టూరిస్టు బస్సు బోల్తా
- సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 28 మందికి గాయాలు
- 8 మంది పరిస్థితి విషమం
నందిగామ/ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యా యి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లోని కాకాగూడ ప్రాంతాలకు చెందిన 48 మంది ప్రయాణికులు మోహిని ట్రావెల్స్ బస్సులో ఫిబ్రవరి 9న తీర్థయాత్రలకు బయల్దేరారు. మేడారం జాతర, భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండ గా... మునగచర్ల సమీపంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో వెనుక టైర్లు బస్సు నుంచి వేరయ్యాయి. అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు వచ్చారు.
ఈ ప్రమాదంలో చేకూరి శోభారాణి, జి.అంజమ్మ, గుండెపల్లి విమల, ఎ.స్వరూపరాణి, జి.సత్యనారాయణ, ఎం.సరిత, ఎం.లక్ష్మి, ఎస్.అఖిల, లింగాల మంగ, సుస్మిత, జి.జమ్‌ధీర్, ఆర్.ఉమాకారత్, వై.సహస్ర, పి.తుసీక్, ఎం.పద్మ, ఎల్.మంగ, ఎన్.లక్ష్మి, ఎం.ఆశ, ఎస్.లావణ్య, జి.స్వరూప, పి.రామకృష్ణ, పి.కొండమ్మ, ఎం.ఆనంద్‌గౌడ్, నవీన్‌గౌడ్ ఆర్.కళావతి, ఎల్.సునీల్ కుమా ర్, జె.దుర్గమ్మ, పి.ఇందిర, ఎల్.విక్రమ్‌గౌడ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు నందిగామ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని పలు ఆసుపత్రులకు తరలించారు. మిగతా ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల్లో సికింద్రాబాద్‌కు పంపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
వేరే ప్రమాదంలో..
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీవీ సీరియల్ బృందం కారు ఆదివారం ఇబ్రహీంపట్నం రింగురోడ్డు సెంటర్‌లో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి.