కొండవాగు మింగింది
జిల్లాకు చెందిన ఐదుగురి మృతి
మరొకరి గల్లంతు
మన్యంలో కొలువైన మంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లిన జిల్లావాసుల తీర్ధయాత్ర విషాదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయ గూడెం మండలం కామవరం గ్రామ సమీప అడవిలో గుబ్బల మంగమ్మ గుడి వద్ద కొండవాగు పొంగడంతో నగరానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. ఈ అనుకోని సంఘటనతో నగరంతోపాటు యనమలకుదురు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
బుట్టాయగూడెం/ఆగిరిపల్లి/మధురానగర్/పెనమలూరు : మన్యంలో కొలువై ఉన్న మంగమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుం టారు. ఎన్నడూలేని విధంగా ఆదివారం జరిగిన ఘోరాన్ని ఈ ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ నుంచి ఏనుగుల మంగమ్మ కుటుంబసభ్యులు 18 మంది ఐసర్ వ్యాన్‌లో వెళ్లగా, అందులో మంగమ్మ కోడలు ఏనుగుల కల్యాణి (కుంచనపల్లి-గుంటూర్లు), మనుమడు వేముల లోకేష్ (14) మృతిచెందారు. మంగమ్మ కుమార్తె వేముల ఉమాదేవి (34) గల్లంతైంది. ఆగిరిపల్లి నుంచి మూడు టాటా ఏస్ వాహనాల్లో బయలుదేరిన 27 మందిలో ఉప్పలపాటి దీపక్‌సాయి (15) ఈ ఘటనలో మృతిచెందాడు. యనమలకుదురు, నూజివీడు ప్రాంతాలకు చెందిన ఆకుల కళ్యాణి (38), మరీదు నరసమ్మ (62) కూడా ప్రాణాలు కోల్పోయారు.
చెక్‌డ్యాం విరిగిపోవడం వల్లే...
గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద చెక్‌డ్యాం విరిగిపోయిందని, దీంతో నీళ్లు ఒక్కసారిగా రావటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నందున అటవీ ప్రాంతం కావటంతో నీరు ఎక్కువగా నిల్వ ఉండి ఒక్కసారిగా పొంగి పొర్లి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా నీళ్లు కొద్దికొద్దిగా వస్తుంటాయని, ఇంత పెద్దగా వాగు ఎన్నడూ పొంగలేదని చెబుతున్నారు.
ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యాపారులు
గుబ్బల మంగమ్మ గుడి వద్ద ఉన్న వ్యాపారులు ప్రాణాలకు తెగించి గల్లంతైన వారిని రక్షించారు. వారు చొరవ చూపకపోతే మృతుల సంఖ్య మరింతగా ఉండేదని స్థానికులు అంటున్నారు. వాగులో కొట్టుకుపోతున్న విజయవాడకు చెందిన ఏనుగుల మాధవి (22)ని పట్టుకునేలోపే మృతిచెంది ఉందని వ్యాపారులు చెప్పారు. తల్లీకొడుకులు వేముల ఉమాదేవి, వేముల లోకేష్‌లు గల్లంతవగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వెతికారు. చివరకు లోకేష్ మృతదేహం గుబ్బల మంగమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. తల్లి ఉమాదేవి ఆచూకీ ఆదివారం సాయంత్రం వరకు దొరకలేదు. మృతి చెందిన ఏనుగుల మాధవి (22) ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చింది. గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకుని తిరిగి అత్తవారింటికి వెళ్లేందుకు ఇక్కడికి రాగా ఈ దారుణం జరిగింది. వాగులో పెద్దపెద్ద బండరాళ్లు ఉండటంతో మృతి చెందిన వారి తలకు బలమైన గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. దుర్ఘటన స్థలాన్ని ఐటీడీఏ పీవో ఆర్‌వీ సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం డీఎస్‌పీ జె.వెంకట్రావు, సీఐ శ్రీనివాస్ యాదవ్‌లు, ఏఎస్‌ఐ జయరావు సందర్శించారు. జరిగిన సంఘటనపై స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ మంగయ్య, రఫీ గాలింపు చర్యలు చేపట్టారు.
భక్తుల ఇబ్బందులు
గుబ్బల మంగమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుబ్బల మంగమ్మ ఆలయం దగ్గరకు వెళ్లకుండా ఫారెస్ట్ బేస్ క్యాంపు వద్ద, కామవరం, పందిరిమామిడిగూడెం గ్రామాల్లో వంటలు వండుకున్నారు. ఈ దుర్ఘటన విషయం ఉదయం ఎనిమిది గంటలకే రాష్ట్రం నలుమూలలకు వ్యాపించింది. ఘటనా స్థలిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు.
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎంతో దురదృష్టకరమని మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.