లోకేశ్ ఎక్కడ?
హైదరాబాద్: 'ఓటుకు కోట్లు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ను పసిగట్టలేకపోయారని ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు నుంచి అనురాధను తప్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనికి ఎవరిపై చర్య తీసుకోవాలి. నైతిక బాధ్యత వహించి సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి'.. పుష్కరాల్లో తొక్కిసలాట తర్వాత సామాన్యుల నుంచి వ్యక్తమైన స్పందనల్లో ఇది ఒకటి. విజయవాడకు చెందిన శివారెడ్డి పై విధంగా స్పందించారు.
'మహా ఘోరం' తర్వాత బాధితులు పెద్ద ఎత్తున 'సాక్షి'కి ఫోన్ చేశారు. పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఏకరువు పెట్టారు. సర్కారు చేతిగానితనానికి అమాయకులు బలైయ్యారని ఆక్రోశించారు. ఇంటెలిజెన్స్ ను తన కోసం ఉపయోగించుకోవాలనుకున్న చంద్రబాబు పుష్కరాలు లాంటి భారీ అధ్యాత్మిక కార్యక్రమానికి నిఘా విభాగాన్ని ఎందుకు వినియోగించలేదని మరొకరు ప్రశ్నించారు. ఆర్భాటాలపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. పుష్కరాలకు తరలిరండి అంటూ హోరెత్తించిన ప్రభుత్వం అక్కడ పాటించాల్సిన జాగ్రత్తలపై భక్తులకు తెల్పడంలో చతికిలపడిందని పలువురు భక్తులు విమర్శించారు.
కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్న యూపీ ప్రభుత్వం సహాయం తీసుకోవాలని రామకృష్ణ అనే వ్యక్తి సూచించారు. నారా లోకేశ్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ మాదిరిగా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. సిగ్గులేని ప్రభుత్వం అంటూ ఈసడించారు. మిగిలిన 11 రోజుల్లో ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు.