ప్రచార ఆర్భాటమే ప్రాణాలు తీసిందా?
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఉన్నా రాజమండ్రి ప్రాంతాన్నే ఏపీ ప్రభుత్వం హైలెట్ చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, వీఐపీ ఘాట్లు అన్నీ రాజమండ్రిలోనే ఏర్పాటు చేశారు.
గత నాలుగు రోజులుగా రాజమండ్రి గురించే విపరీతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వ ఆర్భాటంతో ఆకర్షితుడైన భక్తులు రాజమండ్రికి పోటెత్తారు. ఫలితంగా పుష్కర, కోటిలింగాల ఘాట్లకు భక్తులు పెరిగారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం వీఐపీ ఘాట్లకు పరిమితం కావడంతో సామాన్య భక్తులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
సీఎం చంద్రబాబు పుష్కరస్నానం కోసం అన్ని గేట్లు మూసివేశారు. చంద్రబాబు పూజలు అనంతరం ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తోపులాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పుష్కర ఘాట్లకు సమీపంలో అంబులెన్స్ లు కూడా లేవు. వైద్యశిబిరాల్లో కనీసం తాగునీరు కల్పించలేదు. రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో 27మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.