అధికారమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబునాయుడు పాలనపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ‘ఓటు’ గండం దాటాక హామీలను తగలేయడంలో సీఎం చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 151 రోజుల చంద్రబాబు పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయకపోగా.. తీసివేతలు, కోతలకు పదును పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం ఆపార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నా చేపట్టేందుకు కదంతొక్కుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. ఒక్క సంతకంతో పంట రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలనూ ఒక్క సంతకంతో అప్పుల సుడిగుండం నుంచి రక్షిస్తానని పేర్కొన్నారు. ఇవే కాదు.. వందకుపైగా హామీలను ఇస్తూ మార్చి 31న ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజ యం సాధించడంతో జూన్ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 151 రోజుల్లోఏ ఒక్క హామీని అమలుచేయక పోవడంతో ప్రజలు మండిపడుతున్నారు.
పంట రుణాల మాఫీ మాయే!
చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 2013, డిసెంబర్ 31 నాటికి 8,70,321 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.11,180.25 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలి. రుణాల మాఫీకి మార్గదర్శకాలు రూపొందించేందుకు కోటయ్య కమిటీని నియమిస్తూ తొలి సంతకం చేశారు. కోటయ్య కమిటీ నివేదిక మేరకు ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు(రూ.లక్ష పంట రుణం, రూ.50 వేలు బంగారు రుణం) మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని బ్యాంకర్లను ఆదేశించారు.
కానీ.. ఈలోగా రుణ మాఫీ కాదు రైతులను రుణ విముక్తి చేస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి.. రైతు తీసుకున్న రుణంలో ఏటా 20 శాతాన్ని(రూ.లక్ష రుణం తీసుకుని ఉంటే.. ఏటా రూ.20 వేల వంతున) ఆ రైతు ఖాతాలో జమ చేసి, ఐదు విడతల్లో రుణ విముక్తి కల్పిస్తామని ప్రకటించారు. రైతు రుణ విముక్తి కోసం సకాలంలో ఆధార్‌కార్డులు ఇవ్వలేదనే సాకుతో 2.17 లక్షల మంది రైతులను జాబితా నుంచి తప్పించారు.
గడువులోగా రుణాలు చెల్లిస్తే.. రుణాలపై ఏడు శాతం వడ్డీని మాత్రమే రైతుల నుంచి బ్యాంకర్లు వసూలు చేస్తారు. కానీ.. గడువు మీరిపోవడంతో పంట రుణాలపై బ్యాంకర్లు 14 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరు వల్ల సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో రైతులపై రూ.939.12 కోట్ల వడ్డీ భారం పడింది. రైతు సాధికార సంస్థకు కేటాయించిన నిధులు ఈ ఏడాది పంట రుణాలపై వడ్డీని చెల్లించడానికి కూడా సరిపోవని బ్యాంకర్లు స్పష్ట చేస్తుండడంతో రైతులు ఉద్యమబాట పట్టారు.
డ్వాక్రా మహిళలకూ టోపీ
జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాల్లో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 31, 2013 నాటికి డ్వాక్రా మహిళలు వివిధ బ్యాంకుల్లో రూ.1,611.03 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష వంతున మూలధనంగా అందిస్తామని కొత్త పల్లవి అందుకున్నారు. ఆ రూ.లక్షను కూడా ఏటా రూ.20 వేల చొప్పున ఐదు విడతల్లో అందిస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో డ్వాక్రా మహిళలు సకాలంలో అప్పులు చెల్లించలేదు. దీని వల్ల ఆ మహిళలకు వడ్డీ రాయితీ దక్కకుండా పోయింది. 14 శాతం అధిక వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. దీని వల్ల డ్వాక్రా మహిళలపై రూ.135.32 కోట్ల మేర వడ్డీ భారం మోపినట్లైంది. వడ్డీ భారం మేరకు కూడా ప్రభుత్వం నుంచి మూలధనం అందకపోవడంతో డ్వాక్రా మహిళలు పోరుబాట పట్టారు.
అన్నీ కోతలే
151 రోజుల పాలనలో చంద్రబాబు కొత్తగా ఒక్కరికి పెన్షన్‌గానీ.. రేషన్‌కార్డుగానీ.. ఇళ్లుగానీ మంజూరు చేసిన దాఖలాలు లేవు. కానీ.. ఉన్నవి మాత్రం తీసివేయడంలో ముందున్నారు. జిల్లాలో జూన్ 8, 2014 నాటికి 11,20,532 రేషన్‌కార్డులు చలామణిలో ఉన్నాయి. ఇందులో తెల్లకార్డులు 9,85,036.. గులాబీకార్డులు 1,35,546. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పేరుతో ఈ-పీడీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ విధానం అమలుకు మన జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ విధానంలో రేషన్ దుకాణాలను కంప్యూటరీకరిస్తారు.
రేషన్‌కార్డులనూ.. ఆధార్‌కార్డులనూ అనుసంధానం చేశారు. ఆధార్ నెంబరుతో సరిపోని కార్డులను తొలగించారు. ఆధార్‌కార్డులు ఇవ్వలేదనే సాకుతో 1.35 లక్షల రేషన్‌కార్డులను బోగస్‌కార్డులుగా ముద్రవేసి తొలగించారు. ఆ కార్డుల లబ్ధిదారులకు అక్టోబరు రేషన్ కోటాను రద్దు చేశారు. ఇదే పద్ధతిలో అన్ని అర్హతలున్నా అనర్హులుగా చిత్రీకరిస్తూ 54,254 మంది వృద్ధులు, 22,108 మంది వితంతువులు, 3,330 వికలాంగులు, 1,673 మంది చేనేత కార్మికులు, 2,786 మంది అభయహస్తం, 16 మంది గీత కార్మికులు వెరసి 84,617 మంది లబ్ధిదారులను పెన్షన్‌ల జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జనానికి దన్నుగా.. ప్రజావ్యతిరేక చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా మండల కేంద్రాల్లో బుధవారం వైఎస్సార్‌సీపీ ధర్నాలకు పిలుపునిచ్చింది.
‘ఓటు’ దాటాక.. అందరికీ టోపీ..!
Published Wed, Nov 5 2014 4:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement