు అన్ని రకాల వంచనలకు పాల్పడుతున్నారు. జనం కష్టాలు, కన్నీళ్లు పట్టించుకోకుండా స్వలాభాపేక్షే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అలాంటి నేతల పాలనపై విసుగెత్తిన జనం మార్పు కోరుకుంటున్నారు.
కొత్తతరం నాయకత్వం కోసం, సరికొత్త విధానాలతో కూడిన పాలన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు మీట నొక్కి వంచకులకు బుద్ధి చెప్పి తమ బతుకులకు భరోసానిచ్చే యువతరం నాయకత్వానికి నాంది పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. గత పాలకుల వంచన ఫలితంగానే ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. ఐదేళ్లుగా కరువు జిల్లాగానే మిగిలిపోయింది. వలసల జిల్లాగా మారింది. గుక్కెడు నీరు దొరక్క చివరకు ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కేంద్రమైంది. పరిశ్రమల ఏర్పాటుకు నోచుకోక నిరుద్యోగులకు నిలయంగా ఉంది. ప్రాజెక్టులు పూర్తిగాక సాగు, తాగునీరు వెతలతో సతమతమవుతోంది.
కొందరికే న్యాయం.. అర్హులకు అన్యాయం...
కొందరికి మాత్రమే న్యాయం చేసే విధంగా ఉంటూ అర్హులైన ప్రజలకు మాత్రం అన్యాయం చేసేలా ఐదేళ్ల పాలన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. జన్మభూమి కమిటీల పెత్తనం మితిమీరింది. రేషన్ కార్డులు, పింఛన్లను సైతం ఆ కమిటీల కనుసన్నల్లోనే అమలు చేశారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు కేవలం సంతకానికి తప్ప మరిదేనికీ పనికిరాని పరిస్థితులు తీసుకువచ్చారు. మాట వినని అధికారులను ఇష్టానుసారంగా బదిలీలు చేసి అధికార పార్టీ నేతలు అరాచక పాలన సాగించారు.
నిజాయితీ, మార్పు కోరుకుంటున్న ప్రజలు...
ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసి పేద ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించే నాయకుడిని ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్నారు. నిజాయితీతో ఉంటూ రాజ్యాంగ వ్యవస్థల పట్ల బాధ్యతగా వ్యవహరించే నాయకుడు అయితే మంచి పాలన వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇక పార్టీలు మారి నీచపు రాజకీయాలు చేసే సంస్కృతిని అడ్డుకునే నాయకుడు వస్తే మంచి జరుగుతుందని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుని ఆలోచిస్తూ మంచి చేసే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. రోజుకో హామీ.. పూటకో నిర్ణయం మార్చుకుంటూ ఉండేవారి వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని జనం గ్రహించారు. అలాంటి వారిని దూరంపెట్టి ఒకే నిర్ణయం, ఒకే మాటగా ఉన్న నాయకులైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు వేదికగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నిబద్ధత కలిగిన నేతను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు సిద్ధమయ్యారు.
జిల్లాలో అన్నీ సమస్యలే...
జిల్లా పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుక్కెడు మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఫ్లోరైడ్ నీటి పుణ్యమా అని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవికాదు. మందులకు కూడా డబ్బులు లేక కుటుంబ పోషణ భారంగా మారి వాళ్లు బతుకుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే పదమే మర్చిపోయారు. ఎన్నికలు వస్తున్నాయని డీఎస్సీని ప్రకటించి తక్కువ ఉద్యోగాలు చూపించి పరీక్ష పెట్టి వదిలేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణం. వెట్టిచాకిరి చేస్తున్నా ఎప్పుడు జీతాలు వస్తాయో అర్థంగాని పరిస్థితి.
అధికారులపై ఖద్దరు పెత్తనం...
అధికారులు ప్రజలకు న్యాయం చేసే వీలులేకుండా వారిపై ఖద్దరు చొక్కాలు రాజ్యమేలాయి. సామాన్య ప్రజలు కనీసం తమ సమస్యలు చెప్పుకునే వీలు కూడా లేకుండా లా అండ్ ఆర్డర్ కూడా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడిచింది. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు తమ వినతులను పట్టించుకోవాలని అడిగినందుకు కేసులకు బలయ్యారు. తమకు ఎదురు చెప్పకూడదనే విధంగా ఈ పాలన సాగిందన్నది ప్రజల భావన.
సాక్షాత్తూ పెద్ద పదవుల్లో ఉన్న వారే దళితులను కించపరచడం, బీసీల గురించి అసభ్యంగా మాట్లాడటం చేశారు. అధికారులపై చేయి చేసుకోవడం, తనమాట వినని వారిపై అసత్య ప్రచారాలు చేయడం లాంటివి ఈ ఐదేళ్ల పాలనలోనే జరిగాయి. దళితుల భూములు ఆక్రమించుకోవడం, ఇసుకను దోచేయడం, అభివృద్ధి పనుల్లో అంచనాలు పెంచుకుని కోట్లు కొల్లగొట్టడం వంటివి కోకొల్లలు. ఏ గ్రామంలో చూసినా నిర్మాణాలు అవినీతిమయంగా తయారయ్యాయి. చివరకు మరుగుదొడ్ల నిర్మాణాల్లో కూడా కమీషన్లు తీసుకుని కట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.
ఎన్నికలప్పుడే హామీలు గుర్తుకొస్తాయా..?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికలు రావడానికి రెండు నెలల ముందు మాత్రమే పాలకులకు గుర్తుకొస్తున్నాయి. అంటే ఎన్నికల కోసమే హామీలిస్తున్నారు మినహా వాటిని అమలు చేయాలని, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఏ కోశానా లేదు. ఇటువంటి నాయకులు మనకు అవసరమా..? అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులను ఎన్నుకోవాలి.
- ఎం.నాగార్జునరెడ్డి, తాళ్లూరు
ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయాం
ఏళ్ల తరబడి ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయాం. కొత్త నాయకత్వంతో మేలు జరగుతుందని అనుకుంటున్నాం. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడే రాజకీయాలకు అవసరం. హామీలిచ్చి నెరవేర్చని నాయకులు ఎంత మంది వచ్చినా ఒరిగేదేమీ లేదు. అలాంటి వారిని మళ్లీ నమ్మదలచుకోలేదు. అందుకే కొత్త నాయకుడికే మా ఓటు వేస్తాం. అందరూ అదే బాటలో నడవాలి. మంచి పాలన కోసం మార్పును ఆహ్వానించాలి.
- చీరాల రాధాకృష్ణమూర్తి, రావినూతల
Comments
Please login to add a commentAdd a comment