ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మల్కాజిగిరి(హైదరాబాద్): ఆర్‌కే నగర్‌లోని లక్ష్మీ విలాస్ బ్యాంక్( డీబీఎస్ బ్యాంక్) లో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారం మాయమైంది. ఇది ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మల్కాజిగిరి పోలీసులు, ఫిర్యాదుదారుడు పేర్కొన్న వివరాల ప్రకారం... లక్ష్మీ విలాస్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సాయి గౌతమ్ లాకర్ రూం ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఈ నెల 9న కొంత నగదు డ్రా చేసి తన లాకర్‌లో పెట్టి.. దానిని మరుసటి రోజు (10న) తీసుకున్నాడు. 11న తన వద్ద ఉన్న లాకర్ తాళం కనిపించలేదు. దానికి కోసం వెతికినా దొరకలేదు. ఈ నెల 17న లాకర్ కంపెనీ వాళ్లను పిలిపించి తెరిపించగా అందులో భద్రపర్చిన బంగారం కనిపించలేదు. ఈ మేరకు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సాయిగౌతమ్ మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. డీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జవాన్, క్లూస్ టీమ్ అధికారి నందకుమార్‌లు బ్యాంక్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
అతడి పనేనా?
అసిస్టెంట్ మేనేజర్ సాయి గౌతం చెబుతున్న విషయాలకు పొంతన కుదరడం లేదు. ఈ నెల 17వ తేదీ లాకర్ తెరిపించిన తర్వాత బంగారు ఆభరణాల కనిపించకపోతే శనివారం ( 21న) పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని లాకర్లకు సంబంధించిన మాస్టర్ కీస్ అతడి వద్దే ఉంటాయి. తన లాకర్‌కు సంబంధించిన కస్టమర్ తాళం పోయిందని చెప్పడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులో గత 20 రోజులుగా సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment