దొంగలు దొరికారు
కనిగిరి : పలు చెయిన్ స్నాచింగ్, చోరీ కేసుల్లో నిందితులను కనిగిరి, పామూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మొత్తం 11 కేసులకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 11 బంగారు గొలుసులు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కనిగిరి పోలీస్‌స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ పి.శంకర్ ఆ వివరాలు వెల్లడించారు. ఏడాది నుంచి కనిగిరి, పామూరు, పీసీ పల్లి, సీఎస్ పురం మండలాల్లో చెయిన్ స్నాచింగ్‌లు, చోరీలు పెరిగిపోయాయి. కనిగిరి, పామూరు సర్కిళ్ల పరిధిలో ఐదుగురు దొంగలు రెండు ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు.
ఏడాది క్రితం కనిగిరి సర్కిల్ పరిధిలోని మాచవరం గ్రామంలో సూరసాని రుక్మిణి బంగారు గొలుసును అపహరించారు. మూడు నెలల క్రితం స్థానిక గార్లపేట రోడ్డులో జి.అలివేలమ్మ, డి.నాగేంద్రమ్మ, ఇటీవల కాశీనాయన గుడివద్ద జయమ్మ, పెన్నా రాములమ్మ, గత నెల 25వ తేదీ సీఎస్ పురంలో ఆలా కొండమ్మ, పామూరు మండలం కంబాలదిన్నెలోని మరో మహిళ మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులైన పామూరు మండలం వీరభద్రాపురానికి చెందిన కొత్తకోట బాలాజీ, చీమలదిన్నె పిచ్చయ్య, రామగిరి సిద్దయ్యలను అరెస్టు చేశారు. వీరిలో పిచ్చయ్య, సిద్దయ్యలు బైక్‌పై సిద్ధంగా ఉంటారని, బాలాజీ అనే వ్యక్తి మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కుని వీరిబైక్‌పై ఎక్కగానే పరారయ్యేవారని డీఎస్పీ తెలిపారు.
అదే విధంగా పీసీ పల్లి మండలంలో గతేడాది అక్టోబర్‌లో స్వాతి రైస్‌మిల్లు వద్ద నిద్రిస్తున్న పి.రమణమ్మ మెడలోని బంగారు సరుడు, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెదఅలవలపాడులో చెన్నుపాటి రత్తమ్మ, మారెళ్లలో సీతమ్మలకు చెందిన బంగారు గొలుసులు, అక్టోబర్‌లో పాకాల కొండమ్మ గొలుసులు అపహరణకు గురయ్యాయి. ఆయా కేసులకు సంబంధించి శీలం ప్రకాష్, తమ్మిశెట్టి వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేశారు. కంభంకు చెందిన వీరిద్దరూ రాత్రి సమయంలో చోరీలు చేసేవారని డీఎస్పీ వెల్లడించారు.
ఈ రెండు ముఠాల నుంచి కనిగిరి, పామూరు, సీఎస్ పురం పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఏడు కేసులకు సంబంధించి 148 గ్రాముల బంగారు గొలుసులు, రెండు మోటారు సైకిళ్లు, పీసీ పల్లిలో నమోదైన 4 కేసులకు సంబంధించి 72 గ్రాముల (నాలుగు గొలుసులు) బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వాటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కేసులను ఛేదించిన కనిగిరి, పామూరు సీఐలు యు.సుధాకర్‌రావు, డి.మల్లికార్జునరావు, పీసీ పల్లి, సీఎస్ పురం, పామూరు ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డుకు సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు.