ఉమేష్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇతగాడు శనివారం అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతడిని ఇక్కడకు తరలించడానికి పీటీ వారెంట్‌తో వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ విషయం తెలిసింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఎస్కేప్‌పై మన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమేష్ ఖతిక్ నేరాంగీకార వాంగ్మూలం సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ‘బంగారం కోసమే’ ఈ వ్యవహారమా? అని భావిస్తున్నారు. తాజా పరిణామం నేపథ్యంలో ఉమేష్ కోసం అహ్మదాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు మళ్లీ గాలింపు చేపట్టారు.
అగమ్యగోచరంగా పరిస్థితి...
ఉమేష్ ఖతిక్ అంశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెండ్ డైడ్’ అన్నట్లు ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రాజధానిలో అయిదు స్నాచింగ్స్ చేసిన 24 గంటల్లోనే ఇతడిని గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని రికవరీల్లో ఇబ్బంది ఉండకూడదనే అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీన్నే ఆ పోలీసులు తమకు అనువుగా మార్చుకుంటూ ఉమేష్‌ను అరెస్టు చేయడంతో పాటు ఇక్కడి ఐదు నేరాలకు సంబంధించిన 18.5 తులాలను రికవరీ చేశారు.
చదవండి: Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి!
ఆ బంగారాన్ని తమ కేసుల ఖాతాలో వేసేసుకున్నారు. ఉమేష్ అరెస్టు ప్రకటించిన అహ్మదాబాద్‌లోని వడాజ్ పోలీసుస్టేషన్ అధికారులు చిత్రంగా అతడి నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేశారు. అందులో హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్నట్లు చూపిస్తూనే.. ఒక నేరంలో తస్కరించిన గొలుసు మరో స్నాచింగ్ చేస్తున్నప్పుడు పడిపోయినట్లు రికార్డు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే అలా రికార్డు...
అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా నేరగాళ్లు వివిధ ప్రాంతాల్లో నేరాలు చేస్తుంటారు. వీరిని ఒక విభాగానికి చెందిన పోలీసులు పట్టుకున్నప్పుడు నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేస్తారు. అందులో కేవలం సదరు నేరగాడు తమ ప్రాంతంతో పాటు ఫలానా చోట్లా నేరాలు చేశాడని పొందుపరుస్తారు. మరో జిల్లా, రాష్ట్ర పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై తీసుకురావాలంటే ఇది కచ్చితం. పట్టుకున్న సందర్భంలో రికవరీ చేసిన సొత్తు పూర్వాపరాలు పరిశీలిస్తారు. సమయం, సందర్భాలను బట్టి అది వేరే ప్రాంతానికి చెందినదనే ఆధారాలు లభిస్తే తమ వద్ద భద్రపరిచి ఆ పోలీసులకు అప్పగిస్తుంటారు.
చదవండి: Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే
ఉమేష్ వ్యవహారంలో అహ్మదాబాద్ పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలం ఉద్దేశపూర్వకంగానే ఉన్నట్లు కనిపిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సాధారణంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ నేరాలు చేసినట్లు మాత్రమే రాస్తారని, దీనికి భిన్నంగా ఆ నేరాల్లో లాక్కున్న గొలుసులు పడిపోయాయంటూ రాయడం, తాము వెళ్లినా అప్పగించకపోవడంతోనే వారి ఉద్దేశం
అర్థమవుతోందన్నారు.
వ్యవహారం ముదరడంతో మరో ట్విస్ట్..?
ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో అహ్మదాబాద్ పోలీసులతో మాట్లాడారు. దీంతో విషయం సీరియస్‌గా మారుతోందని భావించిన అక్కడి అధికారులు ఈ కొత్త ట్విస్ట్‌కు కారణమై ఉంటారని మన పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనే ఉమేష్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇతడికి అరెస్టు ప్రకటించిన వడాజ్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్నప్పుడు ఫిట్స్ వచ్చిపడిపోయాడని, అందుకే అహ్మదాబాద్‌లో శారదబెన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి శనివారం పారిపోయాడంటూ చెప్తున్నారు. గతంలో కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర ఉన్న ఈ కరుడుగట్టిన స్నాచర్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో అర్థం కావట్లేదని, దీని వెనుకా ఏదైనా మతలబ్ ఉందా? అనేది పరిశీలించాలని సైబరాబాద్‌కు చెందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment