ఎయిర్‌పోర్టు చరిత్రలోనే అతిపెద్ద విమానంగా గుర్తింపు
324 మంది ప్రయాణికుల సామర్థ్యం
ఏకధాటిగా 14,400 కిలో మీటర్ల ప్రయాణం
322 మంది హజ్ యాత్రికులతో సౌదీ అరేబియాకు పయనం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) చరిత్రలోనే అతిపెద్ద విమానం సోమవారం రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. హజ్ యాత్రికుల కోసం స్పైస్ జెట్ సంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ340–300 విమానం ఇక్కడ దిగింది. తొలిసారి విమానాశ్రయానికి వచి్చన ఈ భారీ విమానానికి ఎయిర్‌పోర్ట్ అధికారులు వాటర్ కానన్ స్వాగతం పలికారు. సుమారు 324 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానం ఏకధాటిగా 14,400 కిలో మీటర్లు ప్రయాణం చేయగలదు. అతి పొడవైన ఈ విమానాన్ని చూసేందుకు ఎయిర్ పోర్ట్ సిబ్బందితో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తి కనబరిచారు. గతంలో 7,500 అడుగుల ఉన్న రన్‌వేను నాలుగేళ్ల కిందట 11 వేల అడుగులు (3,360 మీటర్లు) పెంచడంతో పాటు బలోపేతం చేశారు.
ప్రస్తుతం ఈ రన్‌వేపై బోయింగ్ 747, 777, 787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి వైడ్‌బాడీ ఎయిర్‌క్రాప్ట్ దిగేందుకు అనువుగా ఉంది. విస్తరించిన రన్‌వేపై తొలిసారిగా అతిపెద్ద ఎయిర్‌బస్ ఎ340 విమానం దిగడం సంతోషంగా ఉందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చెందుతుందనడానికి ఇది నిదర్శనమన్నారు. అనంతరం ఈ విమానం 322 మంది హజ్ యాత్రికులతో సౌదీ అరేబియా దేశంలోని జెడ్డాకు బయలుదేరి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment