
కన్నేస్తే.. నగలు మాయం
కాకినాడ క్రైం: జ్యూయలరీ షాపుల్లో చోరీలకు పాల్పడిన మహిళను కాకినాడ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ వన్ టౌన్ క్రైం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్సై పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురం మిరపకాయల వారి వీధికి చెందిన పెరుమాళ్ల మణి అలియాస్ చిట్టిని ఆయా షాపుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సోమవారం కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీల వివరాలు తెలిశాయి. రద్దీగా ఉండే జ్యూయలరీ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్లినట్లు నటించేది.
షాపు సిబ్బంది మరో వస్తువు చూపించేందుకు వెనక్కు తిరిగిన వెంటనే ఆభరణాలను తస్కరించేంది. వారు వస్తువు పోయిందని గమనించేలోపు ఉడాయించేది. కాకినాడ ఖజానా జ్యూయలర్స్, మల్‌బార్ గోల్డ్, గ్రంధి జ్యూయలరీ షాపు, విశాఖపట్నం వైభవ్, విజయనగరం సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె వద్ద నుంచి రూ. 5.60 లక్షల విలువైన 197.540 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం నిందితురాలిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీనివాసరావు, ఏఎస్సై సత్యనారాయణ, సిబ్బంది వెంకటేశ్వరరావు, ప్రసాద్, నాయుడు, అజయ్, బాబు, ఫణికుమార్‌ను డీఎస్పీ ఆర్.విజయభాస్కర రెడ్డి, కాకినాడ సెంట్రల్ క్రైం స్టేషన్ సీఐ అల్లు సత్యనారాయణ అభినందించారు.