సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) తరహాలో ఇక పట్టణాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో వైద్యులు, సిబ్బంది సంఖ్యతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడనున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ మాదిరి కేంద్ర ప్రభుత్వం జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం పట్టణాల్లో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిని అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చడంతో పాటు, మరో మూడు మున్సిపాలిటీల్లో కొత్తగా అర్బన్ పీహెచ్‌సీలు నెలకొల్పుతారు. ప్రస్తుతం సంగారెడ్డి, సిద్దిపేట మున్సిపాలిటీల్లో రెండేసి చొప్పున మొత్తం నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి.
వీటిని అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చడంతో పాటు మెదక్, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కొత్తగా అర్బన్ పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తారు. అర్బన్ పీహెచ్‌సీల నిర్వహణకు 2013-14లో రాష్ట్రంలో రూ.210 కోట్లు బడ్జెట్ అవసరమవుతుందని ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు మొదటి ఆరు నెలల్లో రూ.6 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఒక్కో అర్బన్ పీహెచ్‌సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ట్రెయినీ అసిస్టెంటు, కంటింజెంట్ వర్కర్ ఒక్కరు చొప్పున ఉంటారు. 50 వేలకు పైబడి జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఐదుగురు ఎఎన్‌ఎంలు, ప్రతీ రెండు వేల మంది మురికివాడల జనాభాకు ఒకరు చొప్పున ఆశా వర్కర్ ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమైనందున త్వరలో రాష్ట్రంలోనూ యూపీహెచ్‌సీలు పనిచేయడం ప్రారంభిస్తాయని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అధికారులు వెల్లడించారు.
ఇక పట్టణాల్లోనూ పీహెచ్‌సీలు
Published Tue, Oct 22 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement