శనివారం స్పెషల్: దోసకాయల గణేశుడిని చూసొద్దామా!
దోసకాయలు మహా మోసకాయలు.
అవి గణేశుడిని మోసం చేశాయి.
కుమార స్వామిని మోసం చేశాయి.
ఆఖరికి పార్వతి అమ్మవారిని కూడా మోసం చేశాయి.
ఈ ముగ్గురిని దోస తోటల్లోనే ఉంచేసుకున్నాయి. గుడిలేదు. గోపురం లేదు. ఆరుబయటే ఉండేలా చేశాయి. దోసకాయల కోసం దేవుళ్లే దిగొచ్చేలా చేశాయి.
ఆకాశమే గోపురంగా, చెట్లు పుట్టలే స్తంభాలుగా, పొలం నేలే గర్భగృహంగా, గోపాలకులే లోకపాలకుని ప్రతిష్ఠాతలుగా గణేశుడు కొలువుతీరేలా చేశాయి.
ఆ గణేశుడి పేరే దోసకాయల గణేశుడు!
దక్షిణ కనరా జిల్లా సౌతడ్కా గ్రామంలో నేత్రావతి నది ఒడ్డున దోసపంట మధ్యన కొలువై ఉన్నాడు దోసకాయల గణేశుడు. ఈ గణేశుడు మంజునాథుడు కొలువై ఉన్న ధర్మస్థళ నుంచి కేవలం 15 కిమీ దూరంలో ఉన్నాడు. కుక్కె సుబ్రమణ్యస్వామి మందిరం ఇక్కడినుంచి 40 కిమీ దూరం. మంగుళూరు 80 కిమీ దూరం.
సౌతె అంటే కన్నడభాషలో దోసకాయ అని అర్థం. అడ్కె అంటే దొరికే చోటు. కాబట్టి సౌతడ్కా అంటే మన తెలుగువాళ్ల దోసపాడు లాంటి పేరన్న మాట!
ఇంతకీ ఈ గణేశుడికీ, దోసకాయలకీ ఏమిటి సంబంధం?
ఒకసారి కైలాసం నుంచి గణేశుడు విహరిస్తూ విహరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడట! ఆయన్ను చూసిన గొల్ల పిల్లలు ఆయనకు దోసకాయలు నైవేద్యంగా పెట్టారట. ఆ దోసకాయలు గణేశుడికి ఎంత నచ్చాయంటే ఆయన అక్కడే పొలాల్లో బాసింపట్టు వేసుక్కూచున్నాడట.
ఆయన్ని వెతుక్కుంటూ కుమార స్వామి వచ్చాడట. ఆయన కూడా ఓ దోసకాయ తిన్నాడట. అంతే దోసకాయలు తింటూ అక్కడే ఉండిపోయాడట. బిడ్డలిద్దరూ ఎంత సేపటికీ రావడం లేదేమిటని వెతుక్కుంటూ తల్లి పార్వతి వచ్చిందట. ఆమె కూడా ఆ టేస్టుకి దాసోహం సారీ ....దోసోహం అయిపోయారట. అక్కడే బిడ్డలిద్దరితో పాటూ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారట. ఏ వరాలివ్వడంలో బిజీగా ఉన్నాడో తెలియదు కానీ శివయ్య మాత్రం రాలేదట. అయినా ఆయనని లింగాకారంలో ప్రతిష్ఠించి, కుకుంబర్ కైలాసం ఏర్పాటు చేసుకున్నారట.
అలా ఇప్పటికీ సౌతడ్కాలో దోసకాయలే శివుడి కుటుంబానికి ప్రసాదం. ఆయన భక్తులు తట్టలకొద్దీ దోసకాయల్ని నైవేద్యంగా ఇచ్చుకుంటారు.
సౌతడ్కా దోసకాయలు టేస్టులో బెస్టని ఇప్పటికీ ప్రతీతి. వినాయకుడిని, ఆయన ఫ్యామిలీని కట్టిపారేసిన ఆ దోసకాయల్ని ఓ సారి టేస్టు చేసొద్దాం వస్తారా మరి?