మానస సరోవరం (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రికులకు భారత విదేశాంగ శాఖ పలు కీలక సూచనలు చేసింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవచ్చని తెలిపింది. యాత్రికులు, టూర్ ఆపరేటర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిన ముందు జాగ్రత్తలను గురువారం వెల్లడించింది. సిమికోట్ ప్రాంతంలో భక్తులకు మౌలిక సదుపాయాలు తగిన స్థాయిలో లేవని పేర్కొంది. భోజన వసతి, వైద్య సదుపాయాలు సరిగా లేనందున యాత్ర ప్రారంభానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అవసరమైన మందులను వెంట తెచ్చుకుంటే యాత్రలో తలెత్తే ఇబ్బందులను అధిగమించొచ్చని తెలిపింది.
హిల్సా, సిమికోట్ ప్రాంతాలకు చేరుకోవాలంటే విమానాలే రవాణా సాధనాలనీ, వాతావరణం ప్రతికూలంగా ఉంటే యాత్రికులు అక్కడే ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా, వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఇప్పటికే యాత్రలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం మెరుగవడంతో భద్రతా దళాలు ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను హెలికాప్టర్లు, విమానాలలో మరో మూడు రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని భద్రతా వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment