గప్‌చిప్‌గా పెట్రోల్ కొట్టేస్తారు | Petrol cheating rocket busted | Sakshi
Sakshi News home page

గప్‌చిప్‌గా పెట్రోల్ కొట్టేస్తారు

Published Thu, Jan 30 2014 2:53 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

గప్‌చిప్‌గా పెట్రోల్ కొట్టేస్తారు - Sakshi

గప్‌చిప్‌గా పెట్రోల్ కొట్టేస్తారు

‘చోరీ’ సాఫ్ట్‌వేర్‌తో రూ. 30 కోట్లకు చిల్లు
  మూడేళ్లుగా వాహనదారుల నిలువు దోపిడీ
  ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్‌వోటీ 
  ఐదుగురి అరెస్టు... ముగ్గురు పరారీ
 
 సాక్షి, సిటీబ్యూరో: అసలే ధర పెంచేస్తూ చమురు సంస్థలు వేస్తున్న వరుస వాతలతో వాహనదారులు ఒకపక్క విలవిలలాడుతుంటే... వారినింకా నిలువు దోపిడీ చేసేయడానికి దొరికిన ఏ అవకాశాన్నీ కొందరు పెట్రోల్ బంకు నిర్వాహకులు వదలట్లేదు... ఇదే అదనుగా ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ముందుకొచ్చింది ఓ ముఠా... 800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటరు (1000 ఎం.ఎల్.) పోసినట్లు తెర (డిస్‌ప్లే)పై చూపించడం దీని ప్రత్యేకత... ఇంకేం మూడేళ్ల క్రితమే ఈ తరహా దోపిడీకి తెర లేచింది. వాహనదారుల జేబుకు చిల్లు పెట్టడం మొదలెట్టారు. ఇలా మన రాష్ట్రంలోనే దాదాపు రూ. 30 కోట్ల వరకు చల్లగా నొక్కేశారని అంచనా. ఈ నయా మోసానికి తెరలేపిన ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ మోసానికి పాల్పడ్డ పెట్రోల్ బంకు యజమానులు, మేనేజర్లపై కేసులు నమోదు చేయనున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 
 రాష్ట్రంలో మూడేళ్లుగా దగా: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అఫ్జల్ బారీ (35), ఫైజల్ బారీ (38) సోదరుల కుటుంబం దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వచ్చి స్థిరపడింది. వారిద్దరూ ఐటీఐలో ఫిట్టర్ ఒకరు, ఎలక్ట్రానిక్స్ కోర్సును మరొకరు చదివారు. పెట్రోల్ బంక్‌లో మెకానిక్ అయిన తండ్రి మసూద్ వద్ద పంప్ మెకానిక్ నైపుణ్యాన్నీ సంపాదించారు.  ఆ సోదరులిద్దరూ హైదరాబాద్, విజయవాడల్లో పలు పెట్రోల్ బంకుల్లో పనిచేశారు. విజయవాడలో పనిచేస్తున్నప్పుడే పెట్రోల్ పంప్ మెషిన్లను తయారు చేసే తోకీమ్ కంపెనీలో టెక్నిషియన్ కల్యాణ్ వారికి పరిచయమయ్యాడు. 
 
 - అఫ్జల్, ఫైజల్, కల్యాణ్ ముగ్గురూ కలసి రూ. 6 లక్షల చొప్పున ముట్టజెప్పి ఆరు కంపెనీలకు చెందిన మెషిన్ సాఫ్ట్‌వేర్‌లను దక్కించుకున్నారు. వాటి ఆధారంగా ప్రత్యేక చిప్‌లను తయారు చేశారు. 
 
 - ఆ చిప్‌లతో పెట్రోల్ వినియోగదారుల జేబులకు ఎలా చిల్లు పెట్టి భారీగా ఎలా డబ్బు సంపాదించవచ్చో వివరించి బంకు యజమానులను ఈ కుంభకోణంలోకి లాగారు. చిప్‌కు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకొనేవారు. 
 
 - ఆ చిప్‌తో పాటు, దాని రిమోట్‌నూ బంకు నిర్వాహకులకు ఇచ్చేవారు. ఈ ‘రిమోట్’తోనే వాహనదారులకు కుచ్చుటోపి వేస్తున్నారు. 
 
 - బంకులోని పెట్రోల్ మెషిన్‌లో దాని అసలు చిప్‌తో పాటు ఈ నకిలీ చిప్ కూడా ఉంటుంది. ఒకవేళ అధికారులు తనిఖీకొస్తే రిమోట్‌తో నకిలీ చిప్‌ను ఆఫ్ చేస్తారు. దీంతో ‘మోసం’ గుట్టు కనిపెట్టడం దాదాపు అసాధ్యం. 
 
 - గత మూడేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడుగా కాకుండా కొనసాగుతోంది. మన రాష్ర్టంలో 75 పెట్రోల్ బంకుల్లో ఈ చిప్‌లు అమర్చారు. మరో 600 పెట్రోల్ బంకుల్లో అమర్చేందుకు నిందితులు రంగం సిద్ధం చేసుకున్నారు. 
 
 - ఈ వ్యవహారంలో రాజమండ్రి నెహ్రూనగర్‌కు చెందిన షేక్ ముస్తాఫా, విజయవాడకు చె ందిన పెట్రోల్ బంక్ మెకానిక్ షేక్ సకికేందర్, బోయిన్‌పల్లికి చెందిన సందీప్ కూడా పాలు పంచుకున్నారు.
 
 గుట్టు రట్టు ఇలా....
 విశ్వసనీయ సమాచారంతో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్‌వోటీ ఓఎస్‌డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, పుష్పన్‌కుమార్, అంజయ్య, బస్వారెడ్డి, ఎస్సైలు రమేష్, శివకుమార్, మహేశ్, నాగరాజు కూకట్‌పల్లిలోని అఫ్జల్ బారీ ఇంటిపై దాడి చేశారు. నిందితులు అఫ్జల్ బారీ, షేక్ ముస్తాఫా, షేక్ సకికేందర్, కల్యాణ్, శిబులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసం కేసులో మరో ముగ్గురు నిందితులు ఫైజల్ బారీ, సందీప్, వివేక్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐదు హార్డ్ డిస్క్‌లు, 600 చిప్‌లు, 100 రిమోట్‌లు, 100 రిసీవర్లు, నాలుగు ఎడాప్టర్లు, ఒక లగ్జరీకారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎస్.చంద్రకాంత్‌కు అప్పగించారు.
 
 బంకుల్లో చౌర్యం వెలుగులోకి...
 ఎస్‌వోటీ పోలీసులు శివార్లలోని 11 పెట్రోల్ బంకుల్లో బుధవారం రాత్రి  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటిలో పది బంకుల్లో పెట్రోల్‌ను చౌర్యం చేస్తున్న సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేట్‌బషీరాబాద్, నాగోల్, ఉప్పల్, తుక్కుకూడ, కూకట్‌పల్లి, మియాపూర్, ఆర్సీపురం, శంషాబాద్ లోని పెట్రోల్ బంకుల నుంచి చిప్ కార్డులతో పాటు రిమోట్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వాటిని తూనికలు, కొలతల శాఖ అధికారులను అప్పగించారు. ఆయా బంకులను సీజ్ చేసే అవకాశం ఉందని ఎస్‌వోటీ వర్గాలు తెలిపాయి. ఈ చోరీ సాఫ్ట్‌వేర్, చిప్‌లతో ఇతర రాష్ట్రాల్లోనూ పెట్రోల్ చౌర్యం జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
 
 రిమోట్ ఆపరేషన్...
 ముంబైలోని హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలో సర్వీస్ మెకానిక్, కేరళకు చెందిన శిబు కె.థామస్ ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించాడు. దాంతో తయారు చేసిన చిప్ 800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటర్‌గానే చూపిస్తుంది. ఇలాంటి సాఫ్ట్‌వేర్ విషయాల్లో పరిజ్ఞానం ఉన్న ముంబై వాసి వివేక్ ఇతనికి సహకరించాడు.
 
 సాధారణంగా ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు రూపొందించిన ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మెషిన్లతోనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారుల వాహనాల్లో పోస్తుంటారు. ఆ మెషిన్లలో ఆయా కంపెనీల సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన చిప్‌లనే అమరుస్తారు.  వాటితో పాటు ఈ నకిలీ చిప్‌లనూ పెడతారు. అధికారులు తనిఖీలకు వచ్చినపుడు రిమోట్ కంట్రోల్ సాయంతో చిప్‌ను ఆఫ్ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement