
సాక్షి, హైదరాబాద్: నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారు, వజ్రాలతో ఓ జ్యూవెలరీ షాప్ యజమాని పరారైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బషీర్‌బాగ్‌కు చెందిన శ్రీయాష్ జ్యూవెలరీస్ భాగస్వామి ఆనంద్‌కుమార్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని శ్రీయాష్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ షాప్‌లు, కస్టమర్ల కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా బంగారు, వజ్రాభరణాలను తయారు చేసి ఇస్తుంటారు.
గత ఏడాది ఆనంద్‌కుమార్ అగర్వాల్‌కు గణేష్ చంద్ర దాస్(అతిక్ జ్యువెల్లర్స్) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన గత నవంబర్‌లో పలు దఫాలుగా రూ.కోటి విలువైన ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చంద్రదాస్ వీటిలో దాదాపు రూ.30లక్షల విలువైన ఆభరణాలను తయారు చేసి అప్పగించాడు. రూ.65లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.17లక్షల వజ్రాల ఆభరణాల తయారీలో జాప్యం చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుంచి గణేష్ చంద్ర దాస్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన యాష్ జ్యూవెలరీస్ యజమాని ఆనంద్‌కుమార్ అగర్వాల్ చార్మినర్‌లోని అతని దుకాణానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం కోల్‌కత్తాకు వెళ్లింది.
చదవండి: Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్