ఒడిషా, శ్రీకాకుళంలలో తుపాను విలయతాండవం
భువనేశ్వర్/ విశాఖపట్నం: ఒడిషాలో తుపాను విలయతాండవం చేస్తోంది. గోపాల్పూర్ వద్ద పై-లీన్ తుపాను తీరాన్ని తాకింది. అయితే వాతావరణ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోపాల్పూర్ వద్ద వీచే గాలులకు నిలవలేని పరిస్థితి ఏర్పడింది. బరంపూర్లో తీవ్రస్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఒడిషా తీరప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపిపోయింది. వందల గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. తీరప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. కనీవిని ఎరుగని రీతిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. పారాదీప్ నుంచి కళింగపట్నం వరకు ఈదురుగాలులు విపరీతంగా వీస్తున్నాయి.
ఆరు గంటల పాటు తుపాను తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అల్లాడుతోంది. ఈ జిల్లాలో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురుస్తోంది. చిన్నాపెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్దాయి. తుపాను ప్రభావం వల్ల ఒడిశా, ఉత్తరాంధ్రలలో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.