పెట్రో ధరల పెంపుపై నిరసన
Published Mon, Sep 2 2013 2:09 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM
ఆదిలాబాద్ మున్సిపాలిటీ/మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలో ఆదివారం నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై నాయకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వం చమురు సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. లీటరు పెట్రోల్‌కు రూ.2.35 పైసలు, డీజిల్‌పై 50 పైసలు పెంచడం సరికాదని, ఈ నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లంక రాఘవులు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మల్లేశ్, డివిజన్ కార్యదర్శి పోశెట్టి, నాయకులు నరేశ్, కిరణ్, సచిన్ పాల్గొన్నారు.
మంచిర్యాలలో..
మంచిర్యాల బస్టాండ్ కూడలిలో భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ కె.జయరావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. పదేపదే ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నాయకులు మధు, మల్లయ్య, ఇక్బాల్, దుర్గయ్య, మొహినోద్దీన్, రామస్వామి, శ్రీ కాంత్, శ్రీనివాస్, శివకుమార్, మొగిలియాదవ్ పాల్గొన్నారు.
Advertisement