ఈ మరణ మృదంగం ఇప్పడే కాదు.. ఎప్పటి నుంచో
భారతదేశంలో ప్రముఖ ఆలయాల సందర్శన, ఉత్సవాలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలంటేనే సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టుకొచ్చే పరిస్థితి వస్తోంది. ఇందులో పాల్గొన్న తాము సురక్షితంగా ఇంటికి వెళతామో లేదోనన్న ఆందోళన వెన్నంటే ఉంటుంది. తాజాగా ప్రారంభమైన మరో బ్రహ్మాండ ఆధ్యాత్మిక కార్యక్రమం గోదావరి పుష్కరాలు మిగిల్చిన విషాదం అదే భయాన్ని గుర్తు చేస్తోంది. అయితే, మనదేశంలో ఆలయాల సందర్శన కొత్తకాదు.. తొక్కిసలాట అంతకంటే కొత్త విషయమేమి కాదు.
ఘటన జరిగినప్పుడు మాత్రం సామాన్యుల నుంచి మీడియా వరకు పిల్ల నేత నుంచి బడా నేతల వరకు ఆ అంశంపై చర్చాతిచర్చల్లో మునగినట్లు కనిపించడం మళ్లీ సాధారణ స్థితికి రావడం షరా మాములయ్యింది. అలాంటి ఘటన మరోసారి జరిగితే అయ్యో మళ్లీ జరిగిందే అనే మరోసారి అదే ముచ్చట. గత దశాబ్దకాలంలో ఆలయాల్లో తొక్కిసలాట జరిగి వెయ్యిమందికి పైగా చనిపోయారని అధికారుల వద్ద సమాచారం ఉందంటే సామాన్య జనాల ప్రాణాలు పాలకులకు ఎంత తేలికో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు దేశంలో ఆద్మాత్మిక కార్యక్రమాల్లో జరిగిన తొక్కిసలాటలు ఒక్కసారి పరిశీలిస్తే..
► ఫిబ్రవరి 3, 1954: మహాకుంభమేళ విషాదం, 800 మంది మృతి, 100 మందికి గాయాలు
► ఆగస్టు 27, 2003: నాసిక్ గోదావరి కుంభమేళ, 40 మంది మృతి, 125 మందికి గాయలు
► 2004: కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొక్కిసలాట, ఐదుగురు దుర్మరణం
► జనవరి 26, 2005: మహారాష్ట్రలోని సతారాజిల్లాలోగల మందిర్ దేవీ ఆలయంలో తొక్కిసలాట 350 మంది మృతి, 200 మందికి గాయలు
► జూలై 12, 2008: పూరి జగన్నాథ్ యాత్ర 6 గురు మృతి, పలువురికి గాయాలు.
► ఆగస్టు 3, 2008: హిమాచల్ ప్రదేశ్లోని నైనా దేవీ ఆలయంలో తొక్కిసలాట 160 మంది మృతి 400 మందికి గాయాలు(కొండచరియలు పడుతున్నాయన్న తప్పుడు వార్తలతో తొక్కిసలాట చోటుచేసుకొంది)
► సెప్టెంబర్ 30, 2008: జోద్పూర్లోని చాముండా ఆలయంలో తొక్కిసలాట 120 మంది దుర్మరణం. పలువురికి గాయాలు
► మార్చి 4, 2010: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘడ్ నవరాత్రి ఉత్సవంలో తొక్కిసలాట, 63 మంది మృతి. కృపాలు మహారాజ్ పేదలకు చీరలు పంచే కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
► జనవరి 14, 2011: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట. 106 మంది మృతి, 100 మందికి గాయాలు
► మార్చి 27, 2011: మధ్యప్రదేశ్లోని కరీలా గ్రామంలో తొక్కిసలాట.8 మందిమృతి, 10 మందికి గాయాలు
► నవంబర్ 8, 2011: హరిద్వార్లో తొక్కిసలాట, 22 మంది మృతి
► ఫిబ్రవరి 8, 2013: మహాకుంభ మేళా సమయంలో అలహాబాద్లో మౌని అమావాస్యనాడు ఫుట్ బ్రిడ్జి కూలి తొక్కిసలాట జరగగా 36 మంది దుర్మరణం
► అక్టోబర్ 13, 2013: మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లాలో రతన్ఘడ్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకొని చిన్నారులతో సహా 75 మంది మృతి, వందమందికి గాయాలు
► జూలై 14, 2015: ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట. 27 మంది మృతి, పలువురికి గాయాలు.