Pilgrimage
-
బెజవాడలో ‘లెజెండ్’
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) చరిత్రలోనే అతిపెద్ద విమానం సోమవారం రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. హజ్ యాత్రికుల కోసం స్పైస్ జెట్ సంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ340–300 విమానం ఇక్కడ దిగింది. తొలిసారి విమానాశ్రయానికి వచి్చన ఈ భారీ విమానానికి ఎయిర్పోర్ట్ అధికారులు వాటర్ కానన్ స్వాగతం పలికారు. సుమారు 324 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానం ఏకధాటిగా 14,400 కిలో మీటర్లు ప్రయాణం చేయగలదు. అతి పొడవైన ఈ విమానాన్ని చూసేందుకు ఎయిర్ పోర్ట్ సిబ్బందితో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తి కనబరిచారు. గతంలో 7,500 అడుగుల ఉన్న రన్‌వేను నాలుగేళ్ల కిందట 11 వేల అడుగులు (3,360 మీటర్లు) పెంచడంతో పాటు బలోపేతం చేశారు.ప్రస్తుతం ఈ రన్‌వేపై బోయింగ్ 747, 777, 787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి వైడ్‌బాడీ ఎయిర్‌క్రాప్ట్ దిగేందుకు అనువుగా ఉంది. విస్తరించిన రన్‌వేపై తొలిసారిగా అతిపెద్ద ఎయిర్‌బస్ ఎ340 విమానం దిగడం సంతోషంగా ఉందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందుతుందనడానికి ఇది నిదర్శనమన్నారు. అనంతరం ఈ విమానం 322 మంది హజ్ యాత్రికులతో సౌదీ అరేబియా దేశంలోని జెడ్డాకు బయలుదేరి వెళ్లింది. -
యాత్రలో ఇబ్బందులుంటాయ్ జాగ్రత్త..!
సాక్షి, న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రికులకు భారత విదేశాంగ శాఖ పలు కీలక సూచనలు చేసింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవచ్చని తెలిపింది. యాత్రికులు, టూర్ ఆపరేటర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిన ముందు జాగ్రత్తలను గురువారం వెల్లడించింది. సిమికోట్ ప్రాంతంలో భక్తులకు మౌలిక సదుపాయాలు తగిన స్థాయిలో లేవని పేర్కొంది. భోజన వసతి, వైద్య సదుపాయాలు సరిగా లేనందున యాత్ర ప్రారంభానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అవసరమైన మందులను వెంట తెచ్చుకుంటే యాత్రలో తలెత్తే ఇబ్బందులను అధిగమించొచ్చని తెలిపింది. హిల్సా, సిమికోట్ ప్రాంతాలకు చేరుకోవాలంటే విమానాలే రవాణా సాధనాలనీ, వాతావరణం ప్రతికూలంగా ఉంటే యాత్రికులు అక్కడే ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా, వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఇప్పటికే యాత్రలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం మెరుగవడంతో భద్రతా దళాలు ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను హెలికాప్టర్లు, విమానాలలో మరో మూడు రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని భద్రతా వర్గాలు తెలిపాయి. -
అశ్రు నయనాలతో అంతిమ యాత్ర
స్వస్థలాలకు చేరిన మృతదేహాలు తీర్థయాత్రల కోసం వెళ్లి తమిళనాడులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురి మృతదేహాలు ఆదివారం జిల్లాకు చేరుకున్నాయి. తమవారి మృతదేహాలను చూడగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కొల్లూరు : తీర్థయాత్రలో అసువులుబాసిన మృతుల అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య జరిగింది. తెనాలి పట్టణ, పరిసర గ్రామాలు, గుంటూరు నగరానికి చెందిన సుమారు 42 మంది ఈ నెల 13వ తేదీ కన్యాకుమారి వరకు తీర్థయాత్రకు వెళ్లడం, తిరునల్వేలి సమీపంలో ఆగి ఉన్న వీరి బస్సును వెనుక ఉంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మృతదేహాలు ఆదివారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నాయి. కొల్లూరు మండలంలోని అనంతవరం, ఈపూరు గ్రామాలకు చెందిన నాగవర్ధిని (43), కన్నెగంటి రామయ్య (63), దేశు వెంకటరామారావు (65) మృతదేహాలను తమిళనాడు నుంచి అధికారులు తీసుకొచ్చారు. అపశ్రుతితో జాప్యం మృతదేహాలు అంబులెన్స్‌ల్లో శనివారం రాత్రే బయలుదేరాయి. ఆదివారం మధ్యాహ్నానికే చేరుకోవాల్సి ఉంది. అయితే ఓ అంబులెన్స్ 30 కిలోమీటర్ల వచ్చిన తర్వాత తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడ్ని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు డ్రైవర్, అంబులెన్స్‌ను అదుపులోకి తీసుకొని మరో అంబులెన్స్‌ను సమకూర్చిపంపారు. దీంతో జాప్యం చోటుచేసుకుంది. ప్రత్యేక బస్సులో క్షతగాత్రులు, మిగిలిన యాత్ర బృంద సభ్యులను అధికారులు స్వస్థలాల్లో దిగబెట్టారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. పూర్తయిన సత్యం అంత్యక్రియలు తెనాలిరూరల్ : రోడ్డు ప్రమాద బాధితులు ఆదివారం సాయంత్రం తెనాలి చేరుకున్నారు. బాధితులను తీసుకువచ్చేందుకు, మృతదేహాలను తరలించేందుకు వెళ్లిన కొల్లూరు తహసీల్దార్, ఎస్ఐ ఈ బస్సులోనే బాధితులతో కలసి వచ్చారు. స్వల్ప గాయలతో క్షేమంగా తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులను చూసి బంధువులు ఉద్వేగానికి లోనయ్యారు. సన్నిహితులే ఆత్మబంధువులై.. ప్రమాదంలో మృతి చెందిన వంట మాస్టర్ సత్యం మృతదేహానికి తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ పైడి హజరత్తయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సత్యంకు సన్నిహితులైన మద్దాల జగన్నాథరావు, రమణమ్మ దంపతులు, సత్యం ఉండే ఇంటి యజమాని రాజారావు, మరికొందరు స్థానికులు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. 25 ఏళ్లుగా తెనాలిలో ఉంటున్న సత్యంతో తనకు 15 ఏళ్లుగా పరిచయం ఉందని, తన సంబంధీకుల గురించి ఎన్నిసార్లు అడిగినా, నాకు మీరున్నారు, ఏదన్నా జరిగితే మీరే అన్నీ చేయాలంటుండే వాడే మినహా ఏ వివరాలు చేప్పేవాడు కాదని జగన్నాథరావు గుర్తుచేసుకున్నారు. -
భారతీయ యాత్రాదర్శిని
సందర్శనీయం భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు ఈ పవిత్ర వేద భూమిలో అతి ముఖ్యమైన తీర్థయాత్రలు కైలాస మానస సరోవర యాత్ర, అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర, కాశీయాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలు ముఖ్యమైనవి. కైలాస మానస సరోవర యాత్ర పార్వతీపరమేశ్వరుల నివాసంగా భావించే కైలాస శిఖరం శివ భక్తులకు, హరి భక్తులకు, దేవీ భక్తులకు పరమ పవిత్రమైన పుణ్యస్థలం. ఆదిశంకరాచార్యులవారు కైలాసానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు నాలుగు శివలింగాలను అనుగ్రహించాడట. ఆదిశంకరాచార్యులవారు ఆ లింగాలను తూర్పు సముద్ర తీరం నందు గల పూరి క్షేత్రం నందు గోవర్ధన పీఠాన దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలోనూ, గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలో కాళికా మఠం, ఉత్తరాంచల్ రాష్ట్రం నందు బదరీనాథ్ క్షేత్రంలో జ్యోతిర్మఠం అనబడు నాలుగు మఠాలను స్థాపించి, వాని యందు శివలింగాలను ప్రతిష్ఠించారు. కైలాస పర్వతం ఒక్కో సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంటుంది. ఇది పరమేశ్వరుని లీలగా చెప్తారు. కైలాస పర్వతం నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రూబి, నీలం రంగులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెప్తుంది. భూమి మీద వున్న మంచినీటి సరస్సు - మానస సరోవరం. ఋషుల కోరికపై బ్రహ్మ తన మనస్సు (మానసము) నుండి సృష్టించినందు వలన దీనిని మానస సరోవరం అని అంటారు. ఈ సరోవరంలోని నీరు చతుర్వేద సార మని అంటారు. దేవతలు ఈ సరోవరంలో స్నానం చేయటానికి స్వర్గలోకం నుండి ప్రతి రాత్రి వేంచేస్తుంటారని, పండుగ రోజుల్లో.. పున్నమి రోజుల్లో తప్పక వస్తారని ప్రతీతి. ఇంత విశిష్టమైనటువంటి కైలాస మానస సరోవర యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రతి హిందువు పరితపిస్తూ ఉంటాడు. ఫోన్: 8106201230 అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ అంటే జరామరణాలు లేనివాడని అర్థం. ఈ అమర్నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు ‘శివలింగం’ ఉంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగటం, తరగటం జరుగుతుంది. జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ మంచులింగం పెద్దదిగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఒక వింతగా కొనియాడబడుతోంది. గణేశునికి, పార్వతీదేవికి ఇక్కడ రెండు మంచులింగాలు వున్నాయి. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. మీరు మాత్రం అలాగే శాశ్వతుడిగా ఉంటున్నారు. ఇది ఎలా సాధ్యం?’ అని అడిగింది. అందుకు ఈశ్వరుడు ‘ఇది పరమ రహస్యం. కనుక ప్రాణకోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి’’ అని ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతకి చివరకు ఈ అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడు. శివుడు ఈ గుహను ఎన్నుకోవటానికి ముందు తనతోపాటు వున్న వారందరినీ వదిలిపెట్టి వెళ్లాడు. హిమాలయాలకు వెళ్లే దారిలో ముందుగా వాహనమైన నందిని పహల్గామ్లో, చంద్రుని చందన్వారి వద్ద, సర్పాలను పిషాంగ్ సరోవర తీరాన గల శేష్నాగ్ వద్ద, కుమారుడైన గణేశున్ని మహాగుణ పర్వతం వద్ద, పంచభూతాలను పంచ్తర్ణి వద్ద వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్‌లోని అమరలింగం వున్న గుహ లోపలికి వెళ్లాడు. అక్కడ తన అమరత్వ రహస్యం, జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు. ఆ సమయంలో గుహలో రెండు గుడ్ల నుండి జన్మించిన పిల్ల పావురాళ్లు శివుడు పార్వతితో చెప్పిన అమరగాథను విన్నాయట. ఈ విషయం తెలుసుకొన్న శివుడు ‘‘జీవధర్మమైన జనన మరణాలు ఈ పావురాల జంటకు వుండదు. మనిద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలో వుండి దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యం ప్రసాదిద్దాం’’ అని తెలియజేశాడు. ఇప్పటికీ ఈ పావురాల జంట అజరామరమై ఈ గుహకు వచ్చి శివుని అర్చించినవారికి దర్శనమిస్తూ ముక్తిని ప్రసాదిస్తు న్నాయని చెబుతారు. మహాద్భుతమైన ఈ పుణ్యస్థలాన్ని దర్శించుకోవ టానికి ప్రతియేటా కొన్ని లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ మహా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం జూలై నెల 2 నుండి ప్రారంభం అవుతుంది. ఫోన్: 9100090295 చార్ధామ్ యాత్ర ఉత్తరాంచల్‌లోని ఘల్వాల్ ప్రాంతంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ప్రసిద్ధమైనవి. ఈ నాలుగింటిని కలిపి చార్ధామ్ అంటారు. వీటిని ఒకేసారి సందర్శించి రావటానికే చార్ధామ్ యాత్ర అని పేరు. యమునోత్రి: ఆదిశంకరుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం. సూర్యదేవుని సంతానంలో ఒకరు యముడు, మరొకరు యమున-సూర్యుని భార్య ఛాయాదేవి, ఒకరోజున ఛాయాదేవికి యమున మీద కోపం వచ్చి భూలోకంలో పడిపొమ్మని శపించిందట. అందువలన యమున భూలోకంలో నదిగా చేరింది. గంగోత్రి: గోముఖం నుండి గంగోత్రి వరకు ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుండి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి గంగోత్రి చేరేవరకూ ఈ పవిత్ర గంగాజలంలో మానవస్పర్శకూడా ఉండదు. అంత పవ్రితంగా ఉంటుంది. బద్రీనాథ్: బదరీ అనగా రేగుచెట్టు. రేగు చెట్టు, లక్ష్మీనివాసం. కనుక నారాయణుడు ఆ చెట్టు నీడలోనే తపమాచరించాడు. అందువల్లే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రం అని పేరు. ఇది నర నారాయణుల నివాస స్థలమవటం వల్ల నారాయణాశ్రమం అని కూడా పిలుస్తారు. నారదుడు ఈ క్షేత్రంలో అర్చకత్వం చేసినందువల్ల నారద క్షేత్రమని కూడా పేరు. శ్రీకృష్ణ నిర్యాణాంతరం పాండవులు తమ జీవితాలను చాలించదలచి స్వర్గారోహణ సమయంలో బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారట. స్వర్గారోహణ పర్వంలో వర్ణించిన ‘మానా’ పర్వతం బద్రీనాథ్‌కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదార్నాథ్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఆదిశంకరులచే 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ స్వామి ఆరు నెలలు మానవుల పూజలను, ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు. ఆలయం మూసివేయగానే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కేదార్‌కు 52 కి.మీ. దూరంలో ఉన్న ఉఖీమర్లో వున్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. సుమారు 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దీర్ఘ చతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. ఫోన్: 7032666924 కాశీ క్షేత్ర యాత్ర కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి శివుడికి కాశీ విశ్వేశ్వరుడని పేరు. విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుచేత, ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు. చరిత్రలో వివిధ కాలాలలో నిర్మించబడ్డ పెద్దపెద్ద ఆలయాలు వారణాసిలో ఉన్నాయి. సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీ నగరం నిర్మించబడిందని పురాణ వచనం. పరమేశ్వరునికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువలన ఈ వూరికి ‘ఆనందకావనం’ అనే పేరు కూడా ఉన్నది. ఇంకా ప్రతివీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. బ్రిటిష్ వారి పరిపాలనలో వారణాసి, బెనారస్‌గా మారంది. ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం ‘కాశీ’ జాతి వారు నివసించేవారు. అందువల్ల దీనికి ‘కాశి’ అనే పేరు స్థిరపడింది. ఫోన్: 7032666927 భారతీయ యాత్రా ప్రపంచంలో ఆర్ వి టూర్స్ అండ్ టావెల్స్ సనాతన సంస్కృతికి, ఆచారాలకు నిలయం అయిన భారతదేశంలోని పైన పేర్కొన్న కైలాస మానస సరోవరం, అమర్నాథ్, చార్ధామ్, కాశీ యాత్రలతోపాటు, భారతదేశం నలుమూలల అన్ని ఆధాత్మిక ప్రదేశాలకు యాత్రా ప్యాకేజీలు అందిస్తున్న సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంస్థ గడిచిన 14 సంవత్సరాలుగా ఎంతోమంది తెలుగువారి ఆహార అభిరుచులకు అనుగుణంగా అద్భుతమైన భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తోంది. సువిశాల భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా యాత్రికులను పంపిస్తూ తెలుగువారి ఆదరాభిమానాలు పొంది ఆత్మీయ ట్రావెల్‌గా పిలువబడుతున్న సంస్థ ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంవత్సరం కూడా పైన తెలిపిన అన్ని యాత్రా స్థలాలకు ప్రత్యేకమైన ప్యాకేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి వున్న వారు ఆర్వి ట్రావెల్స్‌ను సంప్రదించవచ్చు. -
కొండవాగు మింగింది
జిల్లాకు చెందిన ఐదుగురి మృతి మరొకరి గల్లంతు మన్యంలో కొలువైన మంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లిన జిల్లావాసుల తీర్ధయాత్ర విషాదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయ గూడెం మండలం కామవరం గ్రామ సమీప అడవిలో గుబ్బల మంగమ్మ గుడి వద్ద కొండవాగు పొంగడంతో నగరానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. ఈ అనుకోని సంఘటనతో నగరంతోపాటు యనమలకుదురు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బుట్టాయగూడెం/ఆగిరిపల్లి/మధురానగర్/పెనమలూరు : మన్యంలో కొలువై ఉన్న మంగమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుం టారు. ఎన్నడూలేని విధంగా ఆదివారం జరిగిన ఘోరాన్ని ఈ ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ నుంచి ఏనుగుల మంగమ్మ కుటుంబసభ్యులు 18 మంది ఐసర్ వ్యాన్‌లో వెళ్లగా, అందులో మంగమ్మ కోడలు ఏనుగుల కల్యాణి (కుంచనపల్లి-గుంటూర్లు), మనుమడు వేముల లోకేష్ (14) మృతిచెందారు. మంగమ్మ కుమార్తె వేముల ఉమాదేవి (34) గల్లంతైంది. ఆగిరిపల్లి నుంచి మూడు టాటా ఏస్ వాహనాల్లో బయలుదేరిన 27 మందిలో ఉప్పలపాటి దీపక్‌సాయి (15) ఈ ఘటనలో మృతిచెందాడు. యనమలకుదురు, నూజివీడు ప్రాంతాలకు చెందిన ఆకుల కళ్యాణి (38), మరీదు నరసమ్మ (62) కూడా ప్రాణాలు కోల్పోయారు. చెక్‌డ్యాం విరిగిపోవడం వల్లే... గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద చెక్‌డ్యాం విరిగిపోయిందని, దీంతో నీళ్లు ఒక్కసారిగా రావటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నందున అటవీ ప్రాంతం కావటంతో నీరు ఎక్కువగా నిల్వ ఉండి ఒక్కసారిగా పొంగి పొర్లి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా నీళ్లు కొద్దికొద్దిగా వస్తుంటాయని, ఇంత పెద్దగా వాగు ఎన్నడూ పొంగలేదని చెబుతున్నారు. ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యాపారులు గుబ్బల మంగమ్మ గుడి వద్ద ఉన్న వ్యాపారులు ప్రాణాలకు తెగించి గల్లంతైన వారిని రక్షించారు. వారు చొరవ చూపకపోతే మృతుల సంఖ్య మరింతగా ఉండేదని స్థానికులు అంటున్నారు. వాగులో కొట్టుకుపోతున్న విజయవాడకు చెందిన ఏనుగుల మాధవి (22)ని పట్టుకునేలోపే మృతిచెంది ఉందని వ్యాపారులు చెప్పారు. తల్లీకొడుకులు వేముల ఉమాదేవి, వేముల లోకేష్‌లు గల్లంతవగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వెతికారు. చివరకు లోకేష్ మృతదేహం గుబ్బల మంగమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. తల్లి ఉమాదేవి ఆచూకీ ఆదివారం సాయంత్రం వరకు దొరకలేదు. మృతి చెందిన ఏనుగుల మాధవి (22) ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చింది. గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకుని తిరిగి అత్తవారింటికి వెళ్లేందుకు ఇక్కడికి రాగా ఈ దారుణం జరిగింది. వాగులో పెద్దపెద్ద బండరాళ్లు ఉండటంతో మృతి చెందిన వారి తలకు బలమైన గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. దుర్ఘటన స్థలాన్ని ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు, సీఐ శ్రీనివాస్ యాదవ్‌లు, ఏఎస్ఐ జయరావు సందర్శించారు. జరిగిన సంఘటనపై స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ మంగయ్య, రఫీ గాలింపు చర్యలు చేపట్టారు. భక్తుల ఇబ్బందులు గుబ్బల మంగమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుబ్బల మంగమ్మ ఆలయం దగ్గరకు వెళ్లకుండా ఫారెస్ట్ బేస్ క్యాంపు వద్ద, కామవరం, పందిరిమామిడిగూడెం గ్రామాల్లో వంటలు వండుకున్నారు. ఈ దుర్ఘటన విషయం ఉదయం ఎనిమిది గంటలకే రాష్ట్రం నలుమూలలకు వ్యాపించింది. ఘటనా స్థలిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎంతో దురదృష్టకరమని మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ఈ మరణ మృదంగం ఇప్పడే కాదు.. ఎప్పటి నుంచో
భారతదేశంలో ప్రముఖ ఆలయాల సందర్శన, ఉత్సవాలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలంటేనే సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టుకొచ్చే పరిస్థితి వస్తోంది. ఇందులో పాల్గొన్న తాము సురక్షితంగా ఇంటికి వెళతామో లేదోనన్న ఆందోళన వెన్నంటే ఉంటుంది. తాజాగా ప్రారంభమైన మరో బ్రహ్మాండ ఆధ్యాత్మిక కార్యక్రమం గోదావరి పుష్కరాలు మిగిల్చిన విషాదం అదే భయాన్ని గుర్తు చేస్తోంది. అయితే, మనదేశంలో ఆలయాల సందర్శన కొత్తకాదు.. తొక్కిసలాట అంతకంటే కొత్త విషయమేమి కాదు. ఘటన జరిగినప్పుడు మాత్రం సామాన్యుల నుంచి మీడియా వరకు పిల్ల నేత నుంచి బడా నేతల వరకు ఆ అంశంపై చర్చాతిచర్చల్లో మునగినట్లు కనిపించడం మళ్లీ సాధారణ స్థితికి రావడం షరా మాములయ్యింది. అలాంటి ఘటన మరోసారి జరిగితే అయ్యో మళ్లీ జరిగిందే అనే మరోసారి అదే ముచ్చట. గత దశాబ్దకాలంలో ఆలయాల్లో తొక్కిసలాట జరిగి వెయ్యిమందికి పైగా చనిపోయారని అధికారుల వద్ద సమాచారం ఉందంటే సామాన్య జనాల ప్రాణాలు పాలకులకు ఎంత తేలికో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు దేశంలో ఆద్మాత్మిక కార్యక్రమాల్లో జరిగిన తొక్కిసలాటలు ఒక్కసారి పరిశీలిస్తే.. ► ఫిబ్రవరి 3, 1954: మహాకుంభమేళ విషాదం, 800 మంది మృతి, 100 మందికి గాయాలు ► ఆగస్టు 27, 2003: నాసిక్ గోదావరి కుంభమేళ, 40 మంది మృతి, 125 మందికి గాయలు ► 2004: కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొక్కిసలాట, ఐదుగురు దుర్మరణం ► జనవరి 26, 2005: మహారాష్ట్రలోని సతారాజిల్లాలోగల మందిర్ దేవీ ఆలయంలో తొక్కిసలాట 350 మంది మృతి, 200 మందికి గాయలు ► జూలై 12, 2008: పూరి జగన్నాథ్ యాత్ర 6 గురు మృతి, పలువురికి గాయాలు. ► ఆగస్టు 3, 2008: హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవీ ఆలయంలో తొక్కిసలాట 160 మంది మృతి 400 మందికి గాయాలు(కొండచరియలు పడుతున్నాయన్న తప్పుడు వార్తలతో తొక్కిసలాట చోటుచేసుకొంది) ► సెప్టెంబర్ 30, 2008: జోద్‌పూర్‌లోని చాముండా ఆలయంలో తొక్కిసలాట 120 మంది దుర్మరణం. పలువురికి గాయాలు ► మార్చి 4, 2010: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్ నవరాత్రి ఉత్సవంలో తొక్కిసలాట, 63 మంది మృతి. కృపాలు మహారాజ్ పేదలకు చీరలు పంచే కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ► జనవరి 14, 2011: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట. 106 మంది మృతి, 100 మందికి గాయాలు ► మార్చి 27, 2011: మధ్యప్రదేశ్‌లోని కరీలా గ్రామంలో తొక్కిసలాట.8 మందిమృతి, 10 మందికి గాయాలు ► నవంబర్ 8, 2011: హరిద్వార్‌లో తొక్కిసలాట, 22 మంది మృతి ► ఫిబ్రవరి 8, 2013: మహాకుంభ మేళా సమయంలో అలహాబాద్‌లో మౌని అమావాస్యనాడు ఫుట్ బ్రిడ్జి కూలి తొక్కిసలాట జరగగా 36 మంది దుర్మరణం ► అక్టోబర్ 13, 2013: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో రతన్ఘడ్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకొని చిన్నారులతో సహా 75 మంది మృతి, వందమందికి గాయాలు ► జూలై 14, 2015: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట. 27 మంది మృతి, పలువురికి గాయాలు. -
కన్నీటితుఫాన్
- మూగబోయిన మోసయ్యపేట - తీర్ధయాత్రలో మహా విషాదం - ధవళేశ్వరం ప్రమాదంలో 22మంది దుర్మరణం - మృతుల్లో 8మంది మహిళలు.. ఏడుగురు చిన్నారులు - ముగిసిన అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు పాపం.. నిద్రిస్తున్న గోదారికి తెలియదు.. ఊయలలూపాల్సిన తన అలలే ఊపిరి తీస్తాయని! చల్లని గాలి తెమ్మెరకు తెలియదు.. జోల పాడాల్సిన తన పాట మృత్యు గీతంగా మారుతుందని! పొంగిపొర్లే ఆనందానికీ, ఉప్పొంగిపోయే ఉల్లాసానికీ తెలియనే తెలీదు.. కాలువలు కట్టే కన్నీటికి తామే సాక్ష్యంగా మారాల్సి ఉంటుందని! ఏడుకొండల వెంకన్నకూ, బెజవాడ దుర్గమ్మకూ తెలియదు గాక తెలియదు.. తమ ఆశీస్సులు పొంది ఆనందంగా వెళ్తున్న కుటుంబాన్ని మృత్యువు ఇంత ఘోరంగా కబళిస్తుందని! ఎవరికి తెలిసినా ఇంత దారుణం... ఇంత ఘాతుకం... ఇంత హృదయ విదారక విషాదం జరిగేదే కాదు. తెల్లారేసరికి అప్పన్న సన్నిధికి చేరుకునే సంతోషంలో, తర్వాత కాసేపటికి సొంతూరికి వెళ్లే సంబరంలో గాఢ నిద్రలో ఉన్న వారందరి బతుకు అనూహ్యంగా ముగిసిపోయేదే కాదు. పసివాళ్లని కూడా చూడకుండా మృత్యువు ఇంత కర్కశంగా పరిమార్చేదే కాదు. ఇప్పుడెవరికి తెలిసినా ఏం లాభం? ఏ దేవుడి హృదయం ద్రవించినా ఏం ప్రయోజనం? ఎంతో మందిని సంతోషంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన వ్యక్తి తన కుటుంబాన్ని చివరి యాత్రకు తరలించాల్సి వస్తే.. ఏళ్ల తరబడి విశ్వాసంగా సేవ చేసిన వాహనం చివరికి తన యజమానినీ, అతని సమస్త కుటుంబాన్నీ నీటి పాలు చేయాల్సి వస్తే.. విధి లీల ఎంత చిత్రమో అర్ధమై కూడా ఏం ఉపయోగం! అందుకే కాబోలు.. ఇంత ఘాతుకాన్నీ కళ్లారా చూసి కూడా ధవళేశ్వరం వద్ద గోదావరి గుండెల్లో కన్నీటి సుళ్లు తిరుగుతున్నా... తన మానాన తాను ముందుకు పోతోంది. పాపం.. ఇక్కడ.. ఈ మోసయ్యపేటలో మాత్రం.. పచ్చగా తమ కళ్లెదుటే బతికిన డ్రైవర్ అప్పారావు కుటుంబం ఇంత అర్ధంతరంగా కనుమరుగైపోయినందుకు ఊరంతా పొగిలిపొగిలి ఏడుస్తోంది. ఇదేం లీల దేవుడా? అని గుండెలు బాదుకుని రోదిస్తోంది. తీర్థయాత్రలకని ఆడుతూ పాడుతూ బయల్దేరిన 22 మంది జలసమాధి అయిన పీడకలలాటి వాస్తవాన్ని తలచుకు కుమిలిపోతోంది. ఇహలోక యాత్ర ఇలా ముగిసిన వారికి శనివారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పరిసర గ్రామాల ప్రజానీకమంతా పాల్గొని శ్రద్ధాంజలి ఘటించింది. ఇక సెలవంటూ నిట్టూర్చింది. -
హాలీసిక్కా.. తికమక
అప్పటికీ బాగా గుర్తు... అది 1946 డిసెంబర్. మా రాజమండ్రి నుంచి మొట్టమొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాం. తీర్థయాత్రల కోసం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగగానే మా కుటుంబానికి ఓ వింత అనుభవం. పోలీసులు చుట్టుముట్టారు. బ్యాగులు సోదా చేశారు. ఎందుకో... కాసేపటికి కానీ అర్థం కాలేదు... నిజాం రాజ్యానికి వచ్చినందుకే ఈ తనిఖీలని. ఇక మా వద్ద ఉన్న రూపాయాలను ‘హాలీసిక్కా’లోకి మార్చుకోవాల్సి వచ్చింది. హాలీసిక్కా అంటే నిజాం కరెన్సీ! స్టేషన్ దగ్గర్లోనే కరెన్సీ మార్చుకొని నగర పర్యటనకు బయలుదేరాం. రూపాయిలైతే మారాయి. కానీ, నిజాం కరెన్సీకి... మా రూపాయలకు లెక్క కుదిరేది కాదు. ఎక్కడికెళ్లినా గందరగోళం. ఎన్ని రూపాయలకు ఎన్ని హాలీసిక్కాలు అనేది పెద్ద తికమక. అప్పటికైతే ఎలాగోలా తీర్థయాత్ర అయిపోయింది. కొద్ది రోజుల తరువాత పై చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చా. అయినా... అదే తికమక. కొంతకాలం కరెన్సీ లెక్కలతో కుస్తీ పట్టాల్సి వచ్చింది. కొద్ది రోజుల తరువాత స్వాతంత్య్రం రావడం... పోలీసు చర్య... హైదరాబాద్ భారత్‌లో కలిసిపోవడంతో నా సమస్య పరిష్కారమైంది. మేడలో ప్రయాణం చేస్తున్నట్లు... నాడు నగరంలో మరో వింత... డబుల్ డెక్కర్ బస్సు. ఆ బస్సు పైఅంతస్తు ఎక్కితే... మేడలో కూర్చొని వెళుతున్నట్లనిపించేది. సికింద్రా బాద్‌కు వస్తే.. తప్పనిసరిగా డబుల్ డెక్కర్ ఎక్కాల్సిందే. ‘కింది బస్సు సరే... పైన ఉన్న బస్సు ఇంజన్ లేకుండా ఎలా ముందుకెళుతుంది’ అని మా బంధువులు అమాయకంగా అడిగినప్పుడు నవ్వాగేది కాదు. సాయంకాలం వేళ హుస్సేన్‌సాగర్ పైనుంచి డబుల్‌డెక్కర్‌లో వెళ్తుంటే అలలపై నుంచి వచ్చే చల్లటి గాలులు ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చేవి. అప్పుడు జట్కాల మీద ప్రయాణం మధురస్మృతిని మిగిల్చేది. ఇప్పుడు అలాంటి జ్ఞాపకాలు ఎక్కడున్నాయి..! ఛీటేవాలే మౌస్ మధురం... నగరంలో ఛీటేవాలే మౌస్ (నల్ల చుక్కలున్న అరటిపండ్లు) బాగా దొరికేవి. ఇక్కడకు వచ్చినప్పుడల్లా మా నాన్న వాటిని తినకుండా వెళ్లేవాడు కాదు. 1953, 54, 55 సంవత్సరాల్లో భద్రతపై ఎలాంటి ఆందోళన ఉండేది కాదు. నారాయణగూడ, హిమాయత్‌నగర్ మధ్యలో ఓ ఇంట్లో మేం అద్దెకుండేవాళ్లం. ఎండాకాలంలో ఇంటి బయటే మంచాలు వేసుకొని, తలగడ కింద ఇంటి తాళంచెవులు పెట్టుకొని హాయిగా పడుకునేవాళ్లం. దొంగతనాలు జరిగేవి కావు. ఇప్పుడు... పడుకున్నా లోపలికి దొంగలు చొరబడి దోచుకుపోయిన సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. వాంకె శ్రీనివాస్ -
శనివారం స్పెషల్: దోసకాయల గణేశుడిని చూసొద్దామా!
దోసకాయలు మహా మోసకాయలు. అవి గణేశుడిని మోసం చేశాయి. కుమార స్వామిని మోసం చేశాయి. ఆఖరికి పార్వతి అమ్మవారిని కూడా మోసం చేశాయి. ఈ ముగ్గురిని దోస తోటల్లోనే ఉంచేసుకున్నాయి. గుడిలేదు. గోపురం లేదు. ఆరుబయటే ఉండేలా చేశాయి. దోసకాయల కోసం దేవుళ్లే దిగొచ్చేలా చేశాయి. ఆకాశమే గోపురంగా, చెట్లు పుట్టలే స్తంభాలుగా, పొలం నేలే గర్భగృహంగా, గోపాలకులే లోకపాలకుని ప్రతిష్ఠాతలుగా గణేశుడు కొలువుతీరేలా చేశాయి. ఆ గణేశుడి పేరే దోసకాయల గణేశుడు! దక్షిణ కనరా జిల్లా సౌతడ్కా గ్రామంలో నేత్రావతి నది ఒడ్డున దోసపంట మధ్యన కొలువై ఉన్నాడు దోసకాయల గణేశుడు. ఈ గణేశుడు మంజునాథుడు కొలువై ఉన్న ధర్మస్థళ నుంచి కేవలం 15 కిమీ దూరంలో ఉన్నాడు. కుక్కె సుబ్రమణ్యస్వామి మందిరం ఇక్కడినుంచి 40 కిమీ దూరం. మంగుళూరు 80 కిమీ దూరం. సౌతె అంటే కన్నడభాషలో దోసకాయ అని అర్థం. అడ్కె అంటే దొరికే చోటు. కాబట్టి సౌతడ్కా అంటే మన తెలుగువాళ్ల దోసపాడు లాంటి పేరన్న మాట! ఇంతకీ ఈ గణేశుడికీ, దోసకాయలకీ ఏమిటి సంబంధం? ఒకసారి కైలాసం నుంచి గణేశుడు విహరిస్తూ విహరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడట! ఆయన్ను చూసిన గొల్ల పిల్లలు ఆయనకు దోసకాయలు నైవేద్యంగా పెట్టారట. ఆ దోసకాయలు గణేశుడికి ఎంత నచ్చాయంటే ఆయన అక్కడే పొలాల్లో బాసింపట్టు వేసుక్కూచున్నాడట. ఆయన్ని వెతుక్కుంటూ కుమార స్వామి వచ్చాడట. ఆయన కూడా ఓ దోసకాయ తిన్నాడట. అంతే దోసకాయలు తింటూ అక్కడే ఉండిపోయాడట. బిడ్డలిద్దరూ ఎంత సేపటికీ రావడం లేదేమిటని వెతుక్కుంటూ తల్లి పార్వతి వచ్చిందట. ఆమె కూడా ఆ టేస్టుకి దాసోహం సారీ ....దోసోహం అయిపోయారట. అక్కడే బిడ్డలిద్దరితో పాటూ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారట. ఏ వరాలివ్వడంలో బిజీగా ఉన్నాడో తెలియదు కానీ శివయ్య మాత్రం రాలేదట. అయినా ఆయనని లింగాకారంలో ప్రతిష్ఠించి, కుకుంబర్ కైలాసం ఏర్పాటు చేసుకున్నారట. అలా ఇప్పటికీ సౌతడ్కాలో దోసకాయలే శివుడి కుటుంబానికి ప్రసాదం. ఆయన భక్తులు తట్టలకొద్దీ దోసకాయల్ని నైవేద్యంగా ఇచ్చుకుంటారు. సౌతడ్కా దోసకాయలు టేస్టులో బెస్టని ఇప్పటికీ ప్రతీతి. వినాయకుడిని, ఆయన ఫ్యామిలీని కట్టిపారేసిన ఆ దోసకాయల్ని ఓ సారి టేస్టు చేసొద్దాం వస్తారా మరి? -
దైవం మానవ రూపంలో...
మార్చి 3, సోమవారం శ్రీరామకృష్ణ పరమహంస జయంతి) స్వామి వివేకానంద లాంటి ఎందరినో తన ఉపదేశాలతో మహామహులుగా తీర్చిదిద్ది మానవాళికి అందించారు రామకృష్ణ పరమహంస. భక్తి, దైవం లాంటి ఎన్నో అంశాల గురించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా శతాబ్దిన్నర క్రితం ఆయన చెప్పిన మాటలు ఇవాళ్టికీ స్మరణీయాలు, ఆచరణీయాలు. వాటిలో కొన్ని... ఉన్నాడు... అతడున్నాడు... అసలు దేవుడనేవాడున్నాడా? ఉంటే మనం చూడలేకపోతున్నామేం? అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే. మామూలు చూపుతో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన లేడని చెప్పవచ్చా? దీనికో చిన్న ఉదాహరణ. రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ, పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన అసలు అవి లేవని భావమా? అజ్ఞానంతో, సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే లేదనీ అంటే శుద్ధ తప్పు. పిలిస్తే పలుకుతాడు: ఏకకాలంలో అటు సగుణుడూ, ఇటు నిర్గుణుడూ, అటు నానారూపధారి, ఇటు ఏ విధమైన రంగూ రూపం లేనివాడూ భగవంతుడు. ఏ మతమైతే ఏమిటి? ఏ మార్గమైతే ఏమిటి? అందరూ ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. కాబట్టి, ఏ మతాన్నీ, మార్గాన్నీ ద్వేషించకూడదు. కించపరచకూడదు. కులం, మతం ఏదైనా సరే, ఎవరైనా, ఎలాగైనా ఆ దేవదేవుణ్ణి పిలవచ్చు. మనస్ఫూర్తిగా, హృదయాంతరాళంలో నుంచి పిలిస్తే చాలు... ఆయన నిశ్చయంగా పలుకుతాడు. దర్శనమిస్తాడు. మరి, అలాంటప్పుడు తీర్థయాత్రలు చేయడం, మెడలో మాలలు ధరించడం మొదలైన ఆచారాలన్నీ ఎందుకని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో అవన్నీ అవసరం. అయితే, జిజ్ఞాసువులు క్రమంగా బాహ్యాడంబరాలన్నిటినీ దాటుకొని వస్తారు. అప్పుడిక కేవలం భగవన్నామ జపం, స్మరణ, చింతనే మిగులుతాయి. అందరూ ఆయనే ... వయస్సు ఎంత మీద పడ్డా, కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద మమకారం, ఈ బంధాల పట్ల వ్యామోహం పోనివారు ఎంతోమంది ఉంటారు. తీర్థయాత్రకు వెళ్ళినా వారి ధ్యాస అంతా ఇంట్లో ఉన్న పిల్లల మీదే. అలాంటివాళ్ళు తమ బిడ్డలు, మనుమలు, మనుమరాళ్ళనే సాక్షాత్తూ దైవస్వరూపులని భావించడం మొదలుపెట్టాలి. అప్పుడు మనుమరాలి మీద ప్రేమ అంతా ఆ దేవి మీద భక్తిగా మారుతుంది. పిల్లను ఆడిస్తున్నా, అన్నం పెడుతున్నా, చివరకు నుదుట బొట్టు పెడుతున్నా అంతా ఆ అమ్మవారికే చేస్తున్నానని ఊహించుకోవాలి. దాని వల్ల ఇంట్లోనే ఉన్నప్పటికీ, దైవ సాన్నిధ్యంలో ఉన్న భావన, లాభం కలుగుతాయి. అందుకే, తల్లి, తండ్రి, బిడ్డ, స్నేహితులు - ఇలా ఎవరినీ ప్రేమించినా సరే, ఆ వ్యక్తి సాక్షాత్ భగవత్ స్వరూపమేననీ, దేవుడి అవతారమేననీ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంతో సులభమైన ఈ మార్గం మన మనస్సునూ, జీవితాన్నీ మాలిన్య రహితం చేసుకొనేందుకు ఉపకరిస్తుంది. - డా॥రెంటాల జయదేవ -
టూరిస్టు బస్సు బోల్తా
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 28 మందికి గాయాలు 8 మంది పరిస్థితి విషమం నందిగామ/ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యా యి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లోని కాకాగూడ ప్రాంతాలకు చెందిన 48 మంది ప్రయాణికులు మోహిని ట్రావెల్స్ బస్సులో ఫిబ్రవరి 9న తీర్థయాత్రలకు బయల్దేరారు. మేడారం జాతర, భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండ గా... మునగచర్ల సమీపంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో వెనుక టైర్లు బస్సు నుంచి వేరయ్యాయి. అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో చేకూరి శోభారాణి, జి.అంజమ్మ, గుండెపల్లి విమల, ఎ.స్వరూపరాణి, జి.సత్యనారాయణ, ఎం.సరిత, ఎం.లక్ష్మి, ఎస్.అఖిల, లింగాల మంగ, సుస్మిత, జి.జమ్ధీర్, ఆర్.ఉమాకారత్, వై.సహస్ర, పి.తుసీక్, ఎం.పద్మ, ఎల్.మంగ, ఎన్.లక్ష్మి, ఎం.ఆశ, ఎస్.లావణ్య, జి.స్వరూప, పి.రామకృష్ణ, పి.కొండమ్మ, ఎం.ఆనంద్‌గౌడ్, నవీన్‌గౌడ్ ఆర్.కళావతి, ఎల్.సునీల్ కుమా ర్, జె.దుర్గమ్మ, పి.ఇందిర, ఎల్.విక్రమ్గౌడ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు నందిగామ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని పలు ఆసుపత్రులకు తరలించారు. మిగతా ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల్లో సికింద్రాబాద్‌కు పంపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. వేరే ప్రమాదంలో.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీవీ సీరియల్ బృందం కారు ఆదివారం ఇబ్రహీంపట్నం రింగురోడ్డు సెంటర్లో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. -
‘అతిథి’ కష్టాలు
బాసర, న్యూస్‌లైన్ : దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం. అమ్మవారి దర్శనానికి నిత్యం మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా పలు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇందులో సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా ఉంటారు. భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అతిథి గృహాలు అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 2004లో దత్తపీఠం, మైసూరు, శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్ని హంగులతో 100 గదుల అతిథి గృహాన్ని నిర్మించి ప్రారంభించారు. ఐదేళ్ల నుంచి ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మెరుగైన వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. బాసరలో వివిధ ఆలయాల అతిథి గృహాలు ఉన్నాయి. వీటిని రూ.300 నుంచి రూ.1,500 వరకు అద్దెకు ఇస్తున్నారు. వీటి ద్వారా ఆలయానికి ఏటా రూ.30 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతోంది. అయినా అధికారులు మాత్రం వసతులు కల్పించడంలో విఫలం అవుతున్నారు. సిబ్బంది ఇష్టారాజ్యం.. సాధారణ భక్తులకు అవస్థలు.. బాసరలో ఏసీ రాజన్న నిలయం, సోమ(బాబ్లీ), ద్వారక తిరుమల, వేములవాడ, విజయవాడ కనుకదుర్గ, యాదగిరి గుట్ట, శ్రీశైలం, టీటీృడీ వెంకటేశ్వర అతిథి గృహాలతోపాటు ఏసీ, నాన్ ఏసీ, మంచం గదులు ఉన్నాయి. కాగా, శ్రీ వెంకటేశ్వర అథితి గృహాంలో సేవలు అందించే సిబ్బంది తమ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, 10 మంది ఎన్‌ఎంఆర్‌లు, రాత్రి ఇద్దరు, పగలు 8 మంది, ఏసీ రూమ్‌లలో నలుగురు విధులు నిర్వహిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా భక్తులు వినియోగించుకోవాల్సిన గదులను సిబ్బంది, హోంగార్డులు వినియోగిస్తున్నారు. దీంతో శుభదినాలలో అమ్మవారి మూలనక్షత్రం, దసరా నవరాత్రులు, మహాశివ రాత్రి, వ్యాస పౌర్ణమి పండుగ సందర్భాలలో అమ్మవారి దర్శనానికి భక్తులు వచ్చినప్పుడు గదులు దొరకక, ప్రైవేటు లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా దేవుడు ముందర భక్తులు అందరు సమానులే అంటారే తప్పా, ఆచరణలో అధికారులు కనికరించడం లేదు. అతిథి గృహాలకు వచ్చే వీఐపీ, సాధారణ భక్తుల కోసం ఏసీ, నాన్ ఏసీ గదులు ఉన్నా సాధారణ భక్తులు తమకు గది కావాలన్నా అధికారులు గదులు ఖాళీ లేవని కౌంటర్ బోర్డులు పెట్టేస్తారు. అదే వీఐపీ వస్తున్నారంటే ముందే ఫోన్ ద్వారా సమాచారం తీసుకోని ఏసీ బుక్ చేస్తారు. ఇదేమని సాధారణ భక్తులు ప్రశ్నిస్తే మాకు తెలియదు. గది కావాలంటే ప్రైవేటు లాడ్జిలను ఆశ్రయించాలని ఉచిత సలహాలిస్తుంటారు. మరమ్మతుకు నోచుకోని కిటికీలు, ముఖద్వారాలు భక్తులు వినియోగించుకోనే అతిథి గృహ గదులకు కిటికీలు, తలుపులు లేకపోవడంతో కిటికీలకు అట్ట ముక్కలు అడ్డుగా పెట్టారు. చలితో భక్తులు వణికిపోతున్నారు. కొన్ని అతిథి గృహాలలో మంచాలు విరిగాయి. వాష్బెషిన్లు, పైప్‌లైన్ లీకేజీలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. గోడపై పిచ్చి రాతలు అలానే ఉంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు చూసి చెరిపేయాల్సిన అవసరం ఉంది. ఏసీ గదులలో సోఫాసేట్తోపాటు కోన్ని ఏసీలు పనిచేయడం లేదు. భక్తుల నుంచి మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏటా మరమ్మతుల పేరిట రూ.లక్షల ఖర్చు చూపిస్తున్న అధికారులు వసతులు కల్పించడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా భక్తులు అవస్థలు పడుతూనే ఉన్నారు. వీటికి తోడు పరిశుభ్రత కూడా సరిగ్గా ఉండ టం లేదు. ఆవరణల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. అతిథి గృహాల చుట్టూ వ్యర్థపదార్థాలు, పలిగిన సీసా ముక్కలు, చెత్తా చెదారం తొలగించకపోవడంతో ఆ ప్రాంతంలో దోమలతోపాటు, దుర్గందం వెదజల్లుతోంది. అథితి గృహాల చుట్టూ తేనె తుట్టేలు పెట్టాయి. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ ఆలయ ఈవో ముత్యాలరావుకు వివరణ కోరగా అతిథి గృహాల్లో సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. -
1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం
ఉత్తరాఖండ్‌లో జూన్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల తాకిడికి మరుభూమిగా మారిన ప్రసిద్ధ కేదార్నాథ్ పుణ్యక్షేత్రం పునరుద్దరణ పనులు పూర్తికావస్తున్నాయి. వచ్చే నెల 1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గురువారం చెప్పారు. కాగా ఈ ప్రాంతంలో రహదారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తొలుత పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నట్టు బహుగుణ తెలిపారు. వరదలకు ధ్వంసమైన రోడ్లు ఇంకా పునర్నిర్మాణ దశలో ఉన్నాయి. వరదల తాకిడికి కేదార్‌నాథ్‌తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే.