నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ :
తెలంగాణను వ్యతిరేకించే పార్టీలకు ఇక్కడ తావు లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకే సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనికి సీమాంధ్ర నేతలు అడ్డుతగలడం సరికాదన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రావ్యగార్డెన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందా న్ అధ్యక్షతన పార్టీ జిల్లా విస్తృత్త స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణపై తెలుగుదేశం పార్టీ మాటమార్చిందని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్టానం గుర్తిం చిందని, అందువల్లే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇటీవల సర్పంచ్‌లుగా, సహకార సంఘాల చైర్మన్లుగా గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారులు గ్రామాల అభివృద్ధి లో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
అన్ని స్థానాలు గెలిపించి..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రు ణం తీర్చుకుందామని ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణను సీమాంధ్రులు అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. వ్యాపారాల పేరుతో అన్ని వనరులను వినియోగించుకుం టూ వారే అభివృద్ధి చెందారన్నారు. తెలంగాణపై రాద్ధాంతాలు చేసుకుంటూపోతే భావోద్వేగాలు పెరిగిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణపై సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయానికి సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. అక్టోబర్ 2లోపు అన్ని గ్రామాల్లో తెలంగాణతో కూడిన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు.
నిర్ణయం జరిగిపోయింది
తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, నెలాఖరులోపు రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరని, ఎవరూ పార్టీని విడిచి వెళ్లవద్దని కోరారు. ఈనెల 24 వ తేదీన తెలంగాణ ప్రాంతానికి చెందిన మం త్రులు, ముఖ్య నేతలం ఢిల్లీకి వెళ్లి సోనియాను కలుస్తామని, తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరతామని పేర్కొన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ టీడీపీతో పొత్తుకోసం బీజేపీ వెంపర్లాడుతోందని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు.
పుష్కరకాలంగా ఎంతో కష్టపడ్డామని, దాని ఫలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్, ప్రభుత్వ విప్ అనిల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే వారు తమ సందేశాన్ని ఫ్యాక్స్ ద్వారా డీసీసీ అధ్యక్షుడికి పంపారు. ఆయన దానిని చదివి వినిపించారు. తెలంగాణ ప్రజల అకాంక్షను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన సర్పంచ్‌లు, సింగిల్ విండో చైర్మన్లను సన్మానించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు వెంకుల్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, పీసీసీ కార్యదర్శులు సురేందర్, రత్నాకర్, పీసీసీ సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకే ‘తెలంగాణ’
Published Fri, Sep 20 2013 2:36 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement