సివిల్‌ ర్యాంకర్‌ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్‌ | PIL on civils 2016 3rd ranker gopalakrishna | Sakshi
Sakshi News home page

సివిల్‌ ర్యాంకర్‌ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్‌

Published Mon, Jun 26 2017 7:12 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

సివిల్‌ ర్యాంకర్‌ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్‌

సివిల్‌ ర్యాంకర్‌ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్‌

సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌-2016లో మూడో ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణింకి గోపాలకృష్ణకు చిక్కులు ఎదురయ్యాయి. ఆయన తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్‌ పొందాడని, దీనిపై విచారణ జరపాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. సివిల్‌ సర్వీసెస్‌-2016 యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించిన పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణకు మూడో ర్యాంక్‌ సాధించిన విషయం తెలిసిందే.

అయితే, అతడికి ఈ ర్యాంక్‌ను కేటాయించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధ్రువీకరణపత్రంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఉమ్మడి హైకోర్టులో సికింద్రాబాద్ ఈస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ పిల్‌ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర వ్యక్తిగత శిక్షణశాఖ కార్యదర్శి, యూపీఎస్‌సీ జాయింట్‌ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

పిల్‌లో ఆయన ఏం పేర్కొన్నారంటే.. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ -2016 తుది  ఫలితాలను యూపీఎస్‌సీ ఈ ఏడాది మే 31న ప్రకటించింది. ఇందులో గోపాలకృష్ణకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకునిచ్చిందని తెలిపారు. అయితే గోపాలకృష్ణకు ఎటువంటి అంగవైకల్యం లేకున్నా ఆ కోటా కింద తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని వివరించారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడిక్‌ విభాగంలో 45శాతం మేర అంగవైక్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించారన్నారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 కాగా గోపాలకృష్ణకు 91.34 మార్కులే సాధించాడని, వికలాంగ కోటా కింద అర్హత మార్కులు 75.34తో అతను మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు.

ఓబీసీ కేటగిరిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌కు అర్హత సాధించలేదని, వికలాంగుల కోటా కింద మాత్రమే అర్హత సాధించారని పేర్కొన్నారు. మెయిన్స్‌లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3గంటలు కాగా, వికలాంగ అభ్యర్థులకు 4 గంటలని, దీని ద్వారా కూడా గోపాలకృష్ణ లబ్ది పొందారన్నారు. వాస్తవానికి గోపాలకృష్ణకు పెద్ద వైకల్యమేదీ లేదని పిటిషనర్‌ వివరించారు. అతడు చెబుతున్న వైకల్యంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ గోపాలకృష్ణ అంగవైకల్యంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాక అతనికి ఐఏఎస్‌ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement