బస్సులో వీడియో రాలేదని డ్రైవర్‌తో వాగ్వాదం
ప్రయాణికులపై దాడికి దిగిన డ్రైవర్
పలమనేరుకు చేరిన ఓంశక్తి భక్తుల పంచాయితీ
పలమనేరు (చిత్తూరు): ఓంశక్తి మాల ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు డీజే టిల్లూ డ్యాన్సు చుక్కలు చూపించిన సంఘటన ఆదివారం పలమనేరులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన 34 మంది ఓంశక్తి భక్తులు ప్రైవేటు బస్సును రూ.1.25లక్షలకు మాట్లాడుకొని ఆలయాల సందర్శనకు ఈ నెల 22న బయల్దేరారు.
బస్సు అద్దెకు చెల్లించిన మొత్తం పోగా మిగిలిన పదివేలను స్వగ్రామంలో బస్సు దిగినాక ఇస్తామని తెలిపారు. ఈ టూరిస్ట్ బస్సు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల సందర్శనానంతరం బయలుదేరింది. ఈ నేపథ్యంలో బాగేపల్లి వద్ద డ్రైవర్ అరవింద్ డీజిల్‌కు డబ్బులిస్తేనే బస్సు కదులుతుందని ఆపేశాడు. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహించిన బస్సు డ్రైవర్ మహిళలపై దాడికి దిగాడు. తనకు డబ్బులు మొత్తం ఇస్తేనే బస్సు కదులుతుందని తెగేసి చెప్పారు.
వారు ఇవ్వకపోవడంతో కర్ణాటకలోని ధర్మస్థలం వద్ద ప్రయాణికులను బస్సులోంచి దింపేశాడు. దీంతో పిల్లాపాపలతో వారంతా రాత్రిపూట రోడ్డుపై పడుకోవాల్సి వచ్చింది. ఆపై అందరూ కలిసి డబ్బులు సమకూర్చుకుని అదే బస్సులో ప్రయాణం మొదలు పెట్టారు. మార్గమధ్యంలో బస్సులోని వారు డీజే టిల్లు వీడియో సాంగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే బస్సులో వీడియో పనిచేయడం లేదని డ్రైవర్ చెప్పాడు.
అప్పుడేమో అన్నీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని మళ్లీ డ్రైవర్‌తో ప్రయాణికులతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో బస్సులోని కొందరు యువకులు డీజే టిల్లు డ్యాన్స్‌లు మొదలు పెట్టారు. దీంతో డ్రైవర్ బస్సును పలమనేరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆపేసి తమ యజమానికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న యజమాని, డ్రైవర్లు స్థానిక యూనియన్ నాయకులతో కలసి సమస్యను పరిష్కరించారు. బస్సు గ్రామానికి వెళ్లిన తరువాత మిగిలిన అద్దె ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో ఓంశక్తి భక్తులు ఊరు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment