హాలీసిక్కా.. తికమక | Halle sicca ..   Confuse | Sakshi
Sakshi News home page

హాలీసిక్కా.. తికమక

Published Mon, Jun 23 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

హాలీసిక్కా..  తికమక

హాలీసిక్కా.. తికమక

అప్పటికీ బాగా గుర్తు... అది 1946 డిసెంబర్. మా రాజమండ్రి నుంచి మొట్టమొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాం. తీర్థయాత్రల కోసం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగగానే మా కుటుంబానికి ఓ వింత అనుభవం. పోలీసులు చుట్టుముట్టారు. బ్యాగులు సోదా చేశారు. ఎందుకో... కాసేపటికి కానీ అర్థం కాలేదు... నిజాం రాజ్యానికి వచ్చినందుకే ఈ తనిఖీలని. ఇక మా వద్ద ఉన్న  రూపాయాలను ‘హాలీసిక్కా’లోకి మార్చుకోవాల్సి వచ్చింది. హాలీసిక్కా అంటే నిజాం కరెన్సీ! స్టేషన్ దగ్గర్లోనే కరెన్సీ మార్చుకొని నగర పర్యటనకు బయలుదేరాం. రూపాయిలైతే మారాయి. కానీ, నిజాం కరెన్సీకి... మా రూపాయలకు లెక్క కుదిరేది కాదు. ఎక్కడికెళ్లినా గందరగోళం. ఎన్ని రూపాయలకు ఎన్ని హాలీసిక్కాలు అనేది పెద్ద తికమక. అప్పటికైతే ఎలాగోలా తీర్థయాత్ర అయిపోయింది. కొద్ది రోజుల తరువాత పై చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చా. అయినా... అదే తికమక. కొంతకాలం కరెన్సీ లెక్కలతో కుస్తీ పట్టాల్సి వచ్చింది. కొద్ది రోజుల తరువాత స్వాతంత్య్రం రావడం... పోలీసు చర్య... హైదరాబాద్ భారత్‌లో కలిసిపోవడంతో నా సమస్య పరిష్కారమైంది.
 
మేడలో ప్రయాణం చేస్తున్నట్లు...


 నాడు నగరంలో మరో వింత... డబుల్ డెక్కర్ బస్సు. ఆ బస్సు పైఅంతస్తు ఎక్కితే... మేడలో కూర్చొని వెళుతున్నట్లనిపించేది. సికింద్రా బాద్‌కు వస్తే.. తప్పనిసరిగా డబుల్ డెక్కర్ ఎక్కాల్సిందే. ‘కింది బస్సు సరే... పైన ఉన్న బస్సు ఇంజన్ లేకుండా ఎలా ముందుకెళుతుంది’ అని మా బంధువులు అమాయకంగా అడిగినప్పుడు నవ్వాగేది కాదు. సాయంకాలం వేళ హుస్సేన్‌సాగర్ పైనుంచి డబుల్‌డెక్కర్‌లో వెళ్తుంటే అలలపై నుంచి వచ్చే చల్లటి గాలులు ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చేవి. అప్పుడు జట్కాల మీద ప్రయాణం మధురస్మృతిని మిగిల్చేది. ఇప్పుడు అలాంటి జ్ఞాపకాలు ఎక్కడున్నాయి..!
 
ఛీటేవాలే మౌస్ మధురం...

 నగరంలో ఛీటేవాలే మౌస్ (నల్ల చుక్కలున్న అరటిపండ్లు) బాగా దొరికేవి. ఇక్కడకు వచ్చినప్పుడల్లా మా నాన్న వాటిని తినకుండా వెళ్లేవాడు కాదు. 1953, 54, 55 సంవత్సరాల్లో భద్రతపై ఎలాంటి ఆందోళన ఉండేది కాదు. నారాయణగూడ, హిమాయత్‌నగర్ మధ్యలో ఓ ఇంట్లో మేం అద్దెకుండేవాళ్లం. ఎండాకాలంలో ఇంటి బయటే మంచాలు వేసుకొని, తలగడ కింద ఇంటి తాళంచెవులు పెట్టుకొని హాయిగా పడుకునేవాళ్లం. దొంగతనాలు జరిగేవి కావు. ఇప్పుడు... పడుకున్నా లోపలికి దొంగలు చొరబడి  దోచుకుపోయిన సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం.
 
వాంకె శ్రీనివాస్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement