నక్షత్రకోట
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్‌లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు.
కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్‌పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి.
యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్‌స్టేషన్‌ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు.
మంచులో మెరిసిన నక్షత్రం...
హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్‌పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్‌ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment