రాజకీయం కోసమే రాష్ట్ర విభజన
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోండి
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు
సాక్షి, హైదరాబాద్: అవసరం లేకపోయినా రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సి.జయపాల్‌రెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెజెండ్ల సుబ్బారావులు వీటిని దాఖలు చేశారు. వీటిలో ప్రధానమంత్రి, ఆయన ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే,ఆ శాఖ కార్యదర్శిని వ్యక్తిగతహోదాలో ప్రతివాదులుగా చేర్చారు.
కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, జీవోఎం ఏర్పాటును రద్దు చేయాలని జయపాల్‌రెడ్డి తన పిటిషన్‌లో కోరారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంట్‌లో చర్చించాలని, ఈమేరకు కేంద్రాన్ని ఆదేశించాలని సుబ్బారావు తన పిటిషన్‌లో కోరారు. కాగా రాష్ట్ర విభజనపై స్టే విధించాలని కోరుతూ, విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి డి.సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా, గార్ల మండలానికి చెందిన సర్పంచ్‌లు అంబటి అంబిక, మరో నలుగురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు సోమవారం మరోసారి విచారించారు. అనంతరం దీనిని ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.