Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు! | Gold Scam Alert: Bill With More Carats For Jewellery Of Less Carats, More Details Inside | Sakshi
Sakshi News home page

Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!

Published Fri, Jul 5 2024 5:18 AM | Last Updated on Mon, Jul 29 2024 12:37 PM

Bill with more carats for jewelrys of less carats

సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాల తయారీ

18, 14 క్యారెట్లతో కూడా చేస్తున్న జ్యువెలరీ దుకాణదారులు

తక్కువ క్యారెట్ల ఆభరణానికి ఎక్కువ క్యారెట్లతో బిల్లు

అవగాహనలేక మోసపోతున్న కొనుగోలుదారులు.. 

హాల్‌మార్క్‌ ఉంటే ఓకే

స్వచ్ఛతపై అవగాహన అవసరం: నిపుణులు

హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్‌మార్క్‌ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.

బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్‌సీజన్‌లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది.

పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు.  సాక్షి హైదరాబాద్‌

మోసం ఇలా..
ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్‌ మాల్స్‌ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి.  వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది.  ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.

హాల్‌మార్క్‌ ముద్ర తప్పనిసరి
వంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్‌ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్‌ మార్క్‌ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్‌ మార్క్‌ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌లపై 916, 21 క్యారెట్‌లపై 875, 18 క్యారెట్‌లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్‌ తర్వాత హాల్‌ మార్క్‌ వేసిన సెంటర్‌ మార్క్‌ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్‌ అక్షరం కోడ్‌ రూపంలో ఉంటుంది.  చివరిలో బీఐఎస్‌ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్‌ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.

స్వచ్ఛత...క్యారెట్లలో
బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24  వరకు ఉంటుంది. క్యారెట్‌ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్‌ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.

ఆభరణంలో బంగారమెంత?
కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్‌ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్‌లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్‌ ఎక్కువగా ఉందన్నమాట. 

క్యారెట్లు..రకాలు
24 క్యారెట్లు:  పూర్తి  స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్‌) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.

22 క్యారెట్లు:  ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్‌ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్‌ లేదా 91.6 కేడీయం గోల్డ్‌ అని కూడా అంటారు.  

18 క్యారెట్లు: 
ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్‌ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్‌ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.

14 క్యారెట్లు: 
ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్‌ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. 

టంచ్‌ మిషన్‌లతో ‘పంచ్‌’
నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్‌ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్‌ మిషన్‌లో పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. 

ఇది టంచ్‌ మిషన్‌లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్‌–రే ఫ్లోరోసెన్స్‌ మిషన్‌ (కంప్యూటర్‌ అనుసంధాన యంత్రాల టంచ్‌ మిష¯Œన్‌)తో  బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్‌పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.

బంగారు పూతనే వన్‌ గ్రామ్‌
వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్‌ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్‌ గ్రామ్‌ గోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్‌ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. 

బంగారం స్వచ్ఛత ఇలా..
క్యారెట్‌         స్వచ్ఛత
24 క్యారెట్‌        99.9
23 క్యారెట్‌        95.8
22 క్యారెట్‌         91.6
21 క్యారెట్‌        87.5
18 క్యారెట్‌         75.0
14 క్యారెట్‌         58.3

బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరి
బంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్‌ మాల్స్‌ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్‌ మిషన్‌ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు  వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.

వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్‌మార్క్‌ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్‌ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్‌ మార్క్‌ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.

– భాస్కర్‌ కూచన, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ కంట్రోలర్, లీగల్‌ మెట్రాలజీ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement