బాసర, న్యూస్‌లైన్ : దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం. అమ్మవారి దర్శనానికి నిత్యం మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా పలు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇందులో సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా ఉంటారు. భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అతిథి గృహాలు అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు అవస్థలు పడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 2004లో దత్తపీఠం, మైసూరు, శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్ని హంగులతో 100 గదుల అతిథి గృహాన్ని నిర్మించి ప్రారంభించారు. ఐదేళ్ల నుంచి ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మెరుగైన వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. బాసరలో వివిధ ఆలయాల అతిథి గృహాలు ఉన్నాయి. వీటిని రూ.300 నుంచి రూ.1,500 వరకు అద్దెకు ఇస్తున్నారు. వీటి ద్వారా ఆలయానికి ఏటా రూ.30 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతోంది. అయినా అధికారులు మాత్రం వసతులు కల్పించడంలో విఫలం అవుతున్నారు.
సిబ్బంది ఇష్టారాజ్యం.. సాధారణ భక్తులకు అవస్థలు..
బాసరలో ఏసీ రాజన్న నిలయం, సోమ(బాబ్లీ), ద్వారక తిరుమల, వేములవాడ, విజయవాడ కనుకదుర్గ, యాదగిరి గుట్ట, శ్రీశైలం, టీటీృడీ వెంకటేశ్వర అతిథి గృహాలతోపాటు ఏసీ, నాన్ ఏసీ, మంచం గదులు ఉన్నాయి. కాగా, శ్రీ వెంకటేశ్వర అథితి గృహాంలో సేవలు అందించే సిబ్బంది తమ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, 10 మంది ఎన్‌ఎంఆర్‌లు, రాత్రి ఇద్దరు, పగలు 8 మంది, ఏసీ రూమ్‌లలో నలుగురు విధులు నిర్వహిస్తారు.
ఇంతవరకు బాగానే ఉన్నా భక్తులు వినియోగించుకోవాల్సిన గదులను సిబ్బంది, హోంగార్డులు వినియోగిస్తున్నారు. దీంతో శుభదినాలలో అమ్మవారి మూలనక్షత్రం, దసరా నవరాత్రులు, మహాశివ రాత్రి, వ్యాస పౌర్ణమి పండుగ సందర్భాలలో అమ్మవారి దర్శనానికి భక్తులు వచ్చినప్పుడు గదులు దొరకక, ప్రైవేటు లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా దేవుడు ముందర భక్తులు అందరు సమానులే అంటారే తప్పా, ఆచరణలో అధికారులు కనికరించడం లేదు. అతిథి గృహాలకు వచ్చే వీఐపీ, సాధారణ భక్తుల కోసం ఏసీ, నాన్ ఏసీ గదులు ఉన్నా సాధారణ భక్తులు తమకు గది కావాలన్నా అధికారులు గదులు ఖాళీ లేవని కౌంటర్ బోర్డులు పెట్టేస్తారు. అదే వీఐపీ వస్తున్నారంటే ముందే ఫోన్ ద్వారా సమాచారం తీసుకోని ఏసీ బుక్ చేస్తారు. ఇదేమని సాధారణ భక్తులు ప్రశ్నిస్తే మాకు తెలియదు. గది కావాలంటే ప్రైవేటు లాడ్జిలను ఆశ్రయించాలని ఉచిత సలహాలిస్తుంటారు.
మరమ్మతుకు నోచుకోని కిటికీలు, ముఖద్వారాలు
భక్తులు వినియోగించుకోనే అతిథి గృహ గదులకు కిటికీలు, తలుపులు లేకపోవడంతో కిటికీలకు అట్ట ముక్కలు అడ్డుగా పెట్టారు. చలితో భక్తులు వణికిపోతున్నారు. కొన్ని అతిథి గృహాలలో మంచాలు విరిగాయి. వాష్‌బెషిన్‌లు, పైప్‌లైన్ లీకేజీలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. గోడపై పిచ్చి రాతలు అలానే ఉంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు చూసి చెరిపేయాల్సిన అవసరం ఉంది. ఏసీ గదులలో సోఫాసేట్‌తోపాటు కోన్ని ఏసీలు పనిచేయడం లేదు. భక్తుల నుంచి మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏటా మరమ్మతుల పేరిట రూ.లక్షల ఖర్చు చూపిస్తున్న అధికారులు వసతులు కల్పించడంలో విఫలం అవుతున్నారు.
ఫలితంగా భక్తులు అవస్థలు పడుతూనే ఉన్నారు. వీటికి తోడు పరిశుభ్రత కూడా సరిగ్గా ఉండ టం లేదు. ఆవరణల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. అతిథి గృహాల చుట్టూ వ్యర్థపదార్థాలు, పలిగిన సీసా ముక్కలు, చెత్తా చెదారం తొలగించకపోవడంతో ఆ ప్రాంతంలో దోమలతోపాటు, దుర్గందం వెదజల్లుతోంది. అథితి గృహాల చుట్టూ తేనె తుట్టేలు పెట్టాయి. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ ఆలయ ఈవో ముత్యాలరావుకు వివరణ కోరగా అతిథి గృహాల్లో సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు.
‘అతిథి’ కష్టాలు
Published Mon, Jan 13 2014 5:55 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
Advertisement