కన్నీటితుఫాన్
- మూగబోయిన మోసయ్యపేట
- తీర్ధయాత్రలో మహా విషాదం
- ధవళేశ్వరం ప్రమాదంలో 22మంది దుర్మరణం
- మృతుల్లో 8మంది మహిళలు.. ఏడుగురు చిన్నారులు
- ముగిసిన అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు
పాపం.. నిద్రిస్తున్న గోదారికి తెలియదు.. ఊయలలూపాల్సిన తన అలలే ఊపిరి తీస్తాయని! చల్లని గాలి తెమ్మెరకు తెలియదు.. జోల పాడాల్సిన తన పాట మృత్యు గీతంగా మారుతుందని! పొంగిపొర్లే ఆనందానికీ, ఉప్పొంగిపోయే ఉల్లాసానికీ తెలియనే తెలీదు.. కాలువలు కట్టే కన్నీటికి తామే సాక్ష్యంగా మారాల్సి ఉంటుందని! ఏడుకొండల వెంకన్నకూ, బెజవాడ దుర్గమ్మకూ తెలియదు గాక తెలియదు.. తమ ఆశీస్సులు పొంది ఆనందంగా వెళ్తున్న కుటుంబాన్ని మృత్యువు ఇంత ఘోరంగా కబళిస్తుందని! ఎవరికి తెలిసినా ఇంత దారుణం... ఇంత ఘాతుకం... ఇంత హృదయ విదారక విషాదం జరిగేదే కాదు. తెల్లారేసరికి అప్పన్న సన్నిధికి చేరుకునే సంతోషంలో, తర్వాత కాసేపటికి సొంతూరికి వెళ్లే సంబరంలో గాఢ నిద్రలో ఉన్న వారందరి బతుకు అనూహ్యంగా ముగిసిపోయేదే కాదు.
పసివాళ్లని కూడా చూడకుండా మృత్యువు ఇంత కర్కశంగా పరిమార్చేదే కాదు. ఇప్పుడెవరికి తెలిసినా ఏం లాభం? ఏ దేవుడి హృదయం ద్రవించినా ఏం ప్రయోజనం? ఎంతో మందిని సంతోషంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన వ్యక్తి తన కుటుంబాన్ని చివరి యాత్రకు తరలించాల్సి వస్తే.. ఏళ్ల తరబడి విశ్వాసంగా సేవ చేసిన వాహనం చివరికి తన యజమానినీ, అతని సమస్త కుటుంబాన్నీ నీటి పాలు చేయాల్సి వస్తే.. విధి లీల ఎంత చిత్రమో అర్ధమై కూడా ఏం ఉపయోగం! అందుకే కాబోలు.. ఇంత ఘాతుకాన్నీ కళ్లారా చూసి కూడా ధవళేశ్వరం వద్ద గోదావరి గుండెల్లో కన్నీటి సుళ్లు తిరుగుతున్నా... తన మానాన తాను ముందుకు పోతోంది. పాపం.. ఇక్కడ.. ఈ మోసయ్యపేటలో మాత్రం.. పచ్చగా తమ కళ్లెదుటే బతికిన డ్రైవర్ అప్పారావు కుటుంబం ఇంత అర్ధంతరంగా కనుమరుగైపోయినందుకు ఊరంతా పొగిలిపొగిలి ఏడుస్తోంది. ఇదేం లీల దేవుడా? అని గుండెలు బాదుకుని రోదిస్తోంది. తీర్థయాత్రలకని ఆడుతూ పాడుతూ బయల్దేరిన 22 మంది జలసమాధి అయిన పీడకలలాటి వాస్తవాన్ని తలచుకు కుమిలిపోతోంది. ఇహలోక యాత్ర ఇలా ముగిసిన వారికి శనివారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పరిసర గ్రామాల ప్రజానీకమంతా పాల్గొని శ్రద్ధాంజలి ఘటించింది. ఇక సెలవంటూ నిట్టూర్చింది.