పాలకొండ:కార్మికుల పొట్ట కొట్టారు.. రైతులను ముంచారు... వృద్ధులను ఏడిపించారు.. కూలీలకు నోటికాడ కూడు తీసేశారు. తాత్కాలిక ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. ఆరు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ నిజస్వరూపాన్ని ఇప్పుడిప్పుడే అధికారులు చూడగలుగుతున్నారు. జరుగుతున్నదేమిటో తెలుసుకొని ప్రభుత్వానికి నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. జన్మభూమి కమిటీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.350తో టీడీపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. తన పాత నైజాన్ని ఆ ప్రభుత్వం బయటపెడుతున్న విషయం తేటతెల్లమైంది. తెలివిగా తమతోనే తప్పు మీద తప్పు చేయించి ప్రజలు దాడులకు పాల్పడే స్థితికి దిగజారుస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం అధికార పార్టీ నాయుకులు తమను బలి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. జీవో నెంబర్ 350పై స్పష్టత ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల అధికారులు, ఉద్యోగులు సోమవారం సాయంత్రానికి జిల్లా కేంద్రానికి వెళ్లి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్‌లను కలిసి పరిస్థితిని వివరించినట్లు కొందరు అధికారుల ద్వారా తెలిసింది.
కమిటీ పేరుతో పెత్తనం
అధికారుల, ఉద్యోగులను ఆగ్రహానికి గురి చేసిన జీవో నెం.350లో ఏముందంటే.. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, ఎంపికలకు జన్మభూమి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. పింఛన్ల మంజూరు, రుణమాపీ, రుణాల మంజూరు, పక్కా ఇళ్లు.. ఇలా అన్ని సంక్షేమ కార్యక్రమాల ఎంపిక, పర్యవేక్షణను ఈ జన్మభూమి కమిటీలకే కట్టబెట్టారు. అయితే ఈ కమిటీల సభ్యులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలనే నియమించడంతో అసలు సమస్య ప్రారంభమైంది. సంక్షేమ పథకాల వర్తింపులో రాజకీయాలకు పాల్పడుతూ, ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు కమిటీలను వేదికగా చేసుకుంటున్నారు. అర్హత ఉన్నా ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులకు పథకాలు అందకుండా ఈ కమిటీలు అడ్డుకట్ట వేస్తున్నాయి. కమిటీల ముసుగులో టీడీపీవారు ఉండగా.. వారు తీసుకున్న నిర్ణయాలను అధికారులు, ఉద్యోగులే అమలు చేయాల్సి వస్తోంది.
ఫలితంగా వారే ప్రత్యక్షంగా ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. అర్హత పత్రాలతో కొందరు లబ్ధిదారులు అధికారులను నేరుగా నిలదీస్తున్న సంఘటనలు జిల్లాలో పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. కొందరు బాధితులు కార్యాలయాలకు వచ్చి అందరి సమక్షంలోనే సంబంధిత అధికారులు, ఉద్యోగులను దూషిస్తున్నారు. ఇంకొందరు కోర్టులకు వెళ్లేందుకూ వెనుకాడటం లేదు. ఫలితంగా ప్రభుత్వ సిబ్బంది భయం భయంగానే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహించలేమని, జీవో నెంబర్ 350పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘం నాయుకులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఎంపికలు జరపాలా లేక కమిటీ సూచించిన వారినే అర్హులుగా ప్రకటించాలా అన్నది స్పష్టంగా తెలియజేయాలంటున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న 500 మంది ఉద్యోగులు సామూహిక సెలవులు పెడతామని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించినట్లు తెలిసింది.
ఎవరిని ముంచడానికి ఆ జీవో?
Published Tue, Dec 23 2014 3:13 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement