గుంటూరు సిటీ : వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా-అజెండా రైతాంగ సంక్షేమమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు.
అందుకే ఆయన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కమిటీ పలు దఫాలుగా రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన కారణంగానే అక్కడి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ఈ కారణంగానే పాలకులు కూడా దూకుడు తగ్గించారన్నారు. లేకుంటే అడిగే వారెవరూ లేక ఈ పాటికే ఆ ప్రాంత భూములన్నీ అప్పనంగా స్వాహా చేసేవారని ఆరోపించారు.
ప్రస్తుతం తమ పార్టీ ఆసరాతో, అందించిన భరోసాతో అక్కడి రైతులు రెండో పంట సాగుబాట పట్టే దిశగా పోరుబాట పట్టారన్నారు. ఆ పోరాటంలో తాము అగ్రభాగాన నిలబడి నాయకత్వం వహిస్తామని మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు..
తామిప్పటికీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని మర్రి రాజశేఖర్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. అయితే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేని వారు, రెండో పంట సాగు చేసుకుంటున్న వారి జోలికొస్తే మాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు ఇచ్చిన వారి భూములు చాలు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఇంకా దురాశకు పోతే చివరకు చంద్రబాబుకు దుఃఖమే మిగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జరీబు భూముల రైతుల నుంచి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనను దృష్టిలో ఉంచుకుని ఇక భూ సమీకరణకు స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు.రాజధాని ప్రాంతంలో రైతులు ప్రస్తుతం చేస్తున్నది ఆఖరి పోరాటంగా అభివర్ణించారు. తరతరాలుగా వస్తున్న తమ పంటభూములు పరులపాలు కాకుండా కాపాడుకునేందుకు, తమ జవజీవాలు, తమ పూర్వీకుల ఆనవాళ్లు ముడిపడి ఉన్న స్వగ్రామాలను సంరక్షించుకునేందుకు, అన్నింటినీ మించి తమ అస్తిత్వాన్ని నిలుపుకు నేందుకు వారు ప్రభుత్వం, దానికి కొమ్ముకాస్తున్న ఖాకీలు, అధికారులతో తలపడుతున్నారన్నారు. ఈ కీలకమైన క్షణాల్లో వారికి మరింత వెన్నుదన్నుగా నిలవడమే వైఎస్సార్ సీపీ ముందున్న ప్రస్తుత కర్తవ్యంగా ఆయన వివరించారు.
అందుకే తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ శుక్రవారం మరోమారు రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తుందని ఆయన ప్రకటించారు. మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి పర్యటన మొదలుపెడతారన్నారు. పెనుమాక, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు గ్రామాలతో పాటు తాడికొండ నియోజకవర్గంలోని తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, వెంకటపాలెం గ్రామాల్లో పర్యటిస్తారని మర్రి రాజశేఖర్ వెల్లడించారు.
జగన్ జెండా - అజెండా రైతు సంక్షేమమే
Published Fri, Feb 13 2015 3:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement