చంద్రగిరి: ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి సభలు నిర్వహిస్తున్నాం. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కరిస్తాం’ ఇవీ సీఎం నుంచి మంత్రులవరకు పలికిన మాటలు. ఇదంతా ఉత్త బోగస్ అని, జన్మభూమి అర్జీలు చెత్తబుట్టలకే పరిమితమయ్యాయని చంద్రగిరిలో జరిగిన ఘటన నిరూపించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో జన్మభూమి అర్జీలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం విమర్శలకు తావిస్తోంది. జన ్మభూమి సభల్లో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు, జన్మభూమి కమిటీలకు అర్జీల రూపంలో వారి సమస్యలను విన్నవించుకున్నారు. అర్జీలను స్వీకరించిన జన్మభూమి కమిటీ సభ్యులు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని గొప్పలు చెప్పారు.
టీడీపీ నాయకుల మాటలు నీటిమూటలే అన్న నానుడిని నిజం చేస్తూ చంద్రగిరి వికలాంగుల కాలనీకి వెళ్లే మార్గంలోని ప్రతిభా స్కూల్ వెనుక భాగంలోని చెత్తకుప్పలో బుధవారం గత జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు ప్రత్యక్షమయ్యాయి. ఇందులో ఇల్లు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డు కోసం ఇచ్చిన అర్జీలు ఉన్నాయి. దీనిపై స్థానికులు మండిపడ్డారు. సీఎం సొంత మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉంటుందో అని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.