టమాట రైతుల ఆందోళన
కర్నూలు (న్యూసిటీ): టమాట ధర పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మంగళవారం రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. రైతులంతా టమాట గంపలతో తరలివచ్చి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. జగన్నాథం మాట్లాడుతూ టమాట ధర కిలో 50 పైసలకు పడిపోయిందన్నారు. ఎకరా పంట సాగుకు రూ. 30 వేల వరకు ఖర్చు పెడుతున్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోత కూలీలు కూడా రాకపోవడంతో కొందరు రైతులు పంటను అలాగే వదిలేస్తున్నారని తెలిపారు. 2014 ఆగస్టు 15న కర్నూలులో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం చంద్రబాబు జిల్లాలో టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో రైతు సంఘం నాయకులు ఖాజాహుసేన్, డి.శ్రీనివాసరావు, మహేష్, నరసింహులు, రైతులు పాల్గొన్నారు.