పేట టీడీపీలో తిరుగుబాటు | Peta uprising in TDP | Sakshi
Sakshi News home page

పేట టీడీపీలో తిరుగుబాటు

Published Tue, Aug 11 2015 11:36 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

పేట టీడీపీలో  తిరుగుబాటు - Sakshi

పేట టీడీపీలో తిరుగుబాటు

ఎమ్మెల్యే అనితపై ధ్వజం
మంత్రి గంటాపై  విమర్శనాస్త్రాలు
పాయకరావుపేటలో  అసమ్మతి సమావేశం
జిల్లా టీడీపీ అధ్యక్షుడు పప్పలతో భేటీ
14న సీఎం వద్ద పంచాయితీ

 
విశాఖపట్నం: జిల్లా టీడీపీలో పుట్టిన ముసలం పదునెక్కుతోంది. టీడీపీని నిలువునా చీల్చేస్తోంది. గంటా, అయ్యన్నవర్గాలుగా కత్తులు నూరుతున్న టీడీపీ వర్గరాజకీయం రోడ్డున పడింది. అందుకు పాయకరావుపేట నియోజకవర్గం వేదికగా మారింది. జిల్లాలో మంత్రి గంటా వర్గంలో కీలకంగా ఉన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు  వ్యతిరేకంగా నియోజకవర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అసమ్మతివర్గం ప్రత్యేకంగా సమావేశమై తాడోపేడో తేల్చుకునేందుకు సంసిద్ధమయ్యారు. మంత్రి గంటా అండ చూసుకునే ఎమ్మెల్యే అనిత నేతలు, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు 14న సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో బయటపడ్డ టీడీపీ వర్గ విభేదాలు జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచికగా నిలుస్తున్నాయి.     

పార్టీని ముంచుతున్న తీరు..
నియోజకవర్గ టీడీపీ నేతలు ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించారు. నాలుగు మండలాలకు చెందిన దాదాపు 150మంది పాయకరావుపేటలో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  నేతలు, కార్యకర్తలను ఎమ్మెల్యే గుర్తించడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని విరుచుకుపడ్డారు. నక్కపల్లి మండలంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి నామినేటెడ్ పదవితోపాటు ఐదు పదవులు ఇచ్చిన విషయాన్ని ఉదాహరించారు.  ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీ కనుమరుగైపోతుందని కూడా తేల్చిచెప్పారు.
 
మంత్రి గంటాపై ధ్వజం
 మంత్రి గంటా అండదండలు చూసుకునే ఎమ్మెల్యే ఖాతరు చేయడం లేదని పలువురు నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడం వెనుక మంత్రి గంటా హస్తం ఉందని కూడా ఆరోపించారు. పీసీపీఐఆర్ ప్రాజెక్టును నియోజకవర్గంలో ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఎమ్మెల్యే మాత్రం అధికారులతో కలసి బలవంతపు భూసేకరణకు సిద్ధపడటమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా మంత్రి గంటా సూచనల మేరకే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  
 
తాడోపేడో తేల్చుకుంటాం
 ఈ సమావేశం అనంతరం పాయకరావుపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు యలమంచిలి వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయ్యారు. డీసీసీబీ డెరైక్టర్ గెడ్డం కన్నబాబు,  గెడ్డం బుజ్జి, గొర్రెల రాజబాబు, గెడ్డం రమేష్, బొల్లం సూర్యచలపతి, దేవవరపు శివ, కొండయ్య, సీతారాం తదితరులు పప్పల చలపతిరావును కలిసి ఎమ్మెల్యే అనిత తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. వారిని శాంతింపజేయడానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు  ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. సీఎం చంద్రబాబుతో తమకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు. ఆయన వద్దే ఎమ్మెల్యే అనిత సంగతి తేల్చుకుంటామమన్నారు. దాంతో  14న సీఎం చంద్రబాబుతో కలిపిస్తానని చలపతిరావు వారికి హామీ ఇచ్చారు. నేతలు, కార్యకర్తలు కొంత శాంతించి సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై కాసేపు చర్చించుకుని వెనుదిరిగారు.  జిల్లా టీడీపీని ఓ కుదుపు కుదిపిన ఈ పరిణామం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా నిలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement