పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు. (ఇన్‌సెట్‌లో) బస్‌డ్రైవర్ దేవ ఇరక్కమ్
వెంకటాపురం(కె): టూరిస్ట్ బస్సుడ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా.. బస్సుకు బ్రేక్ వేయడంతో తక్కువ వేగంతో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఏమీ కాలేదు కానీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం అంకన్నగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రయాణీకుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 45మంది శక్తి మాలలు ధరించి తీర్థ యాత్రల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భద్రాచలం పర్ణశాల నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి బయలుదేరారు.
బస్‌డ్రైవర్ దేవ ఇరక్కమ్ (49) పర్ణశాల వద్ద నుంచే తనకు గుండె వద్ద నొప్పి వస్తోందని ఇబ్బందిగా ఉందని తెలిపాడు. దీంతో వేరే డ్రైవర్‌ను పిలిపించాలని ప్రయాణికులు సూచించారు. మరో డ్రైవర్ రావడానికి రెండు రోజులు పడుతుందని, అప్పటివరకు తానే బస్సు నడుపుతానని చెప్పి యాదాద్రికి బయలుదేరాడు. అంకన్నగూడెం గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్‌కు గుండెనొప్పి తీవ్రమై ఒక్కసారిగా కుప్పకూలాడు.
బస్సు నెమ్మదిగా ఉండడం, డ్రైవర్ నొప్పితో ఉన్నా బ్రేక్ వేయడంతో బస్సు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. అపస్మారకస్థితిలో ఉన్న డ్రైవర్‌ను వెంటనే 108లో వెంకటాపురం వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. బస్సులోని 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ నొప్పి ఉన్నా సమయస్ఫూర్తితో బ్రేక్ వేశాడని, లేదంటే పెనుప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment